ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా బోధన

ABN , First Publish Date - 2021-08-27T14:11:47+05:30 IST

మహోన్నత విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం (సెంట్రల్‌ యూనివర్సిటీ) స్ఫూర్తిగా తీసుకోవాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆ దిశగా ప్ర

ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా బోధన

కేంద్రీయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో ఉపరాష్ట్రపతి

అనంతపురం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మహోన్నత విజయనగర సామ్రాజ్య వైభవాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయం (సెంట్రల్‌ యూనివర్సిటీ) స్ఫూర్తిగా తీసుకోవాలని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఆ దిశగా ప్రపంచస్థాయి ప్రమాణాలను అందిపుచ్చుకొని భవిష్యత్‌ సవాళ్లకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి రెండేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం జేఎన్‌టీయూ ఆడిటోరియంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో ఢిల్లీ నుంచి వర్చువల్‌ విధానంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి సందేశమిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక భూమిక పోషించే విద్యారంగానికి మరింత ఊతమిచ్చే ఉద్దేశంతో అనంతపురం జిల్లాలో ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.



విజయనగర సామ్రాజ్యంలో భాగమైన రాయలసీమకు చారిత్రక ప్రాధాన్యంఉందన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం లోగో నాటి విజయనగర వైభవాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. చదువుతో పాటు విద్యార్థులు ఇక్కడి సంస్కృతి, సాంప్రదాయాల గురించి తెలుసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌ విధానం ద్వారా కేంద్ర విద్యాశాఖ మంత్రి డా.సుభా్‌షసర్కార్‌, అమరావతి నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు. అనంతపురం పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య, కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఎస్‌ఏ కోరి, జేఎన్‌టీయూ వైస్‌చాన్సలర్‌ ఆచార్య రంగజనార్ధన్‌, డీన్‌ ప్రొఫెసర్‌ ఆంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T14:11:47+05:30 IST