రైతాంగాన్ని కేసీఆర్ సర్కార్ నిండా ముంచింది: విజయశాంతి

ABN , First Publish Date - 2022-01-06T21:50:40+05:30 IST

తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ సర్కారు నిండా ముంచిందని బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి విమర్శించారు.

రైతాంగాన్ని కేసీఆర్ సర్కార్ నిండా ముంచింది: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ రైతాంగాన్ని కేసీఆర్ సర్కారు నిండా ముంచిందని బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి విమర్శించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘తెలంగాణ కోటి ఎకరాల మాగాణిలా తయారైందని, ఎఫ్‌సీఐకి బియ్యం అత్యధికంగా సరఫరా చేసేది మనమేనని ఎన్నోసభల్లో గప్పాలు కొట్టిన సీఎం కేసీఆర్... బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్రం చెప్పగానే కేంద్రం ఏకంగా వడ్లు కొనదని చెప్పి... గతంలో వరి సాగు ముద్దన్న నోటితోనే ఇప్పుడు వరి వద్దంటూ... యాసంగిలో వరి వేస్తే... ఉరి వేసుకున్నట్లేనని స్వయంగా ప్రకటించారు. పైగా వరి విత్తనాలు విక్రయించకుండా విత్తన కంపెనీలు, డీలర్లకు ఆంక్షలు విధించిన్రు. అయినా తమకు అలవాటైన వరి పంటను సాగు చేయడం మానేది లేదని తెగించి మరీ రైతులు వరి నాట్లు జోరుగా వేశారు. ఇక సీఎం కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో కూడా వరినే సాగు చేస్తూ రైతులను మాత్రం వరి వేయవద్దని చెప్పడంతో రైతులు ఆగ్రహంతో చిర్రెత్తుతున్న నేపథ్యంలో రైతుబంధు వారోత్సవాల పేరుతో నష్ట నివారణ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది కెసిఆర్ సర్కార్. ఎనిమిదో విడత రైతుబంధుతో రూ.50 వేల కోట్లు రైతులకు చెల్లించి మరో రికార్డును సృష్టిస్తున్నామని, ఇదే అంశంపై సంక్రాంతి ముగ్గులు, పిల్లలకు వ్యాసరచన పోటీలు, ఉపన్యాసపు పోటీలు, విజయోత్సవాలు నిర్వహించాలని కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పైగా సొంత పత్రికలో రైతుబంధుకు అనుకూల కథనాలు రాయిస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఇతర వర్గాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో... రైతు సమాజమే కేసీఆర్‌కు దన్నుగా ఉంటుందని భావిస్తున్నారు కానీ... ఏడేండ్ల కేసీఆర్ ఏలుబడిలో ఎంతమంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారో అందరికి తెలిసిందే... ఇక మూడేండ్లుగా రూ.లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి రైతులను బ్యాంకర్ల వద్ద డీఫాల్టర్లుగా మార్చేసి, బయట అప్పులు తెచ్చుకునేలా చేసి అప్పుల ఊబిలో పడేలా చేసిన ఈ దగాకోరు సర్కార్‌ను రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ రైతాంగం గద్దె దించక మానదు.’’ అని విజయశాంతి తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2022-01-06T21:50:40+05:30 IST