Oct 21 2021 @ 14:35PM

Dil raju: పవన్‌కల్యాణ్‌లాంటి క్రేజ్‌ విజయ్‌ది!

విజయ్‌ దేవరకొండ రూపంలో టాలీవుడ్‌కు క్రేజ్‌ ఉన్న హీరో దొరికాడని శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్‌ అధినేత దిల్‌ రాజు అన్నారు. శిరీష్‌ తనయుడు ఆశిష్‌ హీరోగా తెరకెక్కిన ‘రౌడీ బాయ్స్‌’ సినిమాలోని రెండోపాటను బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘యూత్‌ఫుల్‌ కథాంశంతో ‘రౌడీ బాయ్స్‌’ చిత్రం తెరకెక్కింది. కథానుగుణంగా ఈ టైటిల్‌ పెట్టాం.  టైటిల్‌ ఓకే అనుకున్నాక.. విజయ్‌ దేవరకొండ అనుమతి తీసుకున్నాను. విజయ్‌ నాకెంతో కాలంగా తెలుసు. మా బ్యానర్‌లో వచ్చిన ‘కేరింత’ సినిమా ఆడిషన్స్‌లో భాగంగా విజయ్‌ ఫొటోషూట్‌ కోసం ఓసారి మా ఆఫీస్‌కు వచ్చాడు. ఆ సినిమాలో ఉన్న ముగ్గురు హీరోల్లో ఓ రోల్‌ విజయ్‌ చేయాల్సింది. కానీ కుదరలేదు. ఆ తర్వాత విజయ్‌ హీరోగా ‘పెళ్లి చూపులు’  వచ్చింది. ఆ చిత్రాన్ని మా సంస్థ ద్వారా విడుదల చేయాలని ట్రై చేశాడు. అప్పుడు నేను ఆరేస్టలియాలో ఉన్నాను. అలా ఆ సినిమా నేను విడుదల చేయలేకపోయాను. ‘అర్జున్‌రెడ్డి’, ‘గీతగోవిందం’ సినిమాలతో స్టార్‌గా ఎదిగాడు. ‘గీతగోవిందం’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కి నేను గెస్ట్‌గా వెళ్లా. అక్కడ విజయ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చూసి ఆశ్చర్యపోయా. అతి తక్కువ కాలంలో స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. అప్పట్లో పవన్‌ కల్యాణ్‌కు యూత్‌లో ఎంత క్రేజ్‌ వచ్చిందో విజయ్‌ దేవరకొండకు అంత క్రేజ్‌ వచ్చింది. తెలుగు ఇండస్ర్టీకి పవన్‌కల్యాణ్‌లా ఓ యూత్‌ఫుల్‌ స్టార్‌ దొరికాడు. ‘లైగర్‌’తో ప్యాన్‌ ఇండియా హీరోగా పరిచయం అవుతున్నాడు’’ అని దిల్‌ రాజు వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవంబర్‌ 19న విడుదల చేయనున్నారు.