పాలిచ్చిన చేత్తోనే విషమిచ్చి..!

ABN , First Publish Date - 2021-04-13T09:31:38+05:30 IST

ఓ పాపకు మూడేళ్లు. మరో చిన్నారికి పది నెలలు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు రోజూ తల్లి ఇచ్చే పాలనే తాగారు. రోజూ ఇచ్చే పాలు తాగి ఉల్లాసంగే కనిపించే ఆ

పాలిచ్చిన చేత్తోనే విషమిచ్చి..!

ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి

తానూ ఆ పాలు తాగేసి మృతి

వరకట్న వేధింపులే కారణం

విజయవాడ నున్నలో విషాదం


విజయవాడ రూరల్‌, ఏప్రిల్‌ 12: ఓ పాపకు మూడేళ్లు. మరో చిన్నారికి పది నెలలు. అభం శుభం తెలియని ఆ చిన్నారులు రోజూ తల్లి ఇచ్చే పాలనే తాగారు. రోజూ ఇచ్చే పాలు తాగి ఉల్లాసంగే కనిపించే ఆ చిన్నారులు.. ఆదివారం అవే పాలు తాగి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. పిల్లలకు విషం కలిపిన పాలిచ్చిన ఆ తల్లి కూడా వాటిని తాగేసి.. కన్నుమూసింది. ఈ హృదయ విదారక ఘటన కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలం నున్న గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వరకట్న వేధింపులే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. నున్నకు చెందిన ఒంగవోలు సురేంద్ర (29)... భార్య వాణి (26), కుమార్తెలు భావన (3), అక్షయ (10 నెలలు)తో కలిసి కోటకట్ట సెంటర్‌లో చిల్లర దుకాణం నిర్వహించేవాడు.


తండ్రి నాగేశ్వరరావుకు బైపాస్‌ సర్జరీ కావడంతో దుకాణాన్ని తండ్రికి అప్పగించి, సురేంద్ర ఆటో నడుపుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఆటోలో కూరగాయలు విక్రయించాడు. ఎప్పటి మాదిరిగానే ఆదివారం ఉదయం కిరాయికి వెళ్లిన సురేంద్ర మధ్యలో రెండు సార్లు ఇంటికి వచ్చాడు. సాయంత్రం కూడా కిరాయి ఉండటంతో బయటకు వెళ్లాడు. రాత్రి పదిన్నర గంటల సమయంలో భార్య వాణి పిల్లలకు విషమిచ్చి తానూ తాగినట్లు స్థానికులు అతడికి ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. అతడు హుటాహుటిన ఇంటికి వెళ్లగా... భార్య, కుమార్తెలు వాంతులు చేసుకుంటున్నారు. వారిని తొలుత ఒక ప్రైవేటు ఆసుపత్రికి ఆతర్వాత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వాణిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా, పిల్లలను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మార్గమధ్యలోనే ఒక కుమార్తె చనిపోగా, రెండో కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.


తల్లి వాణి మృత్యువుతో పోరాడి సోమవారం మధ్యాహ్నం చనిపోయింది. తొలుత ఆర్థిక ఇబ్బందుల కారణంగా జరిగిన ఘటనగా దీనిని భావించగా, గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న వాణి తల్లి లక్ష్మి వరకట్న వేధింపుల కారణంగానే తన కుమార్తె ఈ పనిచేసిందని వెల్లడించింది. సురేంద్ర తన అప్పులు తీర్చుకోవడానికి పొలం అమ్మేసి డబ్బులు తీసుకురావాలని పదే పదే భార్యను వేధించేవాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-13T09:31:38+05:30 IST