కృష్ణాపురంలోని వెంగమాంబ క్వారీపై విజిలెన్స్‌ దాడులు

ABN , First Publish Date - 2020-07-14T10:12:55+05:30 IST

మండలంలోని కృష్ణాపురం గ్రామం వెంగమాంబ క్వారీపై సోమవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు.

కృష్ణాపురంలోని వెంగమాంబ క్వారీపై విజిలెన్స్‌ దాడులు

నిబంధనలకు తిలోదకాలు

దర్యాప్తు పూర్తయ్యాక అపరాధ రుసుం విధిస్తాం

విజిలెన్స్‌ ఏడీ ప్రతాపరెడ్డి


పద్మనాభం, జూలై 13: మండలంలోని కృష్ణాపురం గ్రామం వెంగమాంబ క్వారీపై సోమవారం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. విశాఖ రీజనల్‌ విజిలెన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.ప్రతాపరెడ్డి సిబ్బందితో దాడి చేసి క్వారీ నిర్వాహకులు నిబంధనలను అతిక్రమించినట్టు గుర్తించారు. 1996 నుంచి ఇక్కడ సర్వే నంబర్‌-1లో తక్కువ విస్తీర్ణంలో లీజుకు తీసుకుని, అధిక విస్తీర్ణంలో వీవీఆర్‌ అసోసియేట్స్‌ పేరుతో నాలుగు క్వారీలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములను చెల్లించలేదని  ప్రతాపరెడ్డి తెలిపారు.


కాలుష్య నియంత్రణ మండలి నుంచి కూడా ఎటువంటి పర్యావరణ అనుమతులు కూడా తీసుకోలేదని, అయినా రిగ్‌ బ్లాస్టింగ్‌ చేస్తున్నారన్నారు. ఈ సంస్థలకు జిల్లాలో పది క్వారీలు ఉన్నాయని, అనకాపల్లి మండలం సీతానగరంలో నడుపుతున్న క్వారీలకు ఇప్పటికే రూ.33 కోట్ల అపరాధ రుసుం విధించామన్నారు. మంగళవారం నాటికి కృష్ణాపురం క్వారీల్లో కూడా దర్యాప్తు పూర్తిచేసి ఈటీఐ సర్వే ద్వారా లెక్కలు కట్టి అపరాధ రుసుం విధిస్తామన్నారు. ఈ దాడుల్లో ఏజే రవికుమార్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-14T10:12:55+05:30 IST