Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 23 2021 @ 14:58PM

నాగరికత, సంస్కృతులకు మూలం జానపద విజ్ఞానమే: ఉపరాష్ట్రపతి

బెంగళూరు: ఏ దేశ నాగరికత, సంస్కృతికైనా ఆ దేశంలోని జానపద విజ్ఞానమే మూలమని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భాష, కళలు, చేతిపనులు, పనిముట్లు, దుస్తులు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, వైద్యం, పంటలు, సంగీతం, నృత్యం, ఆటలు, హావభావాలన్నింటి సమాహారమే జానపద విజ్ఞానమని ఆయన తెలిపారు.ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పలువురు జానపద కళాకారులు అంతర్జాల వేదిక ద్వారా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జానపద సంపద లేకుండా భాషాభివృద్ధి, సాంస్కృతిక అభివృద్ధి జరగవని, ఈ రెండింటి పుట్టుక జానపదం నుంచే మొదలైందన్నారు. అమ్మ పాడే లాలిపాటలు, అలసట తెలియకుండా పాడుకునే శ్రామికుల గీతాలు, జీవితాన్ని తెలియజేసే ఆధ్యాత్మిక తత్త్వాలు ఇలా ఏ సాహిత్యాన్ని చూసినా జానపద వాసన స్పష్టంగా కనబడుతుందన్నారు. అలాంటి విలువైన జానపద సంపదను సంరక్షించుకుంటూ భాషా సంస్కృతులను నిరంతరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 


గ్రామీణ భారతానికీ, జానపదానికి అవినాభావ సంబంధం ఉందన్న ఉపరాష్ట్రపతి, గ్రామీణ ప్రజల జీవితాలనుంచే జానపద కళలు పుట్టాయన్నారు. చేస్తున్న పనిలో ఉత్సాహాన్ని పెంచడంతోపాటు వినోదం కోసం పాటలు, ఆటలు, నృత్యరూపాలతో జానపదాలను పల్లెప్రజలు సృష్టించుకున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి ఉందని తాను తరచూ చెప్పడం వెనక ఆంతర్యమిదేనని ఉపరాష్ట్రపతి అన్నారు. పల్లెల్లో ఉండే ప్రకృతి రమణీయత, శ్రమ సౌందర్యమే, నిష్కల్మషమైన ఆలోచనలు, తమతోపాటు తోటివారిపట్ల భూతదయతో ఉండటం వంటివన్నీ జానపదాలకు జీవగర్ర అని ఆయన పేర్కొన్నారు. చెట్టు, పుట్ట, పురుగు, పిట్ట.. ఇలా ప్రతీదీ మనిషికి కోసం పుట్టినట్లుగా భావించి వాటికి కూడా జానపద సాహిత్యంలో తగిన గౌరవాన్ని కల్పించారన్నారు. ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం జానపదాల్లో చాలా స్పష్టంగా కనబడుతుందన్నారు. 


ఆరంభంలో పల్లె ప్రజల శ్రమను మరిపించేందుకు పుట్టిన జానపదాలు, తదనంతర కాలంలో సామాజిక రుగ్మతల మీద పోరాటానికి ఎంతగానో ఉపయుక్తమయ్యాయన్న ఉపరాష్ట్రపతి, స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతం చేయడంలో జానపదాలు పాత్ర కీలకపాత్ర పోషించాయని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించి వారిలో ధైర్యాన్ని కల్పించే విషయంలో ఎందరో జానపద కళాకారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్న ఆయన, వారందరికీ అభినందనలు తెలియజేశారు.ప్రకృతిని, సహజత్వాన్ని, సమాజాన్ని, రస పరిపూర్ణతను ప్రతిబింబించే జానపద సాహిత్యం ఏనాడూ మేధోసంపత్తి హక్కుల (పేటెంట్ రైట్స్) కోసం ప్రయత్నించలేదని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఉపరాష్ట్రపతి, మన పెద్దలు జానపద సాహిత్యం ద్వారా తమ భావాలను, స్థానిక సమస్యలను వాటి పరిష్కారంలో తమ అనుభవాల సారాన్ని పాటలు, కథలు, కళల రూపంలో ముందు తరాలకు అందించారన్నారు.


హంగు, ఆర్భాటం లేకుండా సరళమైన, చిన్న చిన్న పదాలతో లోతైన అంశాలను సైతం పండితుల నుంచి పామరుల వరకు సమాజంలోని ప్రతి ఒక్కరికీ స్పష్టంగా తెలియజేయడమే జానపదం గొప్పదనమన్న ఉపరాష్ట్రపతి, సంగీతానికి, నృత్యానికి ఉన్న శాస్త్రీయతే జానపదాలకూ ఉందన్నారు. వీధినాటకాలు, తోలుబొమ్మలాటలు, బుర్రకథలు, యక్షగానాలు, జముకుల కథలు, పగటి వేషాలు వంటి వందలాది జానపద కళారూపాలు ఆ రోజుల్లో పల్లె ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచాయన్న ఆయన, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబించే భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి తమదైన ప్రత్యేక జానపద కళారూపాలున్నాయన్నారు.ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి తన చిన్ననాటి సంగతులను గుర్తుచేసుకుంటూ పండుగ రాగానే తోలుబొమ్మలాట, కోలాటాలు, సంక్రాంతి సమయంలో హరిదాసులు, గంగిరెద్దులతో ఊరంతా కోలాహలంగా ఉండేదన్నారు.

రైతులు తాము పండించిన దాంట్లో కొంత భాగాన్ని కళాకారులకు పంచి, ఎన్నో విశేషాలు వారి నుంచి తెలుసుకునే వారన్నారు. రేడియో, సినిమా, టీవీల ప్రాధాన్యత పెరగక ముందు జానపద కళారూపాలే ప్రధాన వినోద సాధనాలుగా ఉండేవని ఆయన తెలిపారు.ఇంతటి విలువైన జానపద సంపదను కాపాడుకునేందుకు ఈ సాహిత్యాన్ని పుస్తకాల రూపంలో అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. జానపద సాహిత్యం మీద విశ్వవిద్యాలయ స్థాయిల్లో పరిశోధనలు జరుగుతున్నప్పటికీ, ఆ ప్రయత్నాలు మాత్రమే సరిపోవడం లేదన్నారు. యువతకు జానపద సాహిత్యం మీద అవగాహన కల్పించడంపై జానపద కళాకారులు, భాషావేత్తలు, ఉన్నతవిద్యాసంస్థలు మరింత దృష్టిసారించాలన్నారు. జానపద విజ్ఞానాన్ని కాపాడుకుని ముందు తరాలకు అందించేందుకు కళాకారులు సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ, సృజనాత్మక విధానాల మీద దృష్టి పెట్టాలని తెలిపారు. 


మాతృభాషను కాపాడుకోవడంలో జానపదాల పాత్రను విస్మరించకూడదని ఉపరాష్ట్రపతి దిశానిర్దేశం చేశారు.సినిమా, టీవీ, రేడియో జానపదాలకు ప్రాధాన్యత మరింత పెంచాలని సూచించిన ఉపరాష్ట్రపతి, భారతీయ యువతలో అద్భుతమైన తెలివి తేటలు ఉన్నాయని, వాటిని మన సంస్కృతి వైపు మరలించి, అద్భుతాలు సాధించేలా చేయగల శక్తి జానపదాలకు ఉందని తెలిపారు. ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని తెలిపారు. ఇదే వేదిక నుంచి ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. వారి దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ జానపద గాయకుడు దామోదరం గణపతి రావు, జానపద పరిశోధకులు డా. సగిలి సుధారాణి, జానపద గాయకుడు డా. లింగ శ్రీనివాస్ సహా దేశవిదేశాలకు చెందిన జానపద కళాకారులు, జానపద కళాభిమానులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.

Advertisement
Advertisement