కరోనాలో మారిన గ్రామం

ABN , First Publish Date - 2020-07-11T06:17:26+05:30 IST

పెద్ద విమానాశ్రయం ఉన్న విజయవాడ దగ్గరి గన్నవరం మండలంలో ఓ చిన్న గ్రామం... పురుషోత్తపట్నం. చుట్టూ కొండలు... మామిడి తోటలు... ఎంతో ఆహ్లాదంగా ఉంటుందా ప్రాంతం. కానీ... ఊళ్లోకి అడుగు పెడితే ఎన్నో సమస్యలు

కరోనాలో మారిన గ్రామం

ప్రభుత్వాలు మారుతున్నాయి... కానీ సమస్యలు పరిష్కారం కాలేదు. అధికారులు వచ్చిపోతున్నారు... ఫలితం కనిపించలేదు. నేతల చుట్టూ ప్రదక్షిణలు... ఎవరూ స్పందించలేదు. అర్జీలు... సంప్రతింపులు... వేడుకోళ్లు... విన్నపాలు... ఏళ్లుగా ఇదే నిత్యకృత్యమై విసుగెత్తిపోయారు ఆ గ్రామస్థులు. చివరకు కరోనా కాలంలో తామే రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ... లాక్‌డౌన్‌తో సొంతూరికి వచ్చిన యువకులూ చేతులు కలిపారు. అంతా ఒక్కటిగా... శ్రామిక శక్తిగా మారి తమ ఊరి రూపురేఖలు మార్చేశారు. ఇంతకీ ఎక్కడుందా ఊరు? రండి ఓసారి చూసొద్దాం... 


పెద్ద విమానాశ్రయం ఉన్న విజయవాడ దగ్గరి గన్నవరం మండలంలో ఓ చిన్న గ్రామం... పురుషోత్తపట్నం. చుట్టూ కొండలు... మామిడి తోటలు... ఎంతో ఆహ్లాదంగా ఉంటుందా ప్రాంతం. కానీ... ఊళ్లోకి అడుగు పెడితే ఎన్నో సమస్యలు. రోడ్డెక్కితే గుంతలు... అందులో నిలిచే నీళ్లు... నిత్యం ప్రమాదాలు అక్కడ సాధారణమైపోయాయి. ట్రాక్టర్లు వెళితే దిగబడిపోయేవి. మరోవైపు పొంగుతున్న డ్రైనేజీలు. పూడిక తీసినా ప్రయోజనం శూన్యం. వర్షాకాలంలో అయితే పరిస్థితి మరీ దారుణం. రైతులు పొలాల్లోకి వెళ్లాలంటే మోకాలు లోతు బురదలో దిగాల్సిందే. రోడ్డు పక్కన దట్టమైన పొదలు... అవి పురుగూ పుట్రకు నెలవయ్యాయి. 


ఎవరికి మొరపెట్టుకున్నా... 

గ్రామస్థులు మొరపెట్టుకున్నా పట్టించుకున్న అధికారి గానీ, స్పందించిన ప్రజాప్రతినిధి కానీ లేడు. కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. ఇవే కాదు... ఇంకా ఎన్నో సమస్యలు. ఎవర్ని కలిసినా... ఎవరికి విన్నవించినా ‘చూద్దాం... చేద్దాం’ అనేవారే కానీ చూసినవారూ లేరు... చేసినవారూ లేరు. ఏళ్లుగా ఇదే పరిస్థితి. గ్రామస్తులు విసిగి వేసారిపోయారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఇక ఎదురుచూడదలుచుకోలేదు. మార్పు ఎక్కడి నుంచో రాదు... దానికి మనమే ఎందుకు శ్రీకారం చుట్టకూడదు? ఈ ఆలోచనే వారిలో స్ఫూర్తి బిందువైంది. కార్యోన్ముఖులను చేసింది. దీంతో తామే రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. 


అలా ఒక్కటయ్యారు... 

ఏ పని చేయాలన్నా దానికి ఒక ప్రణాళికంటూ ఉండాలి. కరోనాదెబ్బకు గ్రామంలో పొలం పనులు చేసే యువకులంతా ఇళ్ల వద్దే ఉన్నారు. తొలుత వారంతా కలిసి ఏం చేయాలనేది చర్చించుకున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న మరికొంతమంది యువకులు వారికి జతకలిశారు. లాక్‌డౌన్‌ కావడంతో వారంతా సొంతూళ్లోనే ఉన్నారు. వీధి వీధికీ తిరిగి చైతన్యం నింపారు. విషయం తెలుసుకుని విజయవాడ చుట్టుపక్కల స్థిరపడిన కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. పనులకు శ్రీకారం చుట్టారు. వాట్సప్‌ గ్రూప్‌ పెట్టి ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ... సలహాలు, సూచనలు తీసుకొంటూ అడుగులు వేశారు. 


అందరూ భాగస్వాములే... 

ముందుగా ప్రమాదరకరంగా మారిన రోడ్డును పునర్నిర్మించాలి. తరువాత డ్రైనేజీ బాగుచేయాలి. పొదలు తొలగించాలి. ఇలా పనుల క్రమాన్ని నిర్దేశించుకున్నారు. వీటన్నింటికీ డబ్బు కావాలి. మరి అదెలా? దానికి ఎవరు ఇవ్వగలిగింది వాళ్లిచ్చారు. అలా పురుషోత్తపట్నం నుంచి కేసరపల్లి వరకు 2.9 కిలోమీటర్ల లింకు రోడ్డును తొలుత బాగుచేశారు. కంకర రోడ్డు నిర్మించారు. దీనికి మట్టి తరలించేందుకు రైతులు తమ ట్రాక్టర్లు ఇచ్చారు. 

శిథిలమైన నూజివీడు రోడ్డును సిమెంటు రోడ్డుగా మార్చారు. దానిపై పొంగిపొర్లుతున్న డ్రైనేజీ నీరు పోవడానికి ప్రత్యేకంగా ఓ తూము కట్టారు. పక్కనే గ్రంథాలయం వద్దనున్న చెట్ల కింద పెద్దలు, వృద్ధులు సేదదీరేందుకు సిమెంటు బల్లలు ఏర్పాటు చేశారు. గ్రామస్థుల వాకింగ్‌ కోసం ఊరు నడిబొడ్డున ఉన్న ఊట చెరువు గట్టుపై 500 మీటర్ల ట్రాక్‌ నిర్మించారు. అంతేకాదు... చుట్టూ ఉద్యానాన్ని, పిల్లల కోసం పార్కును అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇలా కరోనా కాలంలో మూడు నెలల లాక్‌డౌన్‌ సమయంలో కోటి రూపాయల సొంత నిధులతో కావాల్సిన పనులన్నీ స్వయంగా చేసుకున్నారు ఆ గ్రామస్థులు. శ్రమైకమత్యాన్ని చాటి... చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు.

- గుడాల శ్రీనివాస, విజయవాడ

Updated Date - 2020-07-11T06:17:26+05:30 IST