తిరగొద్దన్నా.. వినరే

ABN , First Publish Date - 2020-07-09T09:34:10+05:30 IST

గుంటూరులో కరోనా తీవ్రంగా ఉంది. కొవిడ్‌ ఆసుపత్రులు నిండిపోవడంతో సదుపాయాలు ఉన్నవారికి ప్రభుత్వం హోంక్వారంటైన్‌

తిరగొద్దన్నా.. వినరే

హోం క్వారంటైన్‌ నిబంధనలను గాలికి

విచ్చలవిడిగా సంచరిస్తున్న బాధితులు

ఫిర్యాదు చేసినా పట్టించుకొనేవారు లేరు

జిల్లాలో 202 కేసులు.. గుంటూరులో 87 మందికి కరోనా 

తెనాలిలో ఓ డాక్టరు.. బెల్లంకొండలో ప్రభుత్వ ఉద్యోగి మృతి 


గుంటూరు(సంగడిగుంట), జూలై 8: గుంటూరులో కరోనా తీవ్రంగా ఉంది. కొవిడ్‌ ఆసుపత్రులు నిండిపోవడంతో సదుపాయాలు ఉన్నవారికి ప్రభుత్వం హోంక్వారంటైన్‌ అవకాశం ఇచ్చింది. దాని ప్రకారం వారు ఎక్కడా సంచరించకూడదు. ఇంట్లో పరిమిత సభ్యులే ఉండాలి. వారిని ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తుండాలి. కానీ ఎక్కడా ఇవి అమలు జరగడంలేదు. హోం క్వారంటైన్‌లో ఉండాల్సినవారు విచ్చలవిడిగి తిరుగుతున్నారు. గుర్తించి ఇరుగు పొరుగు వారు సమాచారం ఇస్తే పట్టించుకునేవారు లేరు. దీనితో స్థానికంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఏటీ అగ్రహారం 8వ లైనులో కరోనా బాధితుడు కుమార్తె సహా బయట సంచరిస్తున్నాడు. స్థానికులు ఏఎన్‌ఎంకు, డాక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అది తమ పని కాదని కేవలం చికిత్స మాత్రమే చేస్తామని చెప్పారు. దీంతో ఎవరికి చెప్పాలో తెలియక స్థానికులు తలలు పట్టుకున్నారు. నిఘా సిబ్బంది పూర్తిగా చేతులెత్తేశారు. కనీసం వారి ఇంటి ముందు వారి పరిస్థితి తెలియపరుస్తూ బోర్డు ఏర్పాటు చేయాలని, పర్యవేక్షణకు సిబ్బంది కేటాయించాలని కోరుతున్నారు. శ్యామలానగర్‌లో కూడా కరోనాకు గురైన సీఐ కుటుంబం కూడా ఇలాగే ప్రవర్తిస్తుంటే స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించి క్వారంటైన్‌కు పంపించారు. 


హోం క్వారంటైన్‌కై ఒత్తిడిలు...

కరోనా నిర్ధారణ జరిగిన వెంటనే కొవిడ్‌ ఆసుపత్రికి తరలిస్తారు. కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించేవారు. కాని కొన్ని క్వారంటైన్‌ సెంటర్లను తొలగించడం, ఎక్కువ సంఖ్యలో బాధితులు రావడంతో తక్కువ లక్షణాలు ఉన్న వారిని హోం క్వారంటైన్‌కు అవకాశం కల్పించారు. దీనిని పలుకుబడి ఉన్నవారందరూ అవకాశంగా తీసుకుంటున్నారు. కరోనా అని నిర్ధారణ అవగానే వీలైతే అధికారులు, లేదంటే ప్రజాప్రతినిధులతో సిఫార్సు చేయించుకుని హోంక్వారంటైన్‌లో ఉంటున్నారు. హోంక్వారంటైన్‌లో ఉన్న వారిలో ఎక్కువ మంది ఉన్నత తరగతికి చెందినవారు. దీనితో చిన్న స్థాయి సిబ్బంది లెక్కచేయడంలేదు.


వారం రోజులుగా కరోనా కేసులు గణనీయంగా పెరగ డానికి క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు విచ్చలవిడిగా తిరగడమే ఓ కారణమని అధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో కొందరు ప్రస్థావించినట్లు సమాచారం  

Updated Date - 2020-07-09T09:34:10+05:30 IST