దళపతి విజయ్ 65వ చిత్రం రాజకీయనేపథ్యంలో రానున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘మాస్టర్’ చిత్రం సూపర్‌డూపర్ హిట్ అయింది. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రాన్ని ఓటీటీలో కూడా విడుదల చేసినప్పటికీ ఇంకా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం తర్వాత విజయ్ తన 65వ చిత్రానికి సన్నాహాలు చేశారు. ఈ చిత్రం షూటింగు కూడా రష్యాలో జరిపేలా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. అయితో రాష్ట్ర శాసనసభకు ఏప్రిల్ ఆరో తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించుకున్న తర్వాత రష్యా వెళ్ళేలా విజయ్ తన ప్రణాళికను మార్చుకున్నట్టు సమాచారం. ఇదిలావుంటే, ఈ 65వ చిత్రం పూర్తిగా రాజకీయ నేపథ్యంలో సాగనుందట. ఇందులో నటించే విలన్ కూడా ఓ రాజకీయ నాయకుడు కావడంతో ఈ చిత్రం పూర్తి స్థాయి రాజకీయ చిత్రాన్ని తలపించేలా ఉంది. కాగా, విజయ్ ఇప్పటికే ‘సర్కార్’ చిత్రాన్ని రాజకీయ నేపథ్యంలో నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.