ధీరోదాత్త భీకాజీ కామాను స్మరించుకున్న ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-09-24T16:16:04+05:30 IST

భారత జాతీయ పతాక గౌరవాన్ని పెంపొందింపజేసిన, స్వాతంత్ర్య భావన బీజాలను రేకెత్తింపజేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు ధీరోదాత్త భీకాజా కామా 159వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు.

ధీరోదాత్త భీకాజీ కామాను స్మరించుకున్న ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: భారత జాతీయ పతాక గౌరవాన్ని పెంపొందింపజేసిన, స్వాతంత్ర్య భావన బీజాలను రేకెత్తింపజేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు ధీరోదాత్త భీకాజా కామా 159వ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళులర్పించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కామా చూపిన ప్రతిభాపావాలు, ధైర్యసాహసాలను వెంకయ్య స్మరించుకున్నారు. “ఈ పతాకం భారత స్వరాజ్య సంగ్రామానికి సంబంధించినది. దాని ఆవిర్భావం జరిగింది. ఇక్కడున్న పెద్దలంతా లేచి నిలబడి భారత స్వరాజ్య పతాకానికి నమస్కరించవలసిందిగా పిలుపునిస్తున్నాను.”  అంటూ ఈ మాటలతో భికాజీ కామా భారత జాతీయ పతాక గౌరవాన్ని పెంపొందింపజేయడమే గాక, స్వాతంత్ర్య భావన బీజాలను రేకెత్తింపజేశారన్నారు. 


1907వ సంవత్సరం జర్మనీలోని స్టుట్ గార్ట్ ప్రాంతం శ్రీమతి కామా అంతర్జాతీయ సోషలిస్ట్ సదస్సుకు హాజరైన క్షణాలు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగంలో భాగంగా “ఈ జెండా పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వేచ్ఛా ప్రేమికులంతా ఈ పోరాటనికి (భారత స్వరాజ్య సంగ్రామం) మద్దతు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను” అంటూ స్పష్టమైన పిలుపును ఇచ్చారన్నారు.


‘‘విస్మరించజాలని ఆ స్వాతంత్ర్య సమరయోధురాలి 159వ జయంతి నేడు. భారత స్వరాజ్య సంగ్రామం గురించి దేశ విదేశాల్లో చాటి చెప్పడం ద్వారా భారత దేశంలో బ్రిటీష్ పాలనను అంతం చేసే దిశగా తమ జీవితాన్ని అంకితం చేసిన ధీరోదాత్త ఆమె. సంపన్న పారసీ కుటుంబంలో జన్మించిన శ్రీమతి భికాజీ కామా చిన్నతనం నుంచే స్వరాజ్య పోరాటం వైపు ఆకర్షితులయ్యారు. మరో సంపన్న కుటుంబానికి చెందిన రుస్తోంజీ కామాను వివాహం చేసుకున్న ఆమె, ఇతరులకు సాయం చేయడం, సామాజిక కార్యక్రమాల కోసం పూర్తిగా జీవితాన్ని అంకింతం చేశారు. 


1896లో నాటి బొంబాయి నగరాన్ని ప్లేగు వ్యాధి అతలాకుతలం చేసినప్పుడు, శ్రీమతి భికాజీ కామా ఎంతో మంది ప్రజలకు, ఈ అంటువ్యాధి నుంచి బయట పడేందుకు స్వచ్ఛందంగా తమ సహకారం అందించారు. ఈ ప్రయత్నంలో ఉన్న సమయంలో ఆమె సైతం ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డారు. ఈ సమస్య నుంచి అనతి కాలంలోనే కోలుకోగలిగినప్పటికీ, ఆమె ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైంది. మరింత మెరుగైన చికిత్స కోసం ఆమె ఇంగ్లాండ్ వెళ్ళవలసి వచ్చింది.


 దాదాభాయ్ నౌరోజీ, శ్యామ్ జీ కృష్ణ వర్మ వంటి జాతీయ వాదులతో శ్రీమతి భికాజీ కామాకు లండన్‌లో పరిచయం ఏర్పడింది. సుదూర ఖండంలో భారతదేశ స్వేచ్ఛా పోరాటాన్ని ప్రోత్సహించడంలో ఆమె చురుకైన పాత్ర పోషించారు. వివిధ భాషల్లో ఆమెకున్న నైపుణ్యం, భారత స్వరాజ్య సంగ్రామం గురించి వివిధ దేశాల వారికి బలంగా చాటిచెప్పడంలో ఎంతో ఉపయోగపడింది. 


సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా శ్రీమతి భికాజీ కామా గారి చర్యలతో అప్రమత్తమైన బ్రిటీష్ వారు, ఆమెను భారతదేశంలోకి ప్రవేశించనీయకుండా నిషేధించారు. అనంతరం భారత స్వాతంత్ర్య సంగ్రామం పట్ల అభిప్రాయాలను సమీకరించేందుకు ఆమె ఫ్రాన్స్ వెళ్ళారు. ఫ్రాన్స్‌లో ప్యారిస్ ఇండియన్ సొసైటీ స్థాపనలో సహకారం అందించడమే గాక, “వందేమాతరం”, “మదన్స్ తల్వార్” పేరిట రెండు ప్రచురణలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించి, భారత స్వరాజ్య సంగ్రామ గొప్పతనాన్ని చాటిచెప్పారు. ఈ ప్రచురణలను బ్రిటీష్ వారికి కనపడకుండా, అతి రహస్యంగా భారత్‌లోకి రవాణా చేశారు. అంతే కాదు భారత స్వరాజ్య సంగ్రామ వీరుల్లో కొందరికి బొమ్మల్లో ఆయుధాలను దాచి పంపించడం ద్వారా వినూత్న మార్గంలో చొరవ తీసుకున్నారు. 


శ్రీమతి కామా మహిళాభ్యుదయం దిశగా చేపట్టిన కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి.  ఒకసారి విదేశాల్లో ఒక సమావేశానికి హాజరైన ఆమె, అక్కడ మహిళలు లేక పోవడం చూసి ఆశ్చర్యపోయారు. దేశ నిర్మాణంలో మహిళ పాత్రను ప్రముఖంగా ప్రస్తావిస్తూ వచ్చారు. “నేను సగం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషులను మాత్రమే చూస్తున్నాను. ఇక్కడ తల్లులు ఎక్కడ ఉన్నారు.? సోదరీమణులు ఎక్కడ ఉన్నారు..? మీరు పునాదులను, వ్యక్తిత్వ నిర్మాణం చేసే వారిని మరచిపోకూడదు” అంటూ స్త్రీలు లేకుండా ప్రగతి సాధ్యం కాదని, సామాజిక అభివృద్ధిలో పురుషులతో సమానంగా మహిళల పాత్ర కీలకమైనదని తెలియజేశారు.


 కుటుంబం, బంధువులు, స్నేహితులకు దూరంగా మూడు దశాబ్ధాల ప్రవాసంలో గడిపిన అనంతరం తీవ్రమైన అనారోగ్యం బారిన పడిన శ్రీమతి కామాను, అనేక షరతులతో తిరిగి భారతదేశంలోకి అనుమతించారు. చివరకు 74 సంవత్సరాల వయసులో, ఆమె ఎంతగానో ప్రేమించిన మాతృభూమి మీదకు అడుగు పెట్టిన కొన్ని నెలల తర్వాత 1936లో పరమపదించారు. వలస పాలనకు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా యూరప్, అమెరికా అంతటా ప్రజలను ప్రభావితం చేయడంలో శ్రీమతి కామా తీసుకున్న చొరవ మరచిపోలేనిది. భారత స్వరాజ్య సంగ్రామంలో శ్రీమతి భికాజీ కామా వంటి మహిళా మణులు పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. వారి నిరుపమాన త్యాగాలను స్మరించుకోవడమే గాక, భవిష్యత్ తరాలకు చాటిచెప్పడం మనందరి బాధ్యత’’ అంటూ వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Updated Date - 2020-09-24T16:16:04+05:30 IST