కరోనా పంజా..!

ABN , First Publish Date - 2020-05-31T10:28:40+05:30 IST

గ్రేటర్‌పై కరోనా పంజా విసురుతోంది. శనివారం కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. టక్కర్‌వాడీలో 32 ఏళ్ల వ్యక్తి వైరస్‌ బారిన పడ్డాడు. స్థానికంగా టిఫిన్‌ సెంటర్‌ నిర్వహించే ఇతను తీవ్ర అస్వస్థతకు గురి

కరోనా పంజా..!

పలు ప్రాంతాల్లో బాధితులు

రోజురోజుకూ పెరుగుతున్న సంఖ్య


మంగళ్‌హాట్‌/బర్కత్‌పుర/వినాయక్‌నగర్‌/మల్కాజిగిరి/ముషీరాబాద్‌/ రామంతాపూర్‌/అంబర్‌పేట/ఎల్‌బీనగర్‌/కుత్బుల్లాపూర్‌/బౌద్ధనగర్‌/చాదర్‌ఘాట్‌/ పేట్‌బషీరాబాద్‌/జీడిమెట్ల/ఖైరతాబాద్‌/అఫ్జల్‌గంజ్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌పై కరోనా పంజా విసురుతోంది. శనివారం కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. టక్కర్‌వాడీలో 32 ఏళ్ల వ్యక్తి వైరస్‌ బారిన పడ్డాడు. స్థానికంగా టిఫిన్‌ సెంటర్‌ నిర్వహించే ఇతను తీవ్ర అస్వస్థతకు గురి కాగా, ఈ నెల 29న కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా శనివారం నిర్ధారించారు. ఇతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తి ఇంట్లో సుమారు 40మంది వరకు ఉంటున్నట్లు తెలిసింది. హబీబ్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధి అఫ్జల్‌సాగర్‌లో మహిళ(21)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జాకీర్‌హుస్సేన్‌ కమ్యూనిటీ హాల్‌ వద్ద నివాసం ఉండే 42 ఏళ్ల వ్యక్తిని రెండు రోజుల క్రితం కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు కరోనా ఉన్నట్లు నిర్ధారించి గాంధీ ఆస్పత్రికి తరలించారు.  


నిండు గర్భిణికి పాజిటివ్‌..

మల్కాజిగిరి దుర్గానగర్‌కు చెందిన(20) నిండు గర్భిణికి కరోనా సోకింది. ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఈ నెల 27న ఏఎన్‌ఎం మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు, నిలోఫర్‌ ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. భర్తతో పాటు మరికొందరిని ప్రైమరీ కాంట్రాక్ట్‌లుగా గుర్తించారు. 


వస్త్రవ్యాపారి కుటుంబంలో మరో ఇద్దరికి.. 

భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీ పరిధిలోని రాంనగర్‌ జెమినీకాలనీలో కరోనా సోకిన వస్త్రవ్యాపారి భార్య, కుమార్తెలకూ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  మేదరబస్తీలో వృద్ధురాలికి పాజిటివ్‌ రాగా ఆమె కుమార్తె, హోటల్‌లో పనిచేసే మరొకరిని బేగంపేటలోని నేచర్‌క్యూర్‌ ఆస్పత్రికి తరలించినట్లు యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ మౌనిక తెలిపారు. 


రామాంతపూర్‌లో ఇద్దరికి..

రామంతాపూర్‌ కామాక్షిపురంలో నివసించే ఓ వ్యాపారి(36), సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అయిన అతడి భార్య (30)కు పాజిటివ్‌గా తేలింది. అధికారులు వారిని కింగ్‌కోఠి ఆస్పత్రికి తరలించి ఆ ప్రాంతాన్ని కట్టడి చేశారు. అదే భవనంలోని వారందరినీ హోం క్వారంటైన్‌ చేశారు.  


మటన్‌ షాపు వ్యక్తికి.. 

ఎల్‌బీనగర్‌ మసీద్‌గల్లీలో మటన్‌షాపు నిర్వహించే 65 ఏళ్ల వ్యక్తి ఇటీవల జియాగూడలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లి వచ్చాడు. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కింగ్‌కోఠి ఆస్పత్రికి పంపించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  


బహ్రెయిన్‌ నుంచి వచ్చి..  

సరూర్‌నగర్‌ చెరుకుతోటకాలనీకి చెందిన 36 ఏళ్ల వ్యక్తి కతర్‌ బహ్రెయిన్‌లో ఏసీ డక్ట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నవంబర్‌లో కతర్‌కు వెళ్లిన అతను ఈ నెల 19న నగరానికి వచ్చారు. అతడిని క్వారంటైన్‌లో ఉంచిన అధికారులు, హోం క్వారంటైన్‌లో ఉండమని ఇటీవల ఇంటికి పంపించారు. జ్వరం రావడంతో గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పాజిటివ్‌గా తేలింది. 


వాణీనగర్‌లో ఒకరికి..  

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధి వాణీనగర్‌లో వ్యక్తికి టైఫాయిడ్‌ లక్షణాలు ఉండడంతో శ్రీనివా్‌సనగర్‌లోని ఓ క్లినిక్‌లో చికిత్స చేయించుకున్నాడు. నయం కాకపోవడంతో శుక్రవారం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి వెళ్లాడు. శనివారం అతడికి కరోనా ఉన్నట్లు తేలింది. అతడి ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు అదే భవనంలో ఉంటున్న మరో ఆరు కుటుంబాల్లోని 16మందిని హోం క్వారంటైన్‌ చేశారు.  


సీతాఫల్‌మండిలో వృద్ధుడికి.. 

సీతాఫల్‌మండిలో నివాసముండే 88ఏళ్ల వృద్ధుడు ఈ నెల 6న ఓ బ్యాంకునకు, 15న రేషన్‌షాపునకు వెళ్లాడు. ఈ నెల 25న జ్వరం రావడంతో నామాలగుండులోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో చూపించుకున్నాడు. తగ్గకపోవడంతో మధురానగర్‌కాలనీలో ప్రైవేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి 27న సికింద్రాబాద్‌లోని మరో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు కింగ్‌కోఠి ఆస్పత్రికి పంపించారు. పరీక్షించగా కరోనాగా తేలింది.  


భార్యాభర్తలకు..  

ఆజంపురలోని ఉస్మాన్‌పుర ప్రాంతంలో వస్త్ర వ్యాపారికి, అతడి భార్య కు   పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌లో దుకాణం మూతపడగా, ఈనెల 20న తిరిగి తెరిచారు. మూడు, నాలుగు రోజులుగా వ్యాపారికి జ్వరంగా ఉండడంతో మొదట్లో పారాసిటమాల్‌ మాత్ర వేసుకున్నాడు. తగ్గకపోవడంతో నూర్‌ఖాన్‌ బజార్‌లోని ఓ వైద్యుడిని సంప్రదించాడు. ఇంతలో అతడి భార్య కూడా అస్వస్థతకు గురైంది. వీరు నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రికి వెళ్లగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇతడి కుటుంబంలోని  ఇద్దరి సరోజినీదేవి ఆస్పత్రికి, మరో ఇద్దరిని కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సెకండరీ కాంటాక్టులో ఉన్న 15 మందిని హోం క్వారంటైన్‌ చేశారు.


కార్మికుడికి వైరస్‌..

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధి రంగారెడ్డినగర్‌లో ఉంటూ ఓ పరిశ్రమలో పని చేసే 40ఏళ్ల కార్మికుడు కరోనా బారిన పడ్డాడు. నాలుగు రోజులు క్రితం అనారోగ్యం, శ్వాస తీసుకోవడంతో ఇబ్బందిగా ఉండడంతో గాంధీకి తీసుకెళ్లారు. పరీక్షించగా కరోనాగా తేలింది. అతడి కుటుంబసభ్యులతోపాటు పరిశ్రమలోని 14మందిని హోం క్వారంటైన్‌ చేశారు. 


నాలుగు నెలల చిన్నారికి.. 

జగద్గిరిగుట్ట మగ్ధూంనగర్‌లో నాలుగు నెలల చిన్నారి కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. అలాగే రింగ్‌బస్తీలో ఒకరు, దేవమ్మబస్తీలో మహిళకు కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. 


విశ్రాంత ఉద్యోగికి.. 

ఖైరతాబాద్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి(72) అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి పరీక్షించగా పాజిటివ్‌గా తేలింది. ఆయనను అదే ఆస్పత్రిలో చేర్పించారు.  


పటేల్‌నగర్‌లో మేస్ర్తీకి..

అంబర్‌పేట్‌ డివిజన్‌ పటేల్‌నగర్‌లో ఉండే ఓ మేస్త్రీ అనారోగ్యానికి గురి కావడంతో రెండు రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడికి వైరస్‌ నిర్ధారణ అయింది. సుందర్‌నగర్‌లో 52 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది.  


ముగ్గురికి కరోనా..  

షాహినాథ్‌గంజ్‌ ఠాణా పరిధిలో ముగ్గురికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. గోషామహల్‌ చందన్‌వాడీకి చెందిన యువకుడు(27), జుమ్మెరాత్‌బజార్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి(45), బేగంబజార్‌ ఎల్‌ఎంజీ స్కూల్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి(52)కి పాజిటివ్‌గా కింగ్‌ కోఠి ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. 


సరోజినీలో 11మంది అనుమానితులు 

మెహిదీపట్నం సరోజినీదేవి ప్రభుత్వ కంటి ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో   11మంది అనుమానితులు ఉన్నట్లు డాక్టర్‌ అనురాధ తెలిపారు.  


‘ఫీవర్‌’లో 16 మంది...  

నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రిలో 16అనుమానిత కేసులు నమోదయ్యాయి. వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. 


ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా.. 

నగరంలో ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చింది. మరో కానిస్టేబుల్‌ కుటుంబంలో ఐదుగురు వైరస్‌ బారిన పడ్డారు. వినాయక్‌నగర్‌ డివిజన్‌ శివనగర్‌లో నివాసముంటున్న ఓ కానిస్టేబుల్‌ ఎస్‌ఆర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి వైరస్‌ సోకడంతో గాంధీకి తరలించారు. అతడి భార్య, ఇద్దరు పిల్లలను నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి క్వారంటైన్‌లో ఉంచారు.  


ఎస్సార్‌నగర్‌లోనూ

ఎస్సార్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ కానిస్టేబుల్‌ ఒకరు కొన్నిరోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండగా శుక్రవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శనివారం అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడు నివాసముండే మారేడుపల్లిలోని కుటుంబసభ్యులను హోంక్వారంటైన్‌ చేశారు.  


కానిస్టేబుల్‌ కుటుంబంలో ఐదుగురికి..  

అంబర్‌పేట పీఎ్‌సలో పనిచేసే కానిస్టేబుల్‌ కుటుంబంలో ఐదుగురికి  పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తిలక్‌నగర్‌లో ఉండే కానిస్టేబుల్‌కు ఇటీవల వైరస్‌ సోకగా ఆయన భార్య, తల్లి, బావమరిది, చెల్లికి కూడా పాజిటివ్‌గా తేలింది. వారిని గాంధీకి తరలించారు.


నలుగురు మృతి 

కరోనాతో శనివారం నలుగురు మృతి చెందారు. బాగ్‌ అంబర్‌పేట్‌ తురాబ్‌నగర్‌లో ఉండే 54 ఏళ్ల వ్యక్తికి రెండు రోజుల క్రితం జ్వరం రావడంతో కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నమూనాలు సేకరించి, ఇంటికి పంపించారు. కాగా శనివారం అతడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. విషయం చెప్పేందుకు అధికారులు వృద్ధుడి కుమారుడికి ఫోన్‌ చేయగా అప్పటికే  తన తండ్రి చనిపోయాడని  చెప్పాడు. అధికారులు వెంటనే ఇంట్లో వారిని క్వారంటైన్‌ చేశారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. 


మంగళ్‌హాట్‌ గంగాబౌలిలో నివాసముంటూ వినాయక విగ్రహాలు తయారు చేసే 50ఏళ్ల వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో  ఈ నెల 26న స్థానికంగా ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి పంపించారు. పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గాంధీ ఆస్పత్రిలో శనివారం చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మంగళ్‌హాట్‌లో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య మూడుకు చేరింది.  


కాచిగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధి న్యూ ఇందిరానగర్‌కు చెందిన 58ఏళ్ల వ్యక్తి, బాగ్‌అంబర్‌పేట డివిజన్‌ తురాబ్‌నగర్‌లో 96 ఏళ్ల వృద్ధుడు కరోనాతో గాంధీలో చనిపోయారు.  


Updated Date - 2020-05-31T10:28:40+05:30 IST