Abn logo
Jan 27 2021 @ 16:23PM

నంద్యాల విజయడెయిరీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన నేతలు విజయం

కర్నూలు: నంద్యాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సమితి లిమిటెడ్‌ (విజయ డెయిరీ) మూడు డైరెక్టర్లల పదవులను వైసీపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. వైసీపీ బలపరిచిన ఎస్వీ జగన్మోహన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్‌‌రెడ్డి డైరెక్టర్లుగా గెలుపొందారు. మొత్తం ఓటర్లు 81 మంది ఉండగా 80 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయ డెయిరీ పాలకమండలిలో భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. అయితే హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో విఖ్యాత్‌రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. అందువల్ల విఖ్యాత్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోలేదు. విజయ డెయిరీ మూడు డైరెక్టర్ల పోస్టులకు ఆరుగురు పోటీ పడ్డారు.


ఈ పోలింగ్‌లో గంగుల విజయసింహరెడ్డికి 67 ఓట్లు, ఎస్వీ జగన్మోహన్ రెడ్డికి 65 ఓట్లు, రవికాంత్ రెడ్డికి 61 ఓట్లు వచ్చాయి. 80 మంది పాల సంఘాల అధ్యక్షులు.. ఒక్కొక్కరు 3 ఓట్లు వేశారు. గత ఏడాది ఎన్నికలు జరగని కారణంగా ఇప్పటి వరకు ఉన్న 9 మంది డైరెక్టర్లతో పాటు కొత్తగా ఎన్నికయ్యే ముగ్గురు డైరెక్టర్లతో 12 మంది కలిసి చైర్మన్‌ను ఎన్నుకుంటారు. అయితే ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డికి డైరెక్టర్‌గా పోటీకి అర్హత లేదంటూ  హైకోర్టులో పిటిషన్‌ వేశారు. డైరెక్టర్‌గా పోటీ చేస్తున్న మల్లికార్జున పిటీషన్‌తో ఎన్నికలపై ఈనెల 20వ తేదీన స్టే వచ్చింది. అయితే ఆయన తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈనెల 24వ తేదీన హైకోర్టు స్టే ఎత్తి వేసింది. దీంతో 27వ తేదీన ఎన్నికలు జరిగాయి. విజయ డెయిరీ చైర్మన్‌‌గా గత పాతికేళ్లుగా భూమా నారాయణరెడ్డి ఉన్నారు. నారాయణరెడ్డికి చైర్మన్‌ పదవి దక్కేలా నంద్యాల మాజీ ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి పావులు కదిపారు.

Advertisement
Advertisement
Advertisement