నెగ్గిన రాజకీయం

ABN , First Publish Date - 2021-12-03T05:25:41+05:30 IST

జిల్లాలో ఎస్సైల బదిలీల్లో సిఫార్సులదే పైచేయి అయింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ఎస్సైల బదిలీల్లో కాస్తంత మెరుగ్గా మాట నెగ్గించుకోగలిగారు. గురువారం రాత్రి జరిగిన ఎస్సైల బదిలీల జాబితాను పరిశీలిస్తే ఆ విషయం తేటతెల్లమైంది. ఎస్పీగా మలికగర్గ్‌ బాఽధ్యతలు చేపట్టాక పెద్దసంఖ్యలో ఎస్సైల బదిలీలు జరగడం ఇదే తొలిసారి. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రాధాన్యమిస్తూ జిల్లాలో గాడితప్పిన పోలీస్‌ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నానికి ఆమె శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. అందులోభాగంగా పూర్తిగా ఎస్పీల పరిధిలో ఉండే ఎస్సైల బదిలీలపై పెద్ద కసరత్తు చేశారు.

నెగ్గిన రాజకీయం

ఎస్సైల బదిలీల్లో సిఫార్సులదే పైచేయి

కౌన్సెలింగ్‌తో పోస్టింగ్‌లు ఇచ్చిన ఎస్పీ

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

జిల్లాలో ఎస్సైల బదిలీల్లో సిఫార్సులదే పైచేయి అయింది. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు ఎస్సైల బదిలీల్లో కాస్తంత మెరుగ్గా మాట నెగ్గించుకోగలిగారు. గురువారం రాత్రి జరిగిన ఎస్సైల బదిలీల జాబితాను పరిశీలిస్తే ఆ విషయం తేటతెల్లమైంది. ఎస్పీగా మలికగర్గ్‌ బాఽధ్యతలు చేపట్టాక పెద్దసంఖ్యలో ఎస్సైల బదిలీలు జరగడం ఇదే తొలిసారి. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధతకు ప్రాధాన్యమిస్తూ జిల్లాలో గాడితప్పిన పోలీస్‌ శాఖను గాడిలో పెట్టే ప్రయత్నానికి ఆమె శ్రీకారం పలికిన విషయం తెలిసిందే. అందులోభాగంగా పూర్తిగా ఎస్పీల పరిధిలో ఉండే ఎస్సైల బదిలీలపై పెద్ద కసరత్తు చేశారు. శాఖాపరంగా పనికిరారు అనుకున్న వారిని వీఆర్‌కు పంపిస్తూ సమర్థత ఉన్న వారిని తెరపైకి తీసుకొస్తూ జాబితాను సిద్ధం చేశారు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లను ఖాతరు చేయకుండా జాబితాను రూపొందించారు. ఆ తర్వాత పై నుంచి వచ్చిన ఒత్తిడితో కొందరు ఎస్సైల జాబితాను తయారు చేసి వారిలో మీరు కోరుకున్న వారికి అవకాశం ఇస్తాం తప్పా ఆ జాబితాలో లేని వారికి ఇవ్వబోమని ప్రజాప్రతినిధులకు తేల్చిచెప్పారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, నే తల ఒత్తిడితో మంత్రి కలుగజేసుకుని ఉన్నత స్థాయి నుంచి ఎస్పీపై ఒత్తిడి తేచ్చినట్లు తెలిసింది. రెండురోజుల క్రితం మంత్రిని ఎస్పీ కలిశారు. తదనంతరం బదిలీల జాబితా విడుదలైంది. వైసీపీ నేతలు ముందు నుంచి చెబుతున్న ప్రకారం భారీగా ఎస్సైల బదిలీల జరగడం విశేషం. వైపాలెం, దర్శి లాంటి ఒకటి రెండు సర్కిళ్ల మినహా మిగతా అన్నింట్లో ఎస్సైలకు స్థానచలనం జరిగింది. అద్దంకి, కొత్తపట్నం, కొండపి స్టేషన్ల పరిధిలో బదిలీలు మంత్రి సిఫార్సు మేరకు జరిగినట్లు తెలిసింది. అద్దంకిలో మహిళా ఎస్సైని కొనసాగించే విషయంలో పవరే గెలిచినట్లు ప్రచారం జరుగుతోంది. ముందు నుంచి ప్రచారం జరిగినట్లే చీమకుర్తి, మార్టూరు స్టేషన్లకు ఎస్సైలు నియమితులయ్యారు.  ఇలా చూస్తే మొత్తం 39మంది బదిలీల్లో పోలీస్‌ శాఖ సమర్థులుగా గుర్తించిన వారికి కొంతమేర స్థానం లభించినప్పటికీ, రాజకీయ సిఫార్సులదే పైచేయిగా కనిపిస్తోంది. పశ్చిమ ప్రాంతంలో జరిగిన బదిలీల్లోనూ ఆ పరిస్థితి చోటుచేసుకుంది. ఒక స్టేషన్‌లో ఉన్న ప్రొబేషనరీ ఎస్సై ‘నేను ఈ రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేను, బదిలీ చేయండి అని పెట్టుకున్నా ఫలితం దక్కలేదు’ అని తెలిసింది. ఒంగోలులో ఉన్న ఒకరిద్దరు ఎస్సైలు అనూహ్యంగా పోస్టులు దక్కించుకోవడంలో కూడా రాజకీయ సిఫార్సులే కారణమని భావిస్తున్నారు. 

నిత్యం నిఘా : ఎస్పీ

గతంలో ఎన్నడూ లేనివిధంగా బదిలీల జాబితాల్లో ఉన్న అధిక మంది ఎస్సైలకు ఎస్పీ మలిక గర్గ్‌ ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇవ్వడం గమనార్హం. పోస్టింగ్‌ కోసం సిఫార్సులు చేయించుకున్నా మీరు పనిచేయాల్సింది పోలీస్‌ నిబంఽధనలకు అనుగుణంగానే, మా పర్యవేక్షణ నిత్యం ఉంటోంది. తప్పటడుగు పడితే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. పొరపాట్లు చేస్తే శాఖాపర్యంగా ఎప్పటికైనా ఇబ్బంది పడతారని అని విధివిధానాలను తెలియజేసినట్లు సమాచారం. 

Updated Date - 2021-12-03T05:25:41+05:30 IST