ఎన్నాళ్లీ నిరీక్షణ

ABN , First Publish Date - 2021-04-19T04:54:26+05:30 IST

తోటపల్లి పిల్ల కాలువల బాధిత రైతులకు పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యమవుతోంది. రాజాం మండలం గుయ్యన్నవలస నుంచి నందబలగ వరకు పిల్లకాలువల నిర్మాణం కోసం 12 ఏళ్ల కిందట భూ సేకరణ చేపట్టారు. ఇందులో గుయ్యన్నవలసకు చెందిన 32 మంది రైతుల నుంచి సేకరించిన ఎనిమిది ఎకరాలకు సంబంధించి నేటికీ పరిహారం అందలేదు. భూసేకరణ, పాలకొండ ఆర్డీవో, రాజాం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోతోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పనులు ప్రారంభించక ముందే పరిహారం అందజేస్తామని చెప్పిన అధికారులు.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

ఎన్నాళ్లీ నిరీక్షణ
కాలువ నిర్మాణం కోసం సేకరించిన భూమి

తోటపల్లి పిల్లకాలువ నిర్మాణం కోసం భూసేకరణ

12 ఏళ్లుగా పరిహారం కోసం బాధితుల ఎదురుచూపు

కార్యాలయాల చుట్టూ తిరిగినా పట్టించుకోని అధికారులు 

ఆందోళన చెందుతున్న గుయ్యన్నవలస రైతులు

(రాజాం)

తోటపల్లి పిల్ల కాలువల బాధిత రైతులకు పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యమవుతోంది.   రాజాం మండలం గుయ్యన్నవలస నుంచి నందబలగ వరకు పిల్లకాలువల నిర్మాణం కోసం 12 ఏళ్ల కిందట భూ సేకరణ చేపట్టారు. ఇందులో గుయ్యన్నవలసకు చెందిన 32 మంది రైతుల నుంచి సేకరించిన ఎనిమిది ఎకరాలకు సంబంధించి నేటికీ పరిహారం అందలేదు. భూసేకరణ, పాలకొండ ఆర్డీవో, రాజాం తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోతోందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ పనులు ప్రారంభించక ముందే పరిహారం అందజేస్తామని చెప్పిన అధికారులు.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పరిహారం డబ్బులకు సంబంధించి అనుమతి పత్రాలు ఇచ్చినా.. బ్యాంకు ఖాతాల్లో జమకాలేదని వాపోతున్నారు. గతంలో కాలువల పనులు అడ్డుకోగా.. స్థానిక నాయకులతో ఒత్తిడి తెచ్చి పనులు చేపట్టారని తెలిపారు. గుయ్యన్నవలస నుంచి నందబలగ వరకు పిల్లకాలువ నిర్మించారని తెలిపారు. అన్ని గ్రామాల రైతులకు పరిహారం అందజేసి.. తమకు మాత్రం అన్యాయం చేశారని వాపోతున్నారు. కాలువపై వంతెన కూడా నిర్మిస్తామని చెప్పిన అధికారులు ఆ ఊసే మరిచిపోయారని ఆరోపిస్తున్నారు. కలెక్టర్‌ స్పందించి తమకు పరిహారం మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.  కాలువపై వంతెన కూడా నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


  అధికారుల చుట్టూ తిరిగాం

నష్టపరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదు. గ్రామంలో 32 మంది రైతుల నుంచి 8 ఎకరాల సేకరించగా.. నేటికీ పరిహారం అందలేదు. ఆమదాలవలస భూసేకరణ అధికారులకు అప్పగించి ఉంటే పరిహారం అప్పట్లోనే అంది ఉండేంది. పాలకొండ ఆర్డీవో కార్యాలయం అధికారుల వల్లే పరిహారం అందలేదు. ఈ విషయంలో కలెక్టర్‌ చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. 

- పడాల చిన్నారావు, రైతు, గుయ్యన్నవలస 

 


పరిహారం చెల్లించాలి

 పరిహారం చెల్లించడానికి అధికారులు  జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అన్ని విధాలుగా నష్టపోయిన రైతులకు కొత్త ధరల ప్రకారం పరిహారం చెల్లించాలి.

- చిర్రా సత్తమ్మ, మహిళా రైతు, గుయ్యన్నవలస



 చర్యలు తీసుకుంటాం 

గుయ్యన్నవలస  రైతులకు పరిహారం విషయం చెల్లింపు విషయంపై పరిశీలించి  చర్యలు చేపడతాం. వీటికి సంబంధించిన రికార్డులు కూడా ఉన్న విషయం తెలియదు.  రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. రైతుల వద్ద ఆధారాలు తీసుకొని పొందుపరిచి పరిశీలించి న్యాయం చేస్తాం.

- టీవీఎస్‌జీ కుమార్‌, ఆర్డీవో, పాలకొండ 

Updated Date - 2021-04-19T04:54:26+05:30 IST