వికాస్‌దూబేను వెంటాడిన ఎన్‌కౌంటర్ భయం

ABN , First Publish Date - 2020-07-09T16:04:20+05:30 IST

కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబేను ఎన్‌కౌంటర్ భయం వెంటాడింది....

వికాస్‌దూబేను వెంటాడిన ఎన్‌కౌంటర్ భయం

ఉజ్జయిని (మధ్యప్రదేశ్): కరడుకట్టిన కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబేను ఎన్‌కౌంటర్ భయం వెంటాడింది. బిక్రూ గ్రామంలో ఈ నెల 3వతేదీన 8 మంది పోలీసులను హతమార్చి పారిపోయిన వికాస్ దూబే కోర్టులో, లేదా టీవీ స్టూడియోలో లొంగిపోయేందుకు ప్రయత్నించగా కోర్టు కాంప్లెక్సుల్లో, టీవీ స్టూడియోల వద్ద పోలీసులను మోహరించడంతో ఎన్‌కౌంటర్ చేస్తారనే భయంతో అతను వెనుకంజ వేశాడని సమాచారం. గత వారం రోజుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతూ వికాస్ దూబే గురువారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరానికి వచ్చి అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. గత వారం రోజులుగా 40మంది ప్రత్యేక పోలీసు బృందాలు వికాస్ దూబే కోసం గాలించినా ఆయన దొరకలేదు.


దూబే ప్రధాన అనుచరులు ముగ్గురు పోలీసుల కాల్పుల్లో మరణించారు.  రెండు రోజుల క్రితం ఫరీదాబాద్ హోటల్ లో ఉన్న దూబే అక్కడి నుంచి తప్పించుకున్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని పోలీసులు వికాస్ దూబేను ట్రాన్సిట్ రిమాండుపై కోర్టు అనుమతితో ఉత్తరప్రదేశ్ పోలీసులకు అప్పగించనున్నారని సమాచారం. 60 కేసుల్లో నిందితుడైన వికాస్ దూబే నాటకీయ ఫక్కీలో ఉజ్జయిని దేవాలయంలో గార్డుకు దొరకడం విశేషం. ఎమ్మెల్యే కావాలనుకున్న దూబే జిల్లా పంచాయతీ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. బీజేపీ మంత్రి సంతోష్ శుక్లాను హతమార్చిన కేసులో దూబే నిందితుడు. 


వికాస్ దూబే మరో ఇద్దరు అనుచరుల ఎన్‌కౌంటర్ 

 వాంటెడ్ గ్యాంగస్టర్ వికాస్‌దూబే మరో ఇద్దరు అనుచరులను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. వికాస్ సన్నిహిత అనుచరుడు ప్రవీణ్ అలియాస్ బవువా దూబేను గురువారం యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. బిక్రూ గ్రామంలో 8మంది పోలీసులను హత్యచేసి పరారీలో ఉన్న వికాస్ దూబేతోపాటు అతని ముఠా సభ్యుల కోసం యూపీ ప్రత్యేక పోలీసులు గాలిస్తున్నారు. ఈటావా పట్టణంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికాస్ దూబేకు సన్నిహిత అనుచరుడైన బవువా దూబే హతమయ్యాడు. ఈటావా పట్టణ సమీపంలోని బాకేవార్ పోలీసుస్టేషను పరిధి మహీవా వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున 3 గంటలకు  స్పార్పియోలో వచ్చిన నలుగురు సాయుధులు డీఎల్ఐజడ్ఏ 3602 నంబరు గల స్విఫ్ట్ డిజైర్ కారును చోరీ చేసి పారిపోతుండగా పోలీసులు వారిని కచురా రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దీంతో వేగంగా వస్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు చెట్టును ఢీకొట్టింది. అనంతరం కారులో వారు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు.మరణించింది ప్రవీణ్ అలియాస్ బవువా దూబే అని తేలింది. మృతుడి వద్ద నుంచి ఒక పిస్టల్, మరో డబుల్ బ్యారల్ గన్, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు ముఠా సభ్యులు స్కార్పియోలో పారిపోయారు. పారిపోయిన ముఠా సభ్యుల కోసం సమీప జిల్లాల్లో గాలింపు ముమ్మరం చేశామని ఈటావా ఎస్పీ ఆకాష్ తోమర్ చెప్పారు. 

వికాస్ దూబే మరో అనుచరుడు ప్రభాత్ మిశ్రాను కాన్పూర్ వద్ద పోలీసులు కాల్చిచంపారు. పోలీసుల కస్టడీ నుంచి పారిపోతుండగా జరిపిన కాల్పుల్లో ప్రభాత్ మిశ్రా హతమయ్యాడు. ప్రభాత్ మిశ్రాను బుధవారం పోలీసులు అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తుండగా అతను పారిపోయేందుకు యత్నించాడు. ప్రభాత్ మిశ్రాను కారులో కాన్పూరుకు తరలిస్తుండగా పంకీ వద్ద కారు టైరుకు పంక్చర్ అయింది. దీంతో ప్రభాత్ పోలీసు నుంచి పిస్టల్ లాక్కొని కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ప్రభాత్ మరణించాడు. 

Updated Date - 2020-07-09T16:04:20+05:30 IST