కాల్స్‌, డేటాకు కనీస చార్జీ!

ABN , First Publish Date - 2020-02-28T07:17:38+05:30 IST

కాల్స్‌, డేటాకు కనీస చార్జీ!

కాల్స్‌, డేటాకు కనీస చార్జీ!

  • ఒక జీబీ డేటాకు రూ.35.. నెలకు కనీస కనెక్షన్‌కు రూ.50 ఉండాలి
  • ప్రభుత్వానికి వొడాఫోన్‌ ఐడియా లేఖ

న్యూఢిల్లీ : తమ ఆర్థిక కష్టాలను వినియోగదారులపైకి నెట్టేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి డేటా, ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌కు కనీస చార్జీలు నిర్ణయిస్తే తప్ప.. మనుగడ కష్టమని వొడాఫోన్‌ ఐడియా స్పష్టం చేసింది. ఇందుకోసం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ టెలికాం శాఖకు ఒక లేఖ రాసింది. ప్రభుత్వం ఈ విజ్ఞప్తికి అంగీకరిస్తే మొబైల్‌ టెలికాం సేవల వినియోగదారుల జేబులకు భారీగా చిల్లుపడనుంది. టెలికాం కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఓఏఐ) కూడా ఇదే డిమాండ్లతో డాట్‌కు లేఖ రాసింది. దీంతో పరిశ్రమను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు డిజిటల్‌ కమ్యూనికేషన్‌ (డీసీసీ) శుక్రవారం సమావేశం కానుందని సమాచారం.

ఇలా పెంచాలి: ఏ సేవల చార్జీలను ఎంత మేర పెంచాలో కూడా వొడాఫోన్‌ ఐడియా తన లేఖలో ప్రభుత్వానికి తెలియజేసింది. ప్రస్తుతం టెలికాం కంపెనీలు ఒక జీబీ డేటాకు సగటున నాలుగైదు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయి. దీన్ని కనీసం 7 నుంచి 8 రెట్లు పెంచి రూ.35గా నిర్ణయించాలని వొడాఫోన్‌ ఐడియా కోరింది. ప్రస్తుతం ఉచితంగా ఉన్న ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌పైనా నిమిషానికి కనీస చార్జీని ఆరు పైసలుగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేసింది. నెలవారీ కనీస కనెక్షన్‌ చార్జీని ఏప్రిల్‌ 1 నుంచి రూ.50గా నిర్ణయించాలని కోరింది. ఇలా డేటా, కాల్‌ చార్జీలు పెంచితే తప్ప, ఏజీఆర్‌ బకాయిలు చెల్లించడం సాధ్యం కాదని వొడాఫోన్‌ ఐడియా స్పష్టం చేసింది.

Updated Date - 2020-02-28T07:17:38+05:30 IST