జోరుగా గంజాయి రవాణా

ABN , First Publish Date - 2022-08-04T06:36:55+05:30 IST

జిల్లాలో వారం రోజులుగా జరిగిన పలు సంఘటనలు పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో గంజాయి గుప్పుమంటున్న తీరును తేటతెల్లం చేస్తున్నాయి.

జోరుగా గంజాయి రవాణా

- పొరుగు జిల్లాల నుంచి సరఫరా

- దూకుడు పెంచిన సీసీఎస్‌ పోలీసులు

- అయినా ఆగని అక్రమ వ్యాపారం

- జిల్లాలో రూ. లక్షల్లో గంజాయి వ్యాపారం



- గత నెల 23వ తేదిన ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామ శివారులో నిర్మల్‌ జిల్లా నుంచి గంజాయి సరాఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని వారి వద్ద 70 ప్యాకెట్ల గంజాయి, మూడు సెల్‌ఫోన్స్‌, రూ. 10 వేల నగదును సీసీఎస్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- గత నెల 26వ తేదీన జిల్లాలోని రాయికల్‌ మండలం భూపతిపూర్‌ గ్రామ శివారులో అదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల నుంచి గంజాయి సరాఫరా చేస్తున్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇద్దరు, జగిత్యాల జిల్లాకు చెందిన ఒకరిని పట్టుకొని వీరి వద్ద 41 ప్యాకెట్లను, హుకా మిషన్‌, మూడు సెల్‌ ఫోన్లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు.

- గత నెల 29వ తేదీన జిల్లా పోలీస్‌ ఫైరింగ్‌ రేంజ్‌ వెనుగుమట్ల నందు జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో 21 కేసులలో పట్టుకున్న 49.575 కిలోల గంజాయిని డిస్ట్రిక్ట్‌ డ్రగ్స్‌ డిస్పోజల్‌ కమిటీ ఆద్వర్యంలో కాల్చి బూడిద చేశారు.  ఎస్పీ సింధుశర్మ, అడిషనల్‌ ఎస్పీ రూపేష్‌ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

  జగిత్యాల, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వారం రోజులుగా జరిగిన పలు సంఘటనలు పరిశీలిస్తే జగిత్యాల జిల్లాలో గంజాయి గుప్పుమంటున్న తీరును తేటతెల్లం చేస్తున్నాయి. ప్రస్తుతం పల్లెల్లో విచ్చలవిడిగా గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం జరుగుతున్నాయి. కొందరు అక్రమ వ్యాపారులు గంజాయి విక్రయాలతో లక్షల రూపాయలు గడిస్తున్నారు. యువకులు, కళాశాల, పాఠశాల విద్యార్థులే లక్ష్యంగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, మేజర్‌ పంచాయతీల శివారు ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకొని అక్రమ వ్యాపారాన్ని నడుపుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు గంజాయిని అలవాటు చేస్తున్నారు. అలవాటుగా మారిన గంజాయి వినియోగం వ్యసనంగా తయారై యువకులు, విద్యార్థులు బలిపశువులుగా మారుతున్నారు.

- జిల్లాలో పట్టుపడ్డ గంజాయి...

2019 సంవత్సరంలో మూడు కేసులు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేయగా, వీరి వద్ద 4.200 కిలో గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2020 సంవత్సరంలో ఎనిమిది కేసులు నమోదు కాగా 18 మందిని అరెస్టు చేయగా 10 కిలో గంజాయి పట్టుపడింది. 2021 సంవత్సరంలో గంజాయికి సంబంధించి 14 కేసులు న మోదు అయ్యాయి. ఇందులో 38 మందిని అరెస్టు చేయడంతో పాటు 30.165 కిలోల గంజాయిని పోలీసులు సీజ్‌ చేశారు. 2022 సంవత్సరంలో గంజాయికి సంబంధించి గత నెల 26వ తేదీ వరకు ఆరు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 23 మందిని అరెస్టు చేయడంతో పాటు 11.20 కిలోల గంజాయిని, 11 గంజాయి మొక్కలను పోలీసులు సీజ్‌ చేశారు.

- పొరుగు ప్రాంతాల నుంచి...

జగిత్యాల జిల్లాకు సమీపంలో గల మహారాష్ట్రలోని ముంబాయి, నాగ్‌ పూర్‌, పుణే తదితర మహానగరాల్లో తయారైన గంజాయి ప్యాకెట్లను కొందరు హోల్‌సేల్‌ వ్యాపారులు జగిత్యాల జిల్లాకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. వీటితోపాటు ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, హైదారాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి సైతం గంజాయి ప్యాకెట్లను పెద్దఎత్తున జిల్లాకు తరలిస్తున్నారు. పట్టణాల్లోని రహస్య ప్రాంతాల్లో గోదాంలు ఏర్పాటు చేసుకొని నిల్వ చేసుకుంటున్నారు. గంజాయి విక్రయాలకు పట్టణాల్లో అధిక డిమాండ్‌ ఉండటంతో  దీనిని ఆసరాగా చేసుకొని ధరలను పెంచి మరీ విక్రయిస్తున్నారు. 

- పోలీసుల ఉక్కుపాదం..

జిల్లాలో గంజాయి నియంత్రణకు పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నియంత్రణ కోసం సిబ్బంది మొదలుకొని అధికారి వరకు ప్రతీఒక్కరూ కృషి చేస్తున్నారు. ఇందుకోసం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గతంలో గంజాయి రవాణాకు పాల్పడిన వ్యక్తుల సమాచారంతో పాటు గంజాయి సాగుచేసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం వారి స్థితిగతులను ఆరా తీయడంపై దృష్టిసారించారు. గంజాయిని వినియోగించే వారి సమాచారాన్ని సైతం సేకరిస్తున్నారు. గంజాయి రవాణాకు పాల్పడే వ్యక్తుల సమాచారాన్ని సేకరించడానికి పటిష్టమైన ఇన్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీరు ఇచ్చిన సమాచారం మేరకు ఇటీవల ఆదిలాబాద్‌, నిర్మల్‌, కరీంనగర్‌, సిరిసిల్ల, నిజామాబాద్‌ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు తయారీ, రవాణా, విక్రయాలు, వినియోగం జరుపుతున్న వాటిపై ఉక్కుపాదం మోపుతున్నారు. 

- రూ. లక్షల్లో వ్యాపారం..

జిల్లావ్యాప్తంగా ప్రతీ నెల రూ. లక్షల్లో అక్రమ గంజాయి వ్యాపారం సాగుతోంది. పొరుగు జిల్లాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా దిగుమతి చేసుకున్న గంజాయి, గంజాయి ప్యాకెట్లను డిమాండ్‌ను బట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ. 500 నుంచి రూ. 1,500 వరకు విక్రయిస్తున్నారు. విద్యార్థులకు ఒక్కో ప్యాకెట్‌ రూ. 1,000 నుంచి రూ. 2,000 వరకు విక్రయిస్తున్నారు. గంజాయి గోదుమ, ఆకుపచ్చ రంగులో లభిస్తోంది. గోదుమ రంగు 10 గ్రాముల ప్యాకెట్‌ రూ. 1,000, ఆకుపచ్చ రంగు ప్యాకెట్‌ రూ. 600 నుంచి రూ. 1,000 వరకు విక్రయిస్తున్నారు.  

గంజాయి విక్రయిస్తే పీడీ యాక్ట్‌ 

- సింధుశర్మ, ఎస్పీ

గంజాయి, గుట్కా వంటి మత్తుపదార్థాలను రవాణా చేయడం, విక్రయించడం వంటివి జరిపే వారిపై పీడీ యాక్టులు నమోదుచేస్తాము. సమాజాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య గంజాయి. మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. జిల్లాలో గంజాయి రవాణాను  సమర్థవంతంగా నిరోధిస్తున్నాము. 


Updated Date - 2022-08-04T06:36:55+05:30 IST