వామ్మో.. వాయిదా!

ABN , First Publish Date - 2020-07-08T20:25:21+05:30 IST

ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం మళ్లీ వెనక్కు తగ్గటం.. రెవెన్యూకు..

వామ్మో.. వాయిదా!

మరోమారు స్థలాల పంపిణీ వాయిదాతో రెవెన్యూ అధికారుల ఆందోళన

జాబితాలో మరికొందరి పేర్లు చేర్చాలంటూ ప్రజాప్రతినిధుల ఒత్తిడి

ఒకసారి వాయిదా ఫలితం.. కొత్తగా 29 వేల మందికి అవకాశం 

లబ్దిదారులతో పాటే పెరుగుతున్న ప్రతిపాదనలు 

భూములను అన్వేషించలేక అల్లాడిపోతున్న రెవెన్యూ 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం మళ్లీ వెనక్కు తగ్గటం.. రెవెన్యూకు తలనొప్పిగా పరిణమిస్తోంది. పట్టాల పంపిణీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం ఆలస్యం.. జిల్లావ్యాప్తంగా అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేల నుంచి రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. అధికారులకు మరికొందరి పేర్లు పంపి, వాటిని కూడా జాబితాలో చేర్చాలని ఎమ్మెల్యేలు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో పలు మండలాల్లో తహసీల్దార్లు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఒకసారి వాయిదా పడడంతో ఎమ్మెల్యేలు, నేతలు ఇచ్చిన జాబితాల్లో అత్యధికులకు చోటు కల్పించాల్సి వచ్చింది. పెరిగిన జాబితాకు అనుగుణంగా భూములను గుర్తించటానికి అష్టకష్టాలు పడిన తహసీల్దార్లు ప్రభుత్వ తాజా నిర్ణయంతో మళ్లీ తలలు పట్టుకుంటున్నారు.


ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమంలో గ్యాప్‌ రావటంతో.. ప్రజా ప్రతినిధుల నుంచి ప్రత్యేకంగా జాబితాలు వస్తున్నాయని, వారి నుంచి ఒత్తిళ్లు తీవ్రతరమవుతున్నాయని తహసీల్దార్లు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కొత్త దరఖాస్తులను తీసుకోవాల్సి వచ్చిందని, మరోమారు ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పిస్తే భూములను సేకరించలేమనే భావనలో ఉన్నారు.


జిల్లాలో ఇళ్ల పట్టాల లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బుధవారం జిల్లా వ్యాప్తంగా 2,92,197 మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టింది. జూన్‌కు ముందు జిల్లా వ్యాప్తంగా 2,62,601 మందిని అర్హులుగా తేల్చారు. జూన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మళ్లీ అవకాశం కల్పించటంతో 29.596 దరఖాస్తులు అదనంగా వచ్చాయి. ఇలా అదనంగా వచ్చిన దరఖాస్తులన్నీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సిఫార్సులు చేసినవేనని తెలుస్తోంది.


గ్రామస్థాయిలో వలంటీర్లు సర్వే చేసినప్పటికీ, ఆ జాబితాలను కాదని రెవెన్యూ యంత్రాంగం చేత క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేయించారు. రీ సర్వేలో ప్రజా ప్రతినిధులు సూచించిన పేర్లకే అమోదం లభించిందన్న విమర్శలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన దరఖాస్తులతో కలిపితే జిల్లా వ్యాప్తంగా 2,92,197 మందికి బుధవారం ఇళ్ల స్థలాల పట్టాలను ఇవ్వాల్సి ఉంది. తిరిగి ఆగస్టు 15వ తేదీకి వాయిదా వేయడంతో మళ్లీ కొత్తగా దరఖాస్తులకు ఆహ్వానిస్తే.. భూములను ఎక్కడి నుంచి సేకరించాలని తహసీల్దార్లు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-07-08T20:25:21+05:30 IST