హమాలీల ఖర్చుల భారాన్ని రైతులపైనే వేస్తున్నారు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-11-11T02:22:22+05:30 IST

హమాలీల ఖర్చుల భారాన్ని రైతులపైనే వేస్తున్నారు: విజయశాంతి

హమాలీల ఖర్చుల భారాన్ని రైతులపైనే వేస్తున్నారు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణలో రైతులను టీఆర్ఎస్ సర్కారు మోసం చేస్తోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూచి లోడ్ చేసే హమాలీల ఖర్చుల భారాన్ని రైతులపైనే వేసి, తిరిగి చెల్లించకుండా రాష్ట్ర సర్కారు దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా రాములమ్మ చేసిన విమర్శల పోస్టు యథాతథంగా...


''రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలో వడ్లను తూకం వేసి లోడ్ చేసే హమాలీలకు రైతుల నుంచి చార్జీలను ఇప్పిస్తూ... ఆ డబ్బులను రైతులకు తిరిగి చెల్లించడంలో మాత్రం సీఎం కేసీఆర్  ముందడుగు వేయడం లేదు. ముందుగా రైతులు చెల్లిస్తే, ఆ మొత్తాన్ని రైతుల అకౌంట్లలో తిరిగి వేస్తామని చెప్పిన రాష్ట్ర సర్కార్ 2017 నుంచి ఇప్పటి వరకు పైసా చెల్లించకుండా రైతులను నిండా ముంచింది. గడిచిన నాలుగేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా వడ్లు అమ్మిన రైతులకు సర్కారు ఏకంగా రూ.500 కోట్లకు పైగా బకాయి పడినట్లు ఆఫీసర్లు చెబుతున్నారంటే... ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్ధమవుతోంది. ప్రతి సంవత్సరం వ్యయప్రయాసలకోర్చి, రైతులే రవాణా ఖర్చులు భరించి కొనుగోలు సెంటర్లకు వడ్లు తెస్తుండగా... తూకం వేసి, లోడింగ్ చేసే హమాలీలకు క్వింటాల్‌కు రూ.20 చొప్పున చెల్లించాల్సిన మొత్తంలో రూ. 5 కేంద్రం తన వాటాగా ఇస్తుంటే... మిగిలిన రూ.15ను సివిల్ సప్లయ్స్ శాఖ ద్వారా చెల్లించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం అలా ఇవ్వకుండా దోబూచులాడుతోంది. ఇక సర్కారు నుంచి హమాలీ చార్జీలు రాక పోవడంతో సెంటర్లలోని నిర్వాహకులు మొదట మీరు డబ్బులు ఇవ్వండి... ప్రభుత్వం రిలీజ్ చేశాక ఆ మొత్తాన్ని మీ అకౌంట్లలో తిరిగి జమ చేస్తామని రైతుల నుంచి నయానో, భయానో హమాలీ చార్జీలను వసూలు చేస్తున్న ఆఫీసర్లు... తిరిగి ఇప్పించడంపై ఫోకస్ పెట్టకుండ జాప్యం చేస్తున్రు.  కాగా... హమాలీలు గతంలో క్వింటాలుకు రూ.25 వరకు వసూలు చేయగా... ప్రస్తుతం రూ 30, రూ.35 దాకా వసూలు చేస్తున్నారు. ఇక ఈ వానాకాలంసో హమాలీల కొరత ఉన్నచోట్ల రూ.50 వరకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నప్పటికీ... వడ్లపై రాజకీయాలు చేస్తూ రైతులను అయోమయంలోకి పడేయడం రాష్ట్ర ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ స్పందించి పాత బకాయిలను ఇప్పించడంతో పాటు కొత్త హమాలీ చార్జీలను సర్కారే నేరుగా చెల్లించేలా చర్యలు తీసుకుంటే మంచిది.'' అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2021-11-11T02:22:22+05:30 IST