యూరియాపై విజిలెన్స్‌ ఏదీ..?

ABN , First Publish Date - 2022-01-29T05:38:35+05:30 IST

జిల్లాలో ఇప్పటికే రైతులకు సరిపోయినంత యూరియా అందచేశాం.. ఇకపై కంపెనీల నుంచి వస్తున్నదంతా బఫర్‌ స్టాకే.. అని అధికారులు చెబుతున్నారు.

యూరియాపై విజిలెన్స్‌ ఏదీ..?
తెనాలి యార్డులోని గోదాములో దింపుతున్న యూరియా బస్తాలు

ఆర్బీకేల వద్దే బస్తాల మాయం

చాలినంతలేదు.. అప్పుడే బఫర్‌ నిల్వలంట

రైతులు గగ్గోలు పెడుతున్నా.. అధికారుల కాకి లెక్కలు

ఇప్పటి వరకు సరిపోయినంతగా ఇచ్చామని ప్రకటనలు 

తొలివిడతే దొరక్క అల్లాడుతున్నామంటున్న అన్నదాతలు

రైతుల పేరిట అధికార పార్టీ నేతలకు చేరుతున్న బస్తాలు

 

యూరియాకు కొరత లేదు.. రైతులకు కావాల్సినంత ఇచ్చాం. ఇంకా ఎక్కువగా వస్తున్న నిల్వలను భవిష్యత్‌ అవసరాలకు దాస్తున్నాము.. అని అధికారులు అంటున్నారు. అన్నదాతలేమో తొలివిడత చల్లేందుకు అవసరమైనదే అందక అల్లాడుతున్నాం.. ఆర్బీకేలకు వెళ్తే దొరకడంలేదంటున్నారు. మరి జిల్లాకు ఈ నెలలో కేటాయించిన 25 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఏమైందో.. లేదంటే రెక్కలొచ్చి మాయమైందో అధికారులే చెప్పాలి. ఆర్బీకేల కొస్తున్న యూరియా ఎక్కడికి వెళుతుందో కూడా చెప్పే నాథుడేలేడు.  రైతుల ముసుగులో ఎక్కడికక్కడే అధికార పార్టీ కిందిస్థాయి నేతలు తీసుకెళ్లి దాచుకుంటున్నారని రైతులు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధిక రేటు చెల్లించే వారికి అమ్ముకుంటున్నారంటున్నారు. అధికారుల లెక్కల ప్రకారం వ్యాపారుల దగ్గర 38 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉంటే దానిని ఎక్కడ దాచిపెట్టారో! తెలియని పరిస్థితి. నిజంగా దాచిపెడితే వాటిని బయటకు తీయాల్సిన విజిలెన్స్‌ అధికారులు ఏమైపోయారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.


తెనాలి, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇప్పటికే రైతులకు సరిపోయినంత యూరియా అందచేశాం.. ఇకపై కంపెనీల నుంచి వస్తున్నదంతా బఫర్‌ స్టాకే.. అని అధికారులు చెబుతున్నారు. అయితే రైతులు మాత్రం యూరియా దొరక్క అల్లాడుతున్నారు. అధికారులు చెబుతున్నట్లు ఈ నెల కోటా 25 వేల మెట్రిక్‌ టన్నులు జిల్లాకు వస్తే అదంతా ఏమైపోతుందనేది అంతుబట్టని ప్రశ్న. ఆర్బీకేలను మొదటి నుంచి తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్న అధికారపార్టీ చోటా నేతలు యూరియాను కూడా వదలడంలేదనే ఆరోపణలు న్నాయి. ఎవరైనా నిజమైన రైతులు వచ్చి నిలదీస్తే ఎక్కడలేని నిబంధనలను తీసుకొస్తున్నారు. ప్రభుత్వం ఏ షరతులు పెట్టకున్నా, చివరకు ఎరువుల బస్తాలు ఎత్తేసేందుకే రైతుల దగ్గర మెలికలు పెడుతున్నారని సమాచారం. పశ్చిమ డెల్టా ప్రాంతంలోనే రబీ సాగుకు యూరియా ఎక్కువగా అవసరం. అయితే ఇక్కడ తొలివిడత కిందే యూరియా సరిపోనూ రైతులకు అంద లేదు. యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నా, పంపిణీలో వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మధ్య సమన్వయ లోపంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎరు వులు, విత్తనాలు ఆర్బీకేల ద్వారానే అమ్మకాలు జరపాలన్న కమిషనర్‌ ఉత్తర్వులు సక్రమంగా అమలు కావడంలేదని సమాచారం.


ఆర్బీకేల్లో.. నేతల హవా

ఆర్బీకేల సిబ్బందికి పూర్తి సామర్ధ్యం లేదు. అమ్మకా లు జరిపేటంతటి నైపుణ్యం కూడా ఇంకా రాలేదు. దీనికితోడు వీరిపై రాజకీయ పెత్తనం ఎక్కువ కావటం కూడా ఒకరిద్దరు చేద్దామన్నా, నిబంధనల ప్రకారం చేయలేని పరిస్థితులు. ఆర్బీకేలలో యూరియాబస్తాలు దింపుకునే సౌలభ్యం లేదు.   ఆర్బీకే భవనాలకే అద్దెలు చెల్లించని పరిస్థితి ఉం డటంతో గోదాములు అద్దెకు తీసుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో లారీల్లోనే బస్తాలు ఉంచి వచ్చిన రైతుల కు వచ్చినట్టు ఇచ్చేసి పంపుతున్నారు. ఆ సమయంలో లేని రైతులకు ఒక్క కట్ట కూడా అంద టంలేదు. కొల్లూరు మండలంలో  రెండో ఆర్బీకే కేంద్రానికి గురువారం రాత్రి యూరియా వస్తే పగలు పదిమంది రైతులకు ఇచ్చామనిపించి మిగిలిన వారిని తిప్పి పంపేశారు.  ఆ రాత్రి వైసీపీ నేతలు, సిఫార్సులున్న వారంతా వచ్చి ట్రాక్టర్లలో వేసుకుపోయారని రైతులు ఫిర్యాదు చేశారు. అదే రోజు పొన్నూరు మండలం దొప్పలపూడి ఆర్బీకే దగ్గరకూడా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళనకు దిగడంతో ఈసారి లోడు వచ్చాక అందిస్తామని అధికారులు సర్దిచెప్పి పంపారు.  చుండూరు మండలంలో మరో రెండు గ్రామాలు, కొల్లిపర, దుగ్గిరాల మండలంలో మరికొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. అయితే వీరిలో కొందరు తీసుకెళ్లిన బస్తాలను సొంత వారికి అందించుకుంటే, మరికొందరు రూ.266.50 బస్తాను రూ.300 నుంచి రూ.350 వరకు అమ్మేశారని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మార్కెటిం గ్‌ శాఖకో, లేక పీఏసీఎస్‌లకో అప్పగిస్తే కొంతవరకు రైతులకు అందే అవకాశం ఉంది.   


దాడులు మరిచిన విజిలెన్స్‌

విత్తనాలు, ఎరువుల కొరత, నల్ల బజారులో అమ్మకాలు, నకిలీ, కల్తీ వంటివాటిపై ఎప్పటికప్పుడు దాడులు జరిపి రైతులకు అండగా నిలవాల్సిన విజిలెన్స్‌ శాఖ ప్రస్తుతం నిద్రావస్తలో ఉన్నట్టుంది. వీరు చెయ్యాల్సిన పనికూడ జేడీ చేసేసి అంతా బాగుందనిపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. యూరియా కృత్రిమ కొరతను సాకుగా చేసుకుని కొందరు నల్లబజారు వ్యాపారాలకు తెరతీశారు. దీనిపై ఆంధ్రజ్యోతిలో కథనాలు రావటంతో ఇటీవల వ్యవసాయ శాఖ జేడీ దాడులు జరిపారు. రెండు రోజుల దాడులతో అంతా బాగుందనిపించారు. విజిలెన్స్‌ను మాత్రం రంగంలోకి దింపలేదు. అనేక సందర్బాల్లో రైతులు దగా పడుతున్నా వీరు మాత్రం బయటకే రాని పరిస్థితి. సాఽధారణంగా సీజన్‌ వచ్చిందంటే అన్ని శాఖల అధికారులతో కలిపిన విజిలెన్స్‌ బృందం దుకాణాలు, ఇతర అమ్మకం కేంద్రాలు, గోదాములపై దాడులు నిర్వహించటం పరిపాటి. కానీ యూరియా కొరత, నల్లబజార్‌ అమ్మకాలు బహిరంగంగా సాగిపోతున్నా, వీరు మాత్రం పత్తాలేరు.  



వర్షాలతో యూరియాకు డిమాండ్‌

సాధారణంగా యూరియాను మొక్కజొన్న, జొన్న సాగులో మూడు విడతలుగా నాలుగు బస్తాలనే వేస్తారు. అయితే ఈ నెల రెండో వారంలో కురిసిన వర్షాలకు మొక్క పండిపోయి, రంగు మారిపోయింది. వర్షాలు తగ్గాక మరోసారి చల్లాల్సిన అవసరం వచ్చింది. దీంతో ఈ రబీ సాగు మొత్తానికి అవసరమైన కోటాను ఒకే సారి వాడేశారు. కాంప్లెక్స్‌ ఎరువు బస్తా రూ.1200 పైనే ఉండటంతో, దానిని కొనలేక చాలామంది మరో రెండు బస్తాల యూరియాను చల్లుతున్నారు. దీంతో యూరియా వాడకం రెట్టింపయింది. 

ఎక్కువధరకు అమ్మితే అధికారులపై వేటు 

వ్యవసాయశాఖ జెడి విజయభారతి హెచ్చరిక

గుంటూరు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా ఎక్కువ ధరకు అమ్మితే అధికారులు, ఉద్యోగులపై వేటుపడుతుందని వ్యవసాయశాఖ జేడీ విజయభారతి హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి సంచికలో శుక్రవారం ‘యూరియా ఏదయా’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనంపై జేడీ అధికారులతో సమావేశం నిర్వహించారు.  ప్రభుత్వం ఆర్‌బీకేలకు  యూరియా కేటాయిస్తున్నా క్షేత్ర స్థాయిలో బ్లాక్‌మార్కెట్‌ ఎందుకు నడుస్తోందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌బీకేలను తనిఖీ చేసి యూరియా పంపిణీపై నిఘా పెట్టాలన్నారు. ఎక్కువ ధరలకు అమ్మితే వ్యాపారుల లైసెన్స్‌లు రద్దు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీడీలు రామాంజనేయులు, మురళి, ఏడీ హేమలత తదితరులు పాల్గొన్నారు.


కేంద్రం దృష్టికి.. యూరియా కొరత

అదనంగా ఇచ్చేందుకు మంత్రి హామీ : శ్రీకృష్ణదేవరాయలు

యూరియా, ఎరువుల కొరతపై కేంద్ర దృష్టికి తీసుకువెళ్లామని, రైతుల అవసరాలకు తగ్గట్టుగా సరఫరా అయ్యేలా చూస్తామని కేంద్ర మంత్రి హామీ వచ్చిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ముందుచూపుతో గత సీజన్‌లో ఎదురయ్యే పరిస్థితులు రాకూడదనే పార్లమెంటు సమావేశాల్లో ఎరువుల కోటాపై ప్రస్తావించిననట్లు తెలిపారు. రబీ సాగుకు రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా, 1.95 లక్షల మెట్రిక్‌ టన్నుల డీఏపీ సరఫరాకు అనుమతినిచ్చినట్టు కేంద్ర మంత్రి భగవంత్‌ ఖూబా తెలిపారన్నారు. ఈ నెల 18లోపు 5.68 లక్షల మెట్రిక్‌ టన్నులకుగాను 6.89 లక్షల మెట్రిక్‌ టన్నులు అందుబాటుల ఉంచామన్నారు. 4.25 లక్షల మెట్రిక్‌ టన్నులు అమ్మగా  ఇంకా 2.64 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వలు రాష్ట్రంలో ఉన్నట్టు మంత్రి వివరించారన్నారు. డీఏపీ కూడా కొరతలేదని, కావలసినంత ఉందన్నారు. జిల్లా శాఖల సమన్వయంతో డిమాండ్‌ ఉన్నచోటకు తెప్పించే ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కేంద్రం ఇస్తున్న ఎరువుల కోటా సరిపోకపోతే వ్యవసాయశాఖ ద్వారా ఇండెట్‌ పెడితే అదనంగా పంపేందుకు కేంద్ర మంత్రి హామీ కూడా ఇచ్చారని శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఎవరికీ కొరత రానివ్వమని పేర్కొన్నారు. కాంప్లెక్స్‌ ఎరువుల స్థానంలో యూరియా వాడటం మంచిది కాదన్నారు.

  

 

Updated Date - 2022-01-29T05:38:35+05:30 IST