వైద్య రంగంలో సంస్కరణలకు బాటలు వేయాలి: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2020-09-27T00:40:30+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సృష్టించిన అవాంతరాలను, అడ్డంకులను.. అవకాశాలుగా మలచుకుని.. డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ సహాయంతో వైద్యరంగంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషి జరగాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

వైద్య రంగంలో సంస్కరణలకు బాటలు వేయాలి: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి సృష్టించిన అవాంతరాలను, అడ్డంకులను.. అవకాశాలుగా మలచుకుని.. డిజిటల్ సాంకేతికత, కృత్రిమ మేధ సహాయంతో వైద్యరంగంలో సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషి జరగాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. అమెరికాలో ఉంటున్న భారత సంతతి వైద్యుల సంఘం (ఆపి) 38వ వార్షిక సదస్సును ఉద్దేశించి శనివారం అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.  


ఆరోగ్య వివరాల డిజిటైజేషన్‌తోపాటు దేశవ్యాప్తంగా ప్రజలందరి వైద్య రికార్డులను సేకరించి పదిలపరిచే జాతీయ వేదిక ఏర్పాటు జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. తద్వారా వైద్యరంగంలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉండేందుకు వీలవుతుందని.. దీనిద్వారా విలువైన సమాచారాన్ని వినియోగించుకుని మన వైద్యవ్యవస్థ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు వీలవుతుందన్నారు.


ప్రపంచంలోనే జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశంగా ఉండటంతోపాటు ఆర్థిక ప్రగతితో దూసుకుపోతున్న భారత్‌లో ప్రజావైద్య రంగంలో సవాళ్లతోపాటు విస్తృతమైన అవకాశాలు కూడా ఉన్నాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం వైద్యరంగంలో భారతదేశం పలు మైలురాళ్లను అధిగమించిందని గుర్తుచేశారు. ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలు, క్రియాశీలమైన ఫార్మాసూటికల్, బయోటెక్నాలజీ పరిశ్రమలు, క్లినికల్ ట్రయల్స్ పరిశ్రమతో పాటు విదేశీ వ్యాధిగ్రస్తులను ఆకర్షించే చక్కటి సౌకర్యాల ఆసుపత్రుల వ్యవస్థ భారత్‌కు ఒక వరమన్నారు. 


ప్రపంచానికి ఓ ఫార్మసీ కేంద్రంగా భారతదేశం గుర్తింపు తెచ్చుకుందని.. త్వరలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ వైద్య పర్యాటక కేంద్రంగా భాసిల్లబోతోందన్నారు. మనదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో పరస్పర విరుద్ధమైన అంశాలను గమనించవచ్చని.. ఓ వైపు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకుంటూ పట్టణాలు, నగరాల్లో చక్కటి ప్రైవేటు ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలు ఏర్పుడుతుంటే.. మరోవైపు, గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య వసతుల్లేని పరిస్థితులు ఆందోళన కరమన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు మాత్రమే సరిపోవని, వైద్యరంగంలోని ప్రైవేటు, పబ్లిక్ రంగాలల్లో భాగస్వామ్య పక్షాలు కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరముందున్నారు. 


గ్రామాల్లో కనీస వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు జిల్లాకేంద్రాల్లో సమగ్ర వైద్య కేంద్రాల ఏర్పాటులో  ప్రైవేటు రంగం పోషించాల్సిన పాత్ర క్రియాశీలకమన్నారు.భారతదేశ వైద్యులు, ఆరోగ్య రంగ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న సేవలు మన దేశానికి గర్వకారణమని.. అలాంటి నిపుణులు, వైద్యులు తమ దేశంలోని వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కొంత సమయం కేటాయించాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.


వైద్య విద్య, పరిశోధనల్లో సమన్వయం, దేశంలోని వైద్య నిపుణులతో కలిసి పనిచేయడం ద్వారా వైద్య ప్రమాణాలను పెంచడం తదితర అంశాల్లో విదేశాల్లోని భారత సంతతి వైద్యులు చొరవతీసుకోవాలని ఆయన సూచించారు. తద్వారా ఆత్మనిర్భర భారత నిర్మాణంలో తమవంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.


జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ప్రజల్లో మరీ ముఖ్యంగా యువతపై అసంక్రమిత వ్యాధుల ప్రభావం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఆపి వంటి సంస్థలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి అసంక్రమిత వ్యాధులపై జరుగుతున్న ప్రయత్నాలకు మరింత సహకారాన్ని అందించాలని సూచించారు.


సరైన సమయానికి, ఉన్నతప్రమాణాలతో కూడిన అత్యవసర వైద్యాన్ని అందించే విషయంలో ఈ రంగంలో పెట్టుబడులు పెరగాల్సిన అవసరముందని.. దీంతోపాటు ప్రథమ చికిత్స, కార్డియో పల్మనరీ  రిసస్సిటేషన్ (సీపీఆర్) వంటి వాటిపై ప్రజలకు శిక్షణ అందించడం తక్షణావసరం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆపీ అధ్యక్షుడు డాక్టర్ సురేశ్ రెడ్డి, ఆపీ ప్రెసిడెంట్ ఎలక్ట్ డాక్టర్ జొన్నలగడ్డ సుధాకర్, డాక్టర్ సీమా, డాక్టన్ సంజని షాతోపాటు ఆపీ సభ్యులు, వైద్యులు, వైద్య నిపుణులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు.

Updated Date - 2020-09-27T00:40:30+05:30 IST