బెజవాడ కోవిడ్ కేర్ సెంటర్‌లో మృత్యు కీలలు

ABN , First Publish Date - 2020-08-10T09:16:58+05:30 IST

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 8మంది కరోనా పేషెంట్లు సజీవ దహనమైన ఘటన మర్చిపోకముందే

బెజవాడ కోవిడ్ కేర్ సెంటర్‌లో మృత్యు కీలలు

10 మంది బాధితుల మృతి

హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో తెల్లవారు జామున ఘోర అగ్నిప్రమాదం

ఆ హోటల్‌లోనే కరోనా సెంటర్‌

మంటలు, పొగతో బాధితులు ఉక్కిరిబిక్కిరి

కొందరు అగ్నికి ఆహుతి.. పొగతో ఆగిన అత్యధికుల ఊపిరి

కిటికీ అద్దాలు బద్దలు కొట్టుకుని బాల్కనీలోకి  

కాపాడాలంటూ పెద్దపెట్టున ఆర్తనాదాలు 

మొదటి అంతస్తు నుంచి దూకేసిన ముగ్గురు 

ఆ హోటల్‌లో రమేశ్‌ ఆస్పత్రి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ 

నాలుగు అంతస్తుల్లో 31మంది బాధితులు

విధుల నిర్వహణలో మరో 12 మంది సిబ్బంది


ఆదివారం... తెల్లవారుజామున 4.30 గంటలు... విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లోని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌... ఇంకా వదలని నిద్రమత్తుతో మంచాలకే పరిమితమైన కరోనా బాధితులను ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో అందరూ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. తమను కాపాడాలంటూ పెద్దపెట్టున ఆర్తనాదాలు చేశారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే పది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కరోనా నుంచి ప్రాణాలు కాపాడుకుందామనుకున్నవారిలో కొందరు మంటలకు ఆహుతైపోయారు. ఎక్కువ మంది ఊపిరాడక చనిపోయారు.


శానిటైజర్ల వల్లేనా..

షార్ట్‌సర్క్యూటే కారణం: అగ్నిమాపక సిబ్బంది హోటల్‌ను శుభ్రం చేసే డిజిన్‌ఫెక్టెంట్లతో పాటు ప్రాంగణంలో పెద్దఎత్తున శానిటైజర్ల నిల్వలు 

రీమోడల్‌ కోసం ప్లాస్టిక్‌ కాంపోజిట్‌ ప్యానెళ్లు.


భార్య కోసం ఆగి.. ఇద్దరూ మృత్యువాత

2 రోజుల్లో ఇంటికెళ్తారనగా తల్లీకొడుకు మృతి 

జ్వరానికి చికిత్స కోసం వచ్చి మహిళ దుర్మరణం


విజయవాడ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో 8మంది కరోనా పేషెంట్లు సజీవ దహనమైన ఘటన మర్చిపోకముందే విజయవాడలోనూ సరిగ్గా అలాంటి ఘోరమే చోటుచేసుకుంది. ఇక్కడి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆదివారం వేకువ జామున జరిగిన అగ్నిప్రమాదంలో పదిమంది మృత్యువాత పడ్డారు. వీరి మృతదేహాలకు నిర్వహించిన పరీక్షల్లో ఇద్దరికి మాత్రమే కరోనా పాజిటివ్‌ రాగా, మిగిలిన 8మందికి నెగెటివ్‌గా నిర్ధారణయింది. వీరిలో కొందరు చికిత్స పూర్తి చేసుకొని ఒకట్రెండు రోజుల్లో డిశ్చార్జి కావాల్సినవారు కూడా ఉండటం విషాదం. మృతుల్లో ఒకరు మంటల్లో పూర్తిగా కాలిపోగా, మిగిలినవారు పొగ కారణంగా ఊపిరాడక మృతిచెందారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలు ఇవీ.. విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రికి అనుబంధంగా స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ను కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్నారు. ఈ భవనంలోని ఐదు అంతస్తుల్లో 55 గదులు ఉన్నాయి. 


వాటిలోని నాలుగు అంతస్తుల్లో కొవిడ్‌ బాధితుల కోసం 31 గదులు కేటాయించారు. మరో 10గదుల్లో ఆస్పత్రి, హోటల్‌ సిబ్బంది ఉన్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా ఉండటంతో హోటల్‌ను రోజూ డిస్‌ఇన్‌ఫెక్టెంట్లతో శుభ్రం చేస్తున్నారు. ప్రాంగణంలో శానిటైజర్లనూ పెద్దఎత్తున నిల్వ చేశారు. దీనికితోడు ఏడాది క్రితం ఈ హోటల్‌ను రీమోడల్‌ చేయించడానికి ప్లాస్టిక్‌ కాంపోజిట్‌ ప్యానెళ్లు వినియోగించడంతో మంటలు శరవేగంగా వ్యాపించాయి. దట్టంగా అలముకున్న పొగతో గదుల్లో ఉన్నవారు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. కిటికీలు బద్దలు కొట్టుకుని పలువురు బాధితులు బాల్కనీలోకి వచ్చి రక్షించాలంటూ కేకలు వేశారు. రెండో అంతస్తులో విధులు నిర్వహిస్తున్న ఓ సెక్యూరిటీ గార్డు కిందకు దూకడంతో ప్రాణాలు దక్కినా ఆయన కాళ్లు విరిగిపోయాయి. మరో ముగ్గురు కొవిడ్‌ బాధితులు మొదటి అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనా స్థలిలోనే ఏడుగురు చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. మరో 21మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 31మంది కొవిడ్‌ బాధితులు చికిత్స పొందుతుండగా 12మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 


పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. హోటల్‌లోని సర్వర్‌ రూంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా చెలరేగిన మంటలు కొద్దిసేపటికే రిసెప్షన్‌కు వ్యాపించాయి. సిబ్బంది 5గంటల ప్రాంతంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. తర్వాత 5నిమిషాల్లోపే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలు చెలరేగుతుండటంతో మెట్లమార్గంలో పైకి వెళ్లలేకపోయారు. నిచ్చెనల ద్వారా హోటల్‌ గదుల కిటికీలు పగులగొట్టి, లోపల చిక్కుకుపోయిన బాధితులను రక్షించారు. స్వర్ణ ప్యాలె్‌సను ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు మేకతోటి సుచరిత, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పరిశీలించారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగాయని పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసరావు, అగ్నిమాపకశాఖ సంచాలకుడు జయరామ్‌ నాయక్‌ తెలిపారు. ఈ అగ్నిప్రమాదంపై విజయవాడ సెంట్రల్‌ తహసీల్దార్‌ పి.జయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆస్పత్రి యాజమాన్యం, స్వర్ణప్యాలెస్‌ యాజమాన్యంపై ఐపీసీ 304(2), 308, రెడ్‌విత్‌ 38 సెక్షన్ల కింద గవర్నర్‌పేట ఎస్‌ఐ ఎ.దుర్గాదేవి (క్రైం నం. 173/2020) కేసు నమోదు చేశారు. స్వర్ణప్యాలెస్‌ నుంచి మృతదేహాల తరలింపు, రెస్క్యూ ఆపరేషన్‌ ముగిసిన అనంతరం ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీమ్‌ సభ్యులు పరిశీలించారు. కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌, సీసీ కెమెరాల ఫుటేజీ నిక్షిప్తమయ్యే డీవీఆర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలకు విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులకు అప్పగించారు.


మృతుల్లో ఇద్దరికే కరోనా!

అగ్నిప్రమాదంలో మృతిచెందిన పదిమంది కరోనా బాధితుల్లో ఇద్దరికే పాజిటివ్‌గా నిర్ధారణయింది. మిగిలిన 8మందికి నెగెటివ్‌ రిపోర్టులే వచ్చాయి. మొత్తం 10 మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. నెగెటివ్‌ వచ్చినవారిని ముందే డిశ్చార్జి చేసి ఉంటే ఆ ఎనిమిది మంది బతికేవారని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఏ సమయానికి ఏం జరిగింది?

ఉదయం 4.30: స్వర్ణప్యాలెస్‌ హోటల్‌ రిసెప్షన్‌ వెనుక ఉన్న సర్వర్‌ రూంలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు రిసెప్షన్‌కు వ్యాపించాయి.

ఉదయం 5.08: అగ్నిమాపకశాఖకు, పోలీసులకు సమాచారం అందించిన సిబ్బంది

ఉదయం 5.10: పోలీస్‌ కంట్రోల్‌ రూం వద్ద ఉన్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఉదయం 5.11: మంటలు మొదటి, రెండో అంతస్థులకు వ్యాప్తించి కిటికీల అద్దాలు పగిలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడం ప్రారంభించారు. 

ఉదయం 5.12: పోలీసులు స్వర్ణప్యాలెస్‌ వద్దకు చేరుకున్నారు.  కొందరు కొవిడ్‌ బాధితులు కిటికీ అద్దాలు పగులగొట్టుకుని, కిటికీ అంచుల్లో ఉన్న బాల్కనీపైకి చేరి.. తమను రక్షించాలని అరవడం ప్రారంభించారు. 

ఉదయం 5.15: ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభం.  ఉదయం 6.30: గదుల్లో చిక్కుకుపోయిన కొవిడ్‌ బాధితులను తాడు(చైర్‌నాట్‌)తో కిందికి దించారు. 


మృతుల వివరాలు... 

డొక్కు శివబ్రహ్మయ్య(58), మచిలీపట్నం, కృష్ణాజిల్లా

మజ్జి గోపీ(54), మచిలీపట్నం కృష్ణాజిల్లా 

పొట్లూరి పూర్ణచంద్రరావు(78), కొడాలి, ఘంటసాల మండలం, కృష్ణాజిల్లా

సుంకర బాబు(68), అజిత్‌సింగ్‌నగర్‌, విజయవాడ

మద్దాలి రమేశ్‌(57) మొగల్రాజపురం, విజయవాడ 

సబ్బిట రత్న అబ్రహం(48) జగ్గయ్యపేట, కృష్ణాజిల్లా

సబ్బిట రాజకుమారి(45), జగ్గయ్యపేట కృష్ణాజిల్లా

దుడ్డు వెంకట నరసింహ పవన్‌కుమార్‌(30) కందుకూరు, ప్రకాశం జిల్లా

దుడ్డు వెంకట జయలక్ష్మి(48), కందుకూరు, ప్రకాశం జిల్లా

కొసరాజు సువర్ణలత(42), నిడుబ్రోలు, గుంటూరు జిల్లా

Updated Date - 2020-08-10T09:16:58+05:30 IST