ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించండి

ABN , First Publish Date - 2021-10-22T05:13:55+05:30 IST

ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించండి

ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌, పాల్గొన్న అధికారులు

పాయకాపురం, అక్టోబరు 21 : జగనన్న సంపూర్ణ గృహ పథకంలో భాగంగా గతంలో వివిధ గృహ నిర్మాణాల పథకం కింద నిర్మించిన 2.8 లక్షల ఇళ్ల నిర్మాణానికి క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని కలెక్టర్‌ నివాస్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి గురువారం సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, హౌసింగ్‌ ఇంజనీర్లు తదితర అధికారులతో జగనన్న సంపూర్ణ గృహ పథకం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1983 నుంచి 2005 వరకు వివిధ గృహ నిర్మాణాల పథకం కింద పట్టణ, గ్రామీణ గృహాలు నిర్మించారన్నారు. లబ్ధిదారులకు ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేసి సంపూర్ణంగా హక్కును కల్పించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ పథకాల కింద నిర్మించిన 2.8 లక్షల గృహాల్లో 2.5 లక్షలు మాత్రమే వలంటీర్లు, వీఆర్వోలు గుర్తించారని చెప్పారు. ఇంకా 30వేల లబ్ధిదారుల గృహాలను గుర్తించలేదన్నారు. సదరు గృహాల్లోనే లబ్ధిదారుడు ఉంటున్నాడా? అతని వారసులు ఉన్నారా? ఇతరులకు విక్రయించి వెళ్లాడా? వంటి వివరాలతో కూడిన ఇంటి సరిహద్దులను గుర్తించాలని సూచించారు. ప్రతి గ్రామీణ లబ్ధిదారుడి నుంచి రూ.10 వేలు, మున్సిపల్‌ పట్టణంలోని లబ్ధిదారుడి నుంచి రూ.15 వేలు, కార్పొరేషన్‌ పరిధిలోని లబ్ధిదారుడి నుంచి రూ.25 వేలు వసూలు చేయాలన్నారు. తాను నివాసం ఉండే ఇంటిపై పూర్తి హక్కు కల్పించే ప్రయత్నమే ఈ చర్యలు అని చెప్పారు. డిసెంబరు 21 నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేసి ఎప్పటికప్పుడు డేటాను డిజిటల్‌ అసిస్టెంట్‌ ద్వారా పూర్తి చేయించాలని తెలిపారు. తహసీల్దార్లు, ఎండీవోలు సమీక్షించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి వచ్చే వారం నాటికి ప్రతి మండలంలో కచ్చితంగా 500 మందికి తగ్గకుండా నిర్మాణ సామాగ్రిని లబ్ధిదారులకు అందించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఐరన్‌, సిమెంట్‌, ఇసుక తదితర సామాగ్రి అందించడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇదే పని విధానం కనబరిచే అధికారులపై చర్యలు తప్పవన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల ఎంతో ఉపయోగం ఉందని, పట్టాలు లబ్ధిదారుల చేతికే అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ నూపూర్‌ అజయ్‌ కుమార్‌, హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రామచంద్రన్‌, టిడ్కో ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ చిన్నోడు పాలొన్నారు.

Updated Date - 2021-10-22T05:13:55+05:30 IST