ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నా సర్కార్ పట్టించుకోదేం..?: విజయశాంతి

ABN , First Publish Date - 2021-06-04T02:16:45+05:30 IST

కరోనా దెబ్బకు తెలంగాణలోని కార్పోరేట్ ఆస్పత్రుల బారిన పడి ఎన్నో కుటుంబాలు ఆస్తులమ్ముకుని రోడ్డున్న పడ్డాయని బీజేపీ నాయకురాలు ..

ప్రైవేటు ఆసుపత్రులు దోచుకుంటున్నా సర్కార్ పట్టించుకోదేం..?: విజయశాంతి

హైదరాబాద్: కరోనా దెబ్బకు తెలంగాణలోని కార్పోరేట్ ఆస్పత్రుల బారిన పడి ఎన్నో కుటుంబాలు ఆస్తులమ్ముకుని రోడ్డున్న పడ్డాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సెకండ్ వేవ్‌తో పాటు గతేడాది మొదటి వేవ్‌లోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. అయినా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని, కోర్టులు కూడా ఆసుపత్రుల తీరుపై మండిపడుతున్నా.. సర్కారుకు మాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా టీఆర్‌ఎస్ పార్టీపై మండిపడ్డారు. అందులో ‘కరోనా దెబ్బకు తెలంగాణలోని కార్పోరేట్ ఆస్పత్రుల బారిన పడి ఆస్తులమ్ముకుని ఎన్ని కుటుంబాలు  రోడ్డున పడ్డాయో లెక్కలేదు. నేటి సెకెండ్ వేవ్ సమయంలో మాత్రమే కాదు... గతేడాది ఫస్ట్ వేవ్ సమయంలో కూడా కార్పోరేట్ ఆస్పత్రుల ట్రీట్‌మెంట్ ఛార్జీల దెబ్బకు ఎన్నో కుటుంబాలు కుదేలయ్యాయి. తెల్ల కాగితాలపైనే బిల్లులంటూ రాసిచ్చి... హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా పట్టించుకోకుండా  అరాచకం సృష్టించాయి. 


ప్రయివేట్, కార్పోరేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు చికిత్స జరగలేదన్నది పచ్చి నిజం. ఇదంతా పాలకులకు తెలిసే జరిగిందనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. కరోనా కట్టడిలో వైఫల్యాలపై గతంలోనే న్యాయస్థానం ఎండగట్టినప్పటికీ ఈ సర్కారు పట్టించుకోలేదు. ఈ సారి మాత్రం ఈ పరిస్థితులను చక్కదిద్దాల్సిందేనని.... కరోనా చికిత్స పేరిట అక్రమంగా రోగుల కుటుంబాల నుంచి కార్పోరేట్ ఆస్పత్రులు గుంజిన అధిక ఛార్జీలను తిరిగి వసూలు చేసి బాధితులకు ఇప్పించాల్సిందేనని హైకోర్టు కఠినంగా సర్కారును అదేశించింది. 


తప్పు చేశాయంటూ సర్కారు గుర్తించిన ఆస్పత్రులకు కేవలం కోవిడ్ చికిత్స అనుమతి మాత్రమే రద్దు చేశారు. మరి బాధితుల నుంచి ఆ ఆస్పత్రులు దోపిడీ చేసిన డబ్బు మాటేమిటి? ఆ తప్పు చేసిన ఆస్పత్రులకు శిక్ష వెయ్యరా? ఈ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు ఆదేశించిన ప్రకారం దోపిడీకి పాల్పడిన ఆస్పత్రుల నుంచి అక్రమార్జన కక్కించి బాధితులకు న్యాయం చెయ్యాల’ని విజయశాంతి డిమాండ్ చేశారు. 



Updated Date - 2021-06-04T02:16:45+05:30 IST