బాధితులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-06-15T05:35:47+05:30 IST

ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ సమీపాన నిర్మిస్తున్న జయరాజ్‌ ఇస్ఫాత్‌ (ఉక్కు పరిశ్రమ)లో ఆదివా రం బ్లాస్టింగ్‌ నిర్వహించడంతో గుట్టపాడు గ్రామంలో కొన్ని ఇళ్లు పగుళ్లు ఇచ్చాయి.

బాధితులకు న్యాయం చేయాలి
రోడ్డుపై బైఠాయించిన గౌరు చరిత, రాజశేఖర్‌, ప్రభాకర్‌ రెడ్డి

  1. టీడీపీ, సీపీఎం నాయకుల డిమాండ్‌
  2. అడ్డుకున్న పోలీసులు.. 
  3. నిరసనగా బైఠాయింపు


ఓర్వకల్లు, జూన్‌ 14: ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామ సమీపాన నిర్మిస్తున్న జయరాజ్‌ ఇస్ఫాత్‌ (ఉక్కు పరిశ్రమ)లో ఆదివా రం బ్లాస్టింగ్‌ నిర్వహించడంతో గుట్టపాడు గ్రామంలో కొన్ని ఇళ్లు పగుళ్లు ఇచ్చాయి. పనుల్లో భాగంగా కాంట్రాక్టర్‌ బ్లాస్టింగ్‌ నిర్వహించ డంతో గ్రామస్థులు భయకంపితులయ్యారు. కొన్ని ఇంటి గోడలు బీటలు వారాయి. గత వారం రోజులుగా చిన్నగా బ్లాస్టింగ్‌ నిర్వహించారని, అయితే ఆదివారం మధ్యాహ్నం భారీగా బ్లాస్టింగ్‌ నిర్వహించడంతో భయపడ్డామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో సోమవారం టీడీపీ నాయకులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఉక్కు పరిశ్రమను సందర్శించేందుకు వెళ్తున్న వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై గంటన్నర పాటు బైఠాయించారు. మీకు అనుమతి లేదని 144 సెక్షన్‌ అమలులో ఉందని సీఐ శ్రీనాథ్‌రెడ్డి అడ్డుకోవడంతో నాయకులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పనులు అడ్డుకునేందుకు వెళ్లడం లేదని, ప్రజల పక్షాన పరిశీలించేందుకు వెళ్తున్నామని చెప్పినా సీఐ వినుకోలేదు. తహసీల్దార్‌ శివరాముడు కూడా వారికి నచ్చజెప్పారు. కర్నూలు డీఎస్పీ మహేష్‌ ఘటనా స్థలానికి చేరుకుని పది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో నాయకులు ఉక్కు పరిశ్రమలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ ఓపెన్‌ బ్లాస్టింగ్‌ వల్ల గుట్టపాడు గ్రామంలో గోడలు పగుళ్లు ఇచ్చాయని, చిన్న పిల్లలు, బాలింతలు, వృద్ధులు భయాందోళనలకు చెందుతున్నారని అన్నారు. ఇద్దరు గ్రామస్థులకు గుండెపోటు కూడా వచ్చిందన్నారు. కాంట్రాక్టర్‌కు కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ చేసేందుకు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్‌ ఓపెన్‌ బ్లాస్టింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. బీటలు వారిన ఇళ్లకు కాంట్రాక్టర్‌చే నష్టపరి హారం ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓర్వకల్లు లో విమానాశ్రయం, సోలార్‌, డీఆర్‌డీవో, ఉక్కు పరిశ్రమలు తెచ్చామని గుర్తు చేశారు. అభివృద్ధి పనులను తాము అడ్డుకోమన్నారు. ప్లాంటులో భూములు కోల్పోయిన ప్రతి రైతుకూ తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, గుట్టపాడు సర్పంచ్‌ మోహన్‌ రెడ్డి, టీడీపీ నాయకులు లక్ష్మీకాంత రెడ్డి, అన్వర్‌ బాషా, శ్రీనివాసరెడ్డి, మహేష్‌ రెడ్డి, నాగిరెడ్డి, గుట్టపాడు గ్రామస్థులు రామసుబ్బారెడ్డి, పుల్లయ్య, రాముడు, సీపీఎం నాయకులు నాగన్న, షాజహాన్‌, రామక్రిష్ణ, శ్రీధర్‌, గుట్టపాడు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-06-15T05:35:47+05:30 IST