‘బర్త్‌డే కేక్’ ఖడ్గంతో కట్ చేసినందుకు క్షమాపణ చెప్పిన విజయ్ సేతుపతి
తమిళ చిత్రం ‘96’లో తన సహజ నటనతో అందరినీ ఆకట్టుకున్న నటుడు విజయ్ సేతుపతి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. జనవరి 16న.. అంటే ఇవాళ అతని పుట్టినరోజు కావడంతో ఓ సినిమా షూటింగ్లో ఉన్న విజయ్ సేతుపతి సెట్లోనే బర్త్‌డే కేక్ కట్ చేశాడు. అయితే.. ఆ కేక్‌ను ఓ ఖడ్గంతో కట్ చేయడంతో వివాదంలో చిక్కుకున్నాడు. ఆ ఫొటో వైరల్ కావడంతో.. కొందరు నెటిజన్లు విజయ్ చర్యను తప్పుబట్టారు. గూండాల మాదిరిగా ఖడ్గంతో పుట్టినరోజు కేక్‌ను కట్ చేయడమేంటని నెట్లో కామెంట్స్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ సేతుపతి.. కేక్‌ను అలా కట్ చేసినందుకు క్షమాపణ చెప్పాడు. అలా కట్ చేయడం వెనకున్న కారణాన్ని కూడా వివరించాడు.
ప్రస్తుతం తను నటిస్తున్న ‘పొన్రం’ సినిమాలో ‘ఖడ్గం’ కీలక పాత్ర పోషించనుందని.. అందువల్లే ఆ ‘ఖడ్గం’తో బర్త్ డే కేక్‌ను కట్ చేశానని సేతుపతి తన ట్విట్టర్లో వివరణ ఇచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం ‘పొన్రం’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సెట్లోనే ఈ ఘటన జరిగింది. బేషజాలకు పోకుండా విజయ్ సేతుపతి హుందాగా క్షమాపణ చెప్పడంతో ఈ వివాదానికి తెరపడింది.