Abn logo
Nov 26 2020 @ 18:18PM

సమగ్ర వికాసానికి విద్యావ్యవస్థను పున:సమీక్షించుకోవాలి: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: విలువలు, నైతికతతో కూడిన సమగ్ర విద్యావికాసాన్ని ప్రతిబింబించేలా మన విద్యావిధానాన్ని పున:సమీక్షించుకోవాల్సిన అవసరముందని, ఈ దిశగా విద్యావేత్తలు, విశ్వవిద్యాలయాలు కృషిచేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గురువారం ఉపరాష్ట్రపతి నివాసం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఇక్ఫాయ్ విశ్వవిద్యాలయం (సిక్కిం) ఈ-స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ప్రాచీన సమగ్రమైన వేద విద్యనుంచి స్ఫూర్తి పొందాలని నూతన జాతీయ విద్యావిధానానికి ఇదే ప్రేరణ అని పేర్కొన్నారు.


 విలువల్లేని విద్య విద్యేకాదన్న గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలను ఉటంకించిన ఉపరాష్ట్రపతి, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీ పట్టాలు అందించే సంస్థలుగా మిగలకుండా విద్యార్థుల్లో సంపూర్ణ మూర్తిమత్వాన్ని, సంపూర్ణ వికాసాన్ని పెంపొందించే కేంద్రాలుగా విలసిల్లాలని సూచించారు. ఇటీవలి కాలంలో విద్యలో సంపూర్ణ వికాసం అనే మాటనే పూర్తిగా విస్మరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.


వాతావరణంలో వస్తున్న మార్పులను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, ఈ విపరీతమైన మార్పులను పరిష్కరించుకునేందుకు మన విద్యావిధానంలో చిన్నప్పటినుంచి విలువలు, నైతికత, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత వంటి అంశాలను నేర్పించాల్సిన విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తీవ్రమైన ఈ వాతావరణ మార్పులను తట్టుకునేలా, ఈ సవాల్ కు పరిష్కారం కోసం ఇంజనీర్లకు అధునాతన సాంకేతికత అందజేయడతోపాటు వినూత్న ఆలోచనలను స్వాగతించాలన్నారు. ప్రకృతి విపత్తులను సమూలంగా నిర్మూలించలేమని కానీ నష్టాన్ని తగ్గించుకునేందుకు మనమంతా కృషిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.


మన పురాణేతిహాసాలు, ప్రాచీన శాస్త్రాలు వివరించిన విలువల వ్యవస్థను పునర్వినియోగంలోకి తెస్తూ వేదాలు, ఉపనిషత్తుల్లో పేర్కొన్న వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ప్రాకృతిక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కూడా ప్రతి ఒక్కరూ సంసిద్ధులవ్వాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమైన జీవితమే సరైనదని మన పెద్దలు చెప్పిన విషయాన్ని నిత్యజీవితంలో అమలుచేయాల్సిన తక్షణావసరం ఉందన్నారు. 


ప్రతి విద్యార్థి ప్రకృతి నుంచి నేర్చుకోవడంతో పాటు మన ప్రాచీన సంస్కృతిని దైనందిన జీవితంలో అమలుచేయడం ద్వారా వారి భవిష్యత్తును మరింత తేజోవంతంగా, ఫలప్రదంగా మార్చుకునేందుకు వీలవుతుందన్న ఉపరాష్ట్రపతి, మన ప్రాచీన విద్యావిధానమైన గురుకుల వ్యవస్థ ద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి వీలయ్యేదని, ఈ విధానం కారణంగానే భారతదేశం విశ్వగురుగా విరాజిల్లిందని గుర్తుచేశారు. 


భారతదేశాన్ని మరోసారి విశ్వగురు పీఠం మీద నిలబెట్టే లక్ష్యంతో ప్రస్తుత విద్యా విధానంలో సమగ్రమైన మార్పులు తీసుకొచ్చి నూతన జాతీయ విద్యావిధానాన్ని రూపొందించారన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థిలో సమగ్రమైన మార్పులు తీసుకొచ్చి.. సృజనాత్మకతను, పరిశోధన జిజ్ఞాసను, వినూత్నమైన ఆలోచనాధోరణిని చిన్నప్పటినుంచే వారిలో పెంపొందించేందుకు ఈ విద్యావిధానం ఎంతో ఉపయుక్తంగా మారుతుందన్నారు. నవభారత, ఆత్మనిర్భర భారత నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని కీలకమైన సమయంలో విద్యారంగంలో తీసుకొచ్చిన అతి ముఖ్యమైన సంస్కరణగా నూతన జాతీయ విద్యావిధానాన్ని ఉపరాష్ట్రపతి అభివర్ణించారు.


విలువలతో కూడిన విద్యావిధానానికి అధునాతన సాంకేతికతను జోడించడం తక్షణావసరమని.. తద్వారా మరింత లోతుగా విశ్లేషించి, విషయాన్ని అర్థం చేసుకునేందుకు, ఉన్నతమైన భావోద్వేగ మేధస్సును పెంపొందించుకునేందుకు వీలుంటుందన్నారు. అటు, విద్యార్థులు కూడా సానుకూల దృక్పథాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని సూచించిన ఉపరాష్ట్రపతి, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని చిత్తశుద్ధి, క్రమశిక్షణ, అంకితభావం అలవర్చుకుని ముందుకెళ్లాలన్నారు. పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త పద్ధతులను స్వాగతిస్తూ, వాటిని అలవర్చుకుంటూ పోటీ ప్రపంచంలో మనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. 


ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యలకు వాస్తవ, అమలుకు అనువైన పరిష్కారాలను కూడా విద్యార్థులు కనుగొనాలన్న ఉపరాష్ట్రపతి, ఇందుకు కరోనా మహమ్మారి నేపథ్యంలో తలెత్తిన అంశాలను ఆయన ఉటంకించారు. ‘కరోనా నుంచి మనం సరికొత్త పాఠాలను నేర్చుకోవాలి. వివిధ రంగాల నిపుణులు, ప్రముఖులు అందరూ కలిసి సమన్వయంతో పనిచేస్తూ ఈ సమస్యకు పరిష్కారం దిశగా కృషిచేయాలి. భవిష్యత్తులో ఎదురయ్యే ఇలాంటి సమస్యలను ముందుగానే గుర్తించి, ముందు జాగ్రత్తలు సూచించాలి’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.


విద్యార్థులు దేశ ప్రయోజనాలను, జాతీయవాదాన్ని అన్నిటికంటే ఉన్నతమైన లక్ష్యాలుగా ఎంచుకోవాలని సూచించిన ఉపరాష్ట్రపతి,  దీని కోసం సమాజాభివృద్ధికి అడ్డుగా ఉన్న పేదరికం, నిరక్షరాస్యత, లింగ వివక్షత వంటి సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు ముందుకురావాలన్నారు. ఇక్ఫాయ్ వ్యవస్థాపకుడు దివంగత  ఎన్.జె.యశస్విని గుర్తుచేసుకుంటూ.. ఈ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మరీ ముఖ్యంగా సిక్కిం వంటి ప్రాంతంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు.


ఈ కార్యక్రమంలో సిక్కిం గవర్నర్ గంగాప్రసాద్, సిక్కిం ముఖ్యమంత్రి  ప్రేంసింగ్ తమాంగ్, సిక్కిం విద్యాశాఖ మంత్రి  కుంగా నిమా లెప్చా, ఎంపీ అచ్యుత సమంత, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్సీ గుప్తా, ఇక్ఫాయ్ కులపతి డాక్టర్ ఆర్పీ కౌషిక్, ఉప కులపతి డాక్టర్ జగన్నాథ్ పట్నాయక్ తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు అంతర్జాలం ద్వారా పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement