ఈ గాయానికి మందెప్పుడో!?

ABN , First Publish Date - 2020-11-22T08:02:09+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌.. దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంఘటన!. విశాఖపట్నంలోని ఈ కంపెనీలో ప్రమాదం జరిగి ఆరు నెలలైనా విషవాయువు ప్రభావంతో భారీగా నష్టపోయిన సమీప వెంకటాపురం గ్రామం

ఈ గాయానికి మందెప్పుడో!?

రోగాలతో ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులు సతమతం

పలువురికి ఇప్పటికీ అందని రూ.10 వేల సాయం

6 నెలలుగా కన్నెత్తి చూడని నేతలు, అధికారులు 

వైద్య నిపుణులు లేని వైఎస్సార్‌ క్లినిక్‌ 

ప్రైవేటు ఆస్పత్రులే బాధితులకు దిక్కు

ప్రభుత్వ తీరుపై మండిపాటు


(విశాఖపట్నం/గోపాలపట్నం-ఆంధ్రజ్యోతి)

ఎల్‌జీ పాలిమర్స్‌.. దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన సంఘటన!. విశాఖపట్నంలోని ఈ కంపెనీలో ప్రమాదం జరిగి ఆరు నెలలైనా విషవాయువు ప్రభావంతో భారీగా నష్టపోయిన సమీప వెంకటాపురం గ్రామం ఇప్పటికీ స్థిమిత పడలేదు. ప్రమాదం సంభవించినప్పుడు ప్రభుత్వం హడావుడి చేసిందే తప్ప ఆ తర్వాత ఉత్పన్నమైన సమస్యలను పట్టించుకోలేదు. గ్రామస్థుల ఆక్రందన వినే నాథుడు కూడా లేడు. బాధిత గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ పది వేల రూపాయలిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. కానీ ఇప్పటికీ ఆ సాయం చాలామందికి అందలేదు.


ఈ ఆరు నెలల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు వెంకటాపురం వైపు కన్నెత్తికూడా చూడలేదు. ఇక ప్రమాదం అనంతరం కంపెనీ ప్రతినిధులు పరిసర గ్రామాల్లో పర్యటించినా.. ఇప్పుడు వారి ఆచూకీ కూడా లేదు.గ్రామానికి చెందిన 400 మంది కాంట్రాక్టు కార్మికులుగా ప్రస్తుతం సగం జీతంతో ఎల్‌జీ పాలిమర్స్‌లో పనిచేస్తున్నారు. డిసెంబరు తర్వాత వారిని పూర్తిగా నిలిపివేస్తామని యాజమాన్యం తెలపడంతో వారంతా అయోమయంలో పడ్డారు. గ్రామంలో పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’ గ్రౌండ్‌ రిపోర్టు.


కాళరాత్రి..

ఈ ఏడాది మే ఏడో తేదీ తెల్లవారుజాము.. నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో గల ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ లీకైన ఘటనలో 12 మంది ప్రా ణాలు కోల్పోగా వందలాది మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే.. అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ సంబంధిత వైద్య నిపుణులతో సేవలందిస్తామన్న పాలకుల హామీ నేటికీ నెరవేరలేదు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ 15 రోజులకోసారి అన్నిరకాల పరీక్షలు చేస్తారంటూ ఒక పుస్తకం చేతిలో పెట్టారు. ఆ పుస్తకం తీసుకుని ఎక్కడకు వెళ్లా లి?.. అనేది ఇప్పటికీ చెప్పలేదు. అప్పట్లో గ్రామస్థుల ఆందోళనతో గ్రామంలోనే శాశ్వత ఆస్పత్రి ఏర్పాటుచేస్తామని మంత్రులు ప్రకటించారు. అందుకు అనుగుణంగా పాఠశాలలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ ప్రారంభించారు. ఒక మెడికల్‌ ఆఫీసర్‌, ముగ్గురు స్టాఫ్‌నర్సులు, మరో నలుగురు క్లాస్‌-4 ఉద్యోగులను నియమించా రు. 24 గంటలు వైద్య సేవలు అందుతాయని ప్రకటించినా.. ఇప్పటివరకు ఒక డాక్టర్‌ ఉదయం 9 నుం చి సాయంత్రం 4 గంటల వరకు ఉంటున్నారు. రాత్రిపూట ఒక నర్సు విధుల్లో ఉంటారు. కానీ విషవాయువు కారణంగా వచ్చే రోగాలకు వైద్యం అందించే నిపుణులు లేరు. పీహెచ్‌సీలలో ఉండే సాదాసీదా మందులే ఇక్కడా ఉంటున్నాయి. క్లినిక్‌లో కనీసం బీపీ మెషీన్‌ కూడా లేదు.


ఈ నేపథ్యంలో ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులు విశాఖనగరం, గోపాలపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నా రు. వెళ్లిన ప్రతిసారీ డాక్టర్‌ ఫీజు, పరీక్షలు, మందులకు రూ.1500 నుంచి రూ.3 వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోందంటున్నారు. గడచిన ఆరు నెలల్లో వైద్యం కోసం బాధితులు రూ.20 నుంచి రూ.50 వేల వరకు వెచ్చించారు.  వెంకటాపురంలో శాశ్వత డిస్పెనరీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.   పక్కా భవనాల కోసం ఇంతవరకు ప్రయత్నం అం టూ చేయలేదు. స్థల సేకరణ ఊసూ లేదు.


పలువురికి ఇంకా అందని సాయం

విషవాయువు ఘటనలో చనిపోయిన వారికి రూ.కోటి, ఆస్పత్రిలో చేరి వారం రోజులు ఉన్నవారికి రూ.లక్ష పరిహారం ఇచ్చారు. వెంకటాపురంతో పాటు మిగిలిన గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రధాన బాధిత గ్రామం వెంకటాపురంలో చాలామందికి నేటికీ ఆ సాయం అందలేదు. బాధితులు ఎన్నిసార్లు వార్డు సచివాలయం చుట్టూ తిరిగినా పట్టించుకునే వారే లేరు.


ఇప్పటికీ పరిహారం అందలేదు

ప్రమాదం జరిగి ఆరు నెలలయినా ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల సాయం ఇంకా మా గ్రామంలో చాలామందికి అందలేదు. కరోనా కారణం గా ఉపాధి కూడా సరిగా లేదు. పరిహారం అందలేదని గ్రామ సచివాలయానికి ఎప్పుడు వెళ్లినా...రేపు, మాపు అని చెబుతున్నారు. 


సీరపు నూకరత్నం, వెంకటాపురం

భవిష్యత్తు ఆందోళనకరం

అది మాకు కాళరాత్రి. ఎల్‌జీ పాలిమర్స్‌ నుంచి విషవాయువు లీ కవ్వడంతో స్పృహ కోల్పోయి ఆస్ప త్రి పాలయ్యాం. అక్కడి నుంచి తిరిగొచ్చాక కొత్తరోగాలొచ్చాయి. నిద్రపట్టదు. ఉదరకోశ రోగం, వెన్ను నొ ప్పి, దద్దర్లు వచ్చాయి. మా కుమారుడి(25)పరిస్థితి మరీ దారుణం. పది నిమిషాలు కూడా నడవలేపోతున్నాడు. భవిష్యత్తు దుర్భరంగా మారుతోందనే ఆందోళన ఉంది. 

రమాసుందరి, బాధితురాలు, వెంకటాపురం 



గ్రామం కుదుటపడలేదు

ఎల్‌జీ పాలిమర్స్‌ ప్రమాదంతో గ్రామం ఇంకా కుదుటపడలేదు. పలువురికి పరిహారం అందలేదు. ఇళ్లలో దెబ్బతిన్న నిత్యావసర సరకులకు పరిహారం ఇస్తామన్నారు. అదీ లేదు. ఇచ్చిన రూ.పది వేలు.. ఇళ్లకు సున్నాలు వేయడానికే సరిపోలేదు. పాఠశాలలో ఆస్పత్రి ప్రారంభించడమేమిటని అడిగితే మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కోపం వచ్చింది.  

ఇల్లపు సన్యాసిరావు, గ్రామ పెద్ద, వెంకటాపురం 


పరిహారం కోసం కాళ్లరిగేలా..

ప్రతి ఒక్కరికీ రూ.పది వేల వంతున ఇస్తామన్నారు. అయితే మా కుటుంబంలో ఆరుగురికి పైసా కూడా ఇవ్వలేదు. సచివాలయానికి వెళ్లి అడిగితే.. వస్తాయని చెబుతున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదు.

ఇల్లపు జయలక్ష్మి, వెంకటాపురం 


ఎందుకీ పుస్తకం

గ్యాస్‌ పీల్చిన కారణంగా వచ్చే జబ్బులకు చికిత్స చేస్తామంటూ ప్ర తి ఒక్కరికీ ఒక పుస్తకం ఇచ్చారు. అ యితే ఆ పుస్తకం ఎక్కడ చూపిస్తే వైద్యం చేస్తారో ఎవరూ చెప్పడం లేదు. ఉపయోగం లేనప్పుడు ఎందుకీ పుస్తకం?


జి.కనకలక్ష్మి, వెంకటాపురం 

ఆయాసంతో తిప్పలు

గ్యాస్‌ పీల్చిన తరువాత రైలు పట్టాల సమీపంలో మా కుటుంబం లో ముగ్గురం స్పృహ కోల్పోతే ఆస్పత్రిలో చేర్చారు. ఏడాదిపాటు వైద్యం అందిస్తామని కంపెనీ ఎండీ వచ్చి చెప్పారు. ఇప్పటివరకు ఒక్కరూ రాలేదు. ఇప్పుడు కొత్త జబ్బులు వచ్చాయి. ఆయాసం ఎక్కువవుతోంది.  నిద్రపట్టడం లేదు.  


ఎ.రామలక్ష్మి, వెంకటాపురం 

బాధితుల్ని దేశద్రోహులుగా చూస్తున్నారు

ఘటన జరిగినప్పుడు కాలనీ సభ్యులు మా ఇబ్బందులను మా అసోసియేషన్‌ వాట్సాప్‌ గ్రూప్‌లలో షేర్‌ చేసుకున్నందుకు మాకు సమన్లు వచ్చాయి. ఇప్పటికీ సుమా రు 18 మంది ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి సంతకాలు పె ట్టి వస్తున్నాం. బాధితుల్ని దేశద్రోహుల్లా చూస్తున్నారు.  హెల్త్‌ క్యాంపులు ఏర్పాటుచేసి నిపుణులైన వైద్యులతో చికిత్సలు అందిస్తామని జిల్లా కలెక్టర్‌ చెప్పారు. ఇప్పటివరకూ ఈ ప్రాంతా ల్లో ఎన్ని హెల్త్‌ క్యాంపులు పెట్టారో?, ఎంతమందికి వైద్య పరీక్షలు జరిపారో?...చెప్పాలి.  

బి.టి.వి సత్యనారాయణ, వెంకటాద్రి గార్డెన్స్‌ 

Updated Date - 2020-11-22T08:02:09+05:30 IST