విజయవాడ సబ్ కలెక్టర్ల‌కు టీడీపీ నేతల విజ్ఞాపన పత్రం

ABN , First Publish Date - 2021-06-18T18:08:39+05:30 IST

కోవిడ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ సబ్ కలెక్టర్‌కు టీడీపీ నేతలు విజ్ఞాపన పత్రం అందజేశారు.

విజయవాడ సబ్ కలెక్టర్ల‌కు టీడీపీ నేతల విజ్ఞాపన పత్రం

విజయవాడ: కోవిడ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ సబ్ కలెక్టర్‌కు టీడీపీ నేతలు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమా, విజయవాడ పార్లమెంట్ అధ్యక్షులు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ... కరోనా కారణంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోనాతో బలైన కుటుంబాలకి ప్రభుత్వం చేయూత ఇవ్వటం లేదని విమర్శించారు. మొదటి వేవ్ సడన్‌గా వచ్చింది కాబట్టి ఏం చేయాలో తెలియక పోవచ్చు కాని సెకండ్ వేవ్‌లో కూడా ప్రభుత్వం అలాగే ముందుకు వెళ్ళిందని అన్నారు. ఆక్సిజన్ మరణాలు అన్ని ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగినవని ఆరోపించారు. కోవిడ్ మరణాలు ప్రభుత్వం చెబుతున్న వాటికి కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాటికి సంబంధం లేదని తెలిపారు. చంద్రన్న భీమా ఉంటే ఈ రోజు కోవిడ్ మృతులకు డబ్బులొచ్చేవి... కానీ ఇప్పటికీ ప్రభుత్వం కోవిడ్ బాధితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. కోవిడ్ మరణాల లెక్కలు సరిగ్గా చెప్పాలని రఘురాం డిమాండ్ చేశారు. 


టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ... తిట్లీ తుఫాన్ వస్తే చంద్రబాబు అక్కడుండి పేదవారిని ఆదుకున్నారని...కానీ ఇక్కడ కరోనా వస్తే పేదవారిని పరామర్శించేందుకు రాలేదన్నారు. వారి మరణాలు కూడా సరిగ్గా లెక్కలు చెప్పకుండా దాస్తున్నారని ఆరోపించారు. కేరళ మనకన్నా ఎక్కువ కేసులు ఉన్నా మరణాలు అరికట్టారని చెప్పారు. ప్రతి గ్రామంలో యాభై బెడ్లు ఏర్పాటు చేసి కోవిడ్ చికిత్స అందించారని తెలిపారు. తమరు మాత్రం గాలికొదిలేసి ఈ రోజు కోవిడ్ మృతుల కుటుంబాల్ని కూడా పట్టించుకోవడం లేదని గద్దె రామ్మోహన్ మండిపడ్డారు.


మాజీ మంత్రి దేవినేనిఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ...ఈ రోజు 175 నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నామని... అన్ని సబ్ కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాలు ఇస్తున్నామని తెలిపారు. మొదటి వేవ్‌ని నిర్లక్ష్యం చేశారని..అలాగే రెండవ వేవ్‌ని కూడా నిర్లక్ష్యం చేయడంతో మరణాలు ఎక్కువయ్యాయన్నారు. కేంద్రం లక్షా ముప్పయి వేలు అంటే మీరు 90 వేలు అంటున్నారని... అన్ని దొంగ లెక్కలు, కాకి లెక్కలు చెప్తున్నారని విమర్శించారు. తమిళనాడులో జయలలిత లేకపోయినా స్టాలిన్ అమ్మా క్యాంటీన్‌లు నడుపుతున్నారని అన్నారు. తమరు ఎందుకు అన్నా కాంటీన్‌లు మూసి వేశారు అని ప్రశ్నించారు. ‘‘మీకు బుద్ధి ఉందా..దాని వలన ఎంతో మంది పేదవారు భోజనం చేసేవారు’’ అని అన్నారు. జర్నలిస్టులు ఈ జిల్లాలోనే ఐదుగురు చనిపోయారని..వారిని ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో చేర్చడానికి ఏంటి ఇబ్బంది అని నిలదీశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోవిడ్ బాధితుల్ని, హాస్పిటల్స్‌ని తనిఖీలు చేస్తున్నారన్నారు. తమరు మాత్రం తాడేపల్లి ప్యాలస్‌లో ఉండి పారాసిట్మల్ వాడమంటారా, బ్లీచింగ్ వాడమంటారా అని అంటున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో పత్తిపాటి ఏసమ్మకి ఇల్లు ఇస్తే ఆమె సరిహద్దులు పీకేశారన్నారు. అక్కడ చదువుకునేవారి మీద కూడా ఎస్సీ, ఎన్టీ  కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల సమస్యల గురించి తాము అడగడానికి వెళ్తే తమ మీద కేసులు పెట్టిస్తారా అని మండిపడ్డారు. అందుకు తప్ప ఎందుకన్నా పని చేస్తారా తమరు అని యెద్దేవా చేశారు. కచ్చితంగా కోవిడ్ బాధిత కుటుంబాలని ఆదుకోవాలని దేవినేని డిమాండ్ చేశారు.

Updated Date - 2021-06-18T18:08:39+05:30 IST