ఉప సర్పంచ్‌ పదవిపై వైసీపీ కన్ను?

ABN , First Publish Date - 2021-03-03T15:42:40+05:30 IST

సూరంపల్లి గ్రామ ఉప సర్పంచ్‌ పదవిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఎలాగైనా దీన్ని చేజిక్కించుకునేం దుకు విశ్వప్రయత్నాలు..

ఉప సర్పంచ్‌ పదవిపై వైసీపీ కన్ను?

వార్డు సభ్యుల్లో 9 మంది టీడీపీ మద్దతుదారులు

ఎన్నిక జరిగితే మెజార్టీ ప్రకారం టీడీపీ మద్దతుదారుడికే పదవి

సూరంపల్లిలో వ్యూహాత్మకంగా వాయిదా వేయిస్తున్న వైసీపీ నేతలు

ఎస్‌ఈసీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించని వైనం


గన్నవరం: సూరంపల్లి గ్రామ ఉప సర్పంచ్‌ పదవిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. ఎలాగైనా దీన్ని చేజిక్కించుకునేం దుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గెలుపొందిన టీడీపీ మద్దతుదారులను నయానో భయానో లొంగదీసుకుని ఆ తరువాత ఎన్నిక నిర్వహించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఎన్నికల రోజే నిర్వహించాల్సిన ఉప సర్పంచ్‌ ఎన్నిక పది రోజులైనా అధికారులు నిర్వహించటం లేదు. అదేమంటే ఆర్వో సెలవులో ఉన్నాడంటూ చెబుతున్నారు. దీని వెనుక ఉన్న కారణాలేంటో అందరికీ తెలుసు. దీంతో టీడీపీ మద్దతుదారులు ఎస్‌ఈసీ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఎలాంటి మార్పు లేదు. 


ఒకటి కాదు రెండు కాదు పది రోజులైనా ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించేందుకు తీరికలేదు. ఇది పూర్తిగా ఎన్నికల నిబంధనావళికి విరుద్ధమైనా అధికార వైసీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఈ విషయంలో చేతులెత్తేసిన ఘటన గన్నవరం మండలం సూరంపల్లిలో జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా చివరి విడతగా గన్నవరం మండలంలోని పంచాయతీలకు ఫిబ్రవరి 21న ఎన్నికలు జరిగాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించాలి. ఒకవేళ ఆ రోజున ఎన్నిక జరగకపోతే మరుసటి రోజున జరపాలి. అయితే సూరంపల్లి విషయంలో మాత్రం అధికారులు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కేశారు. మొత్తం 14 వార్డుల్లో ఒక వార్డు ఏకగ్రీవం కాగా మిగిలిన 13 వార్డులకు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ మద్దతుతో పోటీ చేసిన తొమ్మిది మంది విజయం సాధించగా, వైసీపీ మద్దతుదారులు నాలుగు చోట్ల గెలుపొందారు. సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారుడే విజయం సాధించారు. ఫిబ్రవరి 21న రాత్రి 12.30 గంటలకే కౌంటింగ్‌ ముగియగా, ఉప సర్పంచ్‌ ఎన్నికను నిర్వహించలేదు. కనీసం ఫిబ్రవరి 22న ఎన్నిక ఉంటుందని వార్డు సభ్యులుగా ఎన్నికైన వారు భావించారు. ఎన్నికల అధికారి సెలవు పెట్టారంటూ వాయిదా వేశారు.


మండల పరిషత్‌ అధికారులు సైతం ఉదాసీనంగా వ్యవహరించడంతో నేటివరకు ఉప సర్పంచ్‌ ఎన్నికను నిర్వహించని పరిస్థితి. పది రోజులుగా ఉప సర్పంచ్‌ ఎన్నిక జరగకపోవడంతో ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది. ఎలాంటి సమాచారం లేకుండా ఉప సర్పంచ్‌ ఎన్నికను వాయిదా వేయడంపై వార్డు సభ్యులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ (ఎస్‌ఈసీ) రమేష్‌కుమార్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌కు ఫిర్యాదు చేశారు. అధికారుల ఉదాసీనత కారణంగా అధికార వైసీపీ నుంచి తమకు బెదిరింపులు, ఒత్తిళ్లు వస్తున్నాయని వార్డు సభ్యులు చెబుతున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి సూరంపల్లి ఉప సర్పంచ్‌ ఎన్నికలపై నోటిఫికేషన్‌ జారీ చేయాలని వార్డు సభ్యులు కోరుతున్నారు. 


ఎందుకు వాయిదా పడిందో.. ఎంపీడీవో

సూరంపల్లి ఉప సర్పంచ్‌ ఎన్నిక వాయిదాపై ఎంపీడీవో వై సుభాషిణిని వివరణ కోరగా, ఎందుకు వాయిదా పడిందో తనకు తెలియదన్నారు. వాస్తవంగా కౌంటింగ్‌ అనంతరమే ఎన్నిక జరగాలి.. ఆర్‌వో ఎందుకు నిర్వహించలేదో తెలియదన్నారు. మరుసటి రోజున ఆర్‌వో సెలవు పెట్టడంతో ఉప సర్పంచ్‌ ఎన్నిక వాయిదా పడిందన్నారు. దీనిపై పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉందని ఆమె తెలిపారు.


Updated Date - 2021-03-03T15:42:40+05:30 IST