విజయవాడ టూ మహారాష్ట్ర వయా ఆదిలాబాద్‌

ABN , First Publish Date - 2021-03-03T05:37:07+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి జిల్లా మీదుగా మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.

విజయవాడ టూ మహారాష్ట్ర వయా ఆదిలాబాద్‌

గంజాయి సరఫరా చేస్తున్న అక్రమార్కులు

నిందితులను పట్టుకున్న పోలీసులు.. ముగ్గురి అరెస్టు 

ఆదిలాబాద్‌రూరల్‌, మార్చి 2: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి జిల్లా మీదుగా మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాను జిల్లా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌ జాతీయ రహదారి గుండా నిషేధిత గంజాయి రవాణా జరుగుతున్న విషయం టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దృష్టికి రావడంతో నెల రోజుల నుంచి ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో మంగళవారం ముందస్తు సమాచారం మేరకు ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ కె.పురుషోత్తంచారి ఆధ్వర్యంలో కచ్‌కంటి గ్రామ రహదారి వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ర్టానికి చెందిన ఎర్టిగా వాహనం (కేఏ38ఎం4036)లో ప్రత్యేకంగా తయారు చేసిన సీట్ల లోపల దాచిన 60కిలోల గంజాయి ప్యాకెట్‌లు లభ్యమయ్యాయి. మార్కెట్‌లో వీటి విలువ రూ.3లక్షలకు పైనే ఉంటుంది. గంజాయి రవాణా చేస్తున్న కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా దడిగి గ్రామానికి చెందిన బెలూరే పరమేశ్వర్‌, పర్సన్నే బల్వంత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో ప్రసాద్‌ అనే వ్యక్తి వీటిని ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రకు సరఫరా చేయాలని చెప్పినట్టు ఈ సందర్భంగా వారు పోలీసుల విచారణలో వెల్లడించారు. దీంతో వీరిద్దరితో పాటు ఆదిలాబాద్‌కు చెందిన ఉస్మాన్‌ఖాన్‌ అనే వ్యక్తికి కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

Updated Date - 2021-03-03T05:37:07+05:30 IST