ఒవైసీ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: విజయశాంతి

ABN , First Publish Date - 2021-12-29T02:04:01+05:30 IST

హైదరాబాద్: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగాలంటే యూపీలో మళ్లీ బీజేపీనే ఎన్నుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు.

ఒవైసీ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: విజయశాంతి

హైదరాబాద్: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగాలంటే యూపీలో మళ్లీ బీజేపీనే ఎన్నుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన పిలుపుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు అభ్యంతరకరంగా ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. ఒవైసీ మత కోణాన్ని చొప్పిస్తూ వ్యాఖ్యలు చేశారని, ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని పాతబస్తీ వైపు ఒకసారి చూస్తే... అసదుద్దీన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్న విషయం పసిపిల్లలకు కూడా అర్థమవుతుందన్నారు. తన నియోజకవర్గంలో కనీస వసతులపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా... నిజాం కాలపు పాత గల్లీల్లో జనం పేదరికం మధ్య నలిగిపోతుంటే ఒవైసీ యూపీ వెళ్లి నీతులు చెబుతున్నారని రాములమ్మ సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. 




విజయశాంతి ఏమన్నారంటే


‘శతాబ్దాల కాలంగా సాగిన హిందువుల పోరాటాలు, త్యాగాల ఫలంగా నేడు అయోధ్యలో భవ్యమైన రామమందిరం నిర్మితమవుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఒకవైపు ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతునే శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యలో మనోహరమైన రామమందిరం రూపుదిద్దుకుంటోంది. మన భారతీయ సాంస్కృతిక వైభవానికి ప్రతీకలైన రాష్ట్రాలలో యూపీ ఒకటి. అయోధ్యలో హిందువులకు ఆరాధ్యదైవమైన రామమందిర నిర్మాణం, మన రామాయణ సంస్కృతి వారసత్వం ఎలాంటి ఆటంకాలూ లేకుండా కొనసాగాలంటే ఇతర పార్టీలకు బదులు యూపీలో మళ్లీ బీజేపీనే ఎన్నుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఇచ్చిన పిలుపుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించిన తీరు అభ్యంతరకరం. యూపీలో బీజేపీ అభివృద్ధికి బదులు ఆలయాన్ని చూపించి ఓట్లడుగుతోందనే అర్థం వచ్చేలా ఓవైసీ మత కోణాన్ని చొప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే సీఎం యోగి ఆదిత్యనాథ్ హయాంలో యూపీలో అభివృద్ధికి ఢోకాలేదని అక్కడి పరిణామాలు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అంతేగాక, సమాజ్‌వాదీ లాంటి పార్టీ అధికారంలోకి వస్తే, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఆలయ నిర్మాణం జరగకుండా చేస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, అభివృద్ధి గురించి అసదుద్దీన్ గారు మాట్లాడటమే విడ్డూరంగా ఉంది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని పాతబస్తీ వైపు ఒకసారి చూస్తే... అసదుద్దీన్ గారి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్న విషయం పసిపిల్లలకు కూడా అర్థమవుతుంది. తన నియోజకవర్గంలో కనీస వసతులపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టకుండా... నిజాం కాలపు పాత గల్లీల్లో జనం పేదరికం మధ్య నలిగిపోతుంటే యూపీ వెళ్లి నీతులు చెబుతున్నారు. ప్రజల్లో సామరస్యాన్ని చెడగొట్టి, రెచ్చగొట్టేలా మాట్లాడే ఓవైసీ సోదరుల తీరు... గతంలోని పలు సందర్భాల్లో వారు చేసిన  మత విద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రజలకు కొత్త కాదు. ఓవైసీ బ్రదర్స్ నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఇక్కడెవరికీ లేదని వారు గ్రహించాలి. ఓవైసీ మాటలను వారి సయామీ ట్విన్స్ టీఆరెస్ తప్ప దేశ ప్రజలెవరూ విశ్వసించరు’.-


 విజయశాంతి

Updated Date - 2021-12-29T02:04:01+05:30 IST