పోలీసుల్లో కదలిక

ABN , First Publish Date - 2020-07-18T09:53:45+05:30 IST

విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో కదలికల పర్వం మొదలైంది. కిందిస్థాయి నుంచి ఆయా స్టేషన్లలో నిర్దిష్ట కాలాన్ని పూర్తి చేసుకున్న ..

పోలీసుల్లో కదలిక

(ఆంధ్రజ్యోతి - విజయవాడ): విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో కదలికల పర్వం మొదలైంది. కిందిస్థాయి నుంచి ఆయా స్టేషన్లలో నిర్దిష్ట కాలాన్ని పూర్తి చేసుకున్న అధికారులను, ఉద్యోగులను మార్పు చేయడానికి పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొలిదశ ఘట్టాన్ని మొదలుపెట్టారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేపడుతున్నారు. శాంతిభద్రతల విభాగం తోపాటు నేరపరిశోధన, ట్రాఫిక్‌ విభాగాల్లో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీపీ నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలిదశలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశారు. ఆ తర్వాత ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ స్థాయిల్లో ఉద్యోగులకు వెబ్‌కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేస్తున్నారు. ఈ తతంగం పూర్తయిన వెంటనే ఇన్‌స్పెక్టర్ల వంతు రానుంది. ఈసారి ఎస్‌హెచ్‌వో (స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్ల)ను పూర్తిస్థాయిలో మార్పు చేయడానికి రంగం సిద్ధమవుతోంది.


పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మొత్తం 20 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. వాటిలో పనిచేస్తున్న ఇద్దరు, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు మినహా మిగిలిన వాళ్లంతా రెండేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. ఈసారి ఏసీఆర్‌ (యా న్యువల్‌ కాన్ఫిడెన్షియల్‌ రిపోర్టు)తోపాటు ఇతరత్రా అంశాలను బేరీజు వేసుకుని పోస్టింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రధానంగా ఇప్పటి వరకు శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్లలో పనిచేయని వారికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడు దఫాలుగా శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న వారిని సీసీఎస్‌, స్పెషల్‌బ్రాంచ్‌, టాస్క్‌ఫోర్స్‌ లకు మార్పు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది ఇన్‌స్పెక్టర్ల పనితీరుపై పోలీస్‌ బాస్‌ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. 


ఆయా స్టేషన్లలో అసాంఘిక కార్యకలాపాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. దీనిపై ఆయా ఇన్‌స్పెక్టర్ల పనితీరుపై సీపీ ఆగ్రహంగా ఉన్నారు. తూర్పు మండలంలో ఓ పోలీస్‌స్టేషన్‌ను ఇటీవల పోలీసు కమిషనర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ ఇన్‌స్పెక్టర్‌ పనితీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన తీవ్రంగా మందలించినట్టు సమాచారం. ఆ స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి అప్పటికే ఆయన నిఘా వర్గాల ద్వారా ఒక నివేదికను రప్పించుకున్నారు. సుమారు గంటకు పైగా ఆ స్టేషన్‌లోనే ఉన్నారు. దీంతో తమకు స్థాన చలనం తథ్యమని ఇప్పటికే కొంతమంది ఇన్‌స్పెక్టర్లు అంచనాకు వచ్చారు. సాఽధ్యమైనంత వరకు ఆ స్థానాన్ని పదిలం చేసుకోవాలని, కానిపక్షంలో మరో స్టేషన్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రజాప్రతినిధులకు ఆర్జీలు ఇచ్చినట్టు వినికిడి. అయితే సిఫార్సుల నీడ బదిలీలపై ఉండకుండా చేయాలని సీపీ యోచిస్తున్నారు.


 మినహాయింపుల్లేవ్‌..

పోలీసు శాఖ నిబంధనల ప్రకారం ఇన్‌స్పెక్టర్లకు రెండేళ్లు, ఏఎస్‌ఐ, హెచ్‌సీ, పీసీలకు ఐదేళ్ల సర్వీసు ఒకస్థానంలో పూర్తయితే బదిలీ చేయాలి. ఇలా ఐదేళ్లు పూర్తిచేసుకున్న వారిని బదిలీ చేయడానికి రెండు రోజుల క్రితం సీపీ వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. స్టేషన్ల వారీగా ఆయా ఉద్యోగులను ఆన్‌లైన్‌లోకి తీసుకుని స్వయంగా పోలీసు కమిషనరే వారికి ఆప్షన్లు ఇచ్చారు. అన్ని విభాగాల్లోని స్టేషన్లలో ఖాళీలను వాళ్ల ముందుంచి ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఉద్యోగులకే ఇచ్చారు. ఐదేళ్ల సర్వీసు పూర్తయింది కాబట్టి అందరూ మారి తీరాల్సిందేనని చెప్పడంతో రకరకాల కారణాలు చెప్పినవారు కూడా చివరికి చేసేదేమీ లేక ఏదో ఒక స్థానాన్ని కోరుకున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2020-07-18T09:53:45+05:30 IST