గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషిచేయాలి.. ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌

ABN , First Publish Date - 2021-02-24T05:09:15+05:30 IST

రైతులకు వృత్తి నైపుణ్యాలను అందిస్తూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా పశుసంవర్థక శాఖ అధికారులు కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కోరారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషిచేయాలి.. ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌
పశుసంవర్థకశాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌, పక్కన సంచాలకులు వి లక్ష్మారెడ్డి

జిల్లాలో సంతృప్తి కరంగా పశుసంవర్థకశాఖ పనితీరు

డైరెక్టర్‌ లక్ష్మారెడ్డితో కలిసి సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 23: రైతులకు వృత్తి నైపుణ్యాలను అందిస్తూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా పశుసంవర్థక శాఖ అధికారులు కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ కోరారు. మంగళవారం ఖమ్మం వచ్చిన పశుసంవర్థక శాఖ సంచాలకుడు డాక్టర్‌ వి.లక్ష్మారెడ్డితో కలిసి టీటీడీసీ సమావేశ మందిరంలో జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు, పశువైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పశుసంవర్థక శాఖ పనితీరు సంతృప్తికరంగా ఉందని, నట్టల నివారణ మందుల ఫలితాలు టీకాల పనితీరు, పశుగ్రాసం సాగు, పురోగతి గొర్రెల కొనుగోలు తదితర పథకాలను పూర్తిస్థాయిలో రైతులకు అందించే దిశగా పశువైద్యాధికారులు కృషిచేయాలన్నారు. కేవలం తమ వృత్తికే పరిమితమవకుండా తమ పరిధిలోని గ్రామాల అభివృద్ధిపై దృష్టిసారించాలని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతీ పథకం లబ్ధి అందేలా పనిచేయాలని సూచించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం ద్వారా ఎక్కువ సంఖ్యలో రైతులు లబ్ధిపొందేలా చూడాలని, ఈ పథకం కింద బ్యాంకు రుణాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులకు అవగాహన కల్పించి జిల్లాలో పౌలీ్ట్ర, మాంసాహార ఉత్పత్తులు అధికంగా జరిగేలా పశువైద్యాధికారులు కృషిచేయాలన్నారు. జిల్లాలో పశుమేతకు పుష్కలమైన వనరులున్నాయని వాటిని వినియోగించుకుని పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోరారు. పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్‌ వి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పశుసంవర్థక శాఖను మరింత పటిష్ఠపరచడంలో భాగంగా ఇప్పటికే వివిధ కేడర్‌లో పదోన్నతులు కల్పించామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినట్టు జిల్లాలో 260 గోపాలమిత్రలను ఏర్పాటు చేశామని, ప్రతీ మండల కేంద్రంలో పశుగ్రాస విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. గొల్లకురుమల ఆర్థికాభివృద్ధిలో భాగంగా జిల్లాలో 327 సొసైటీలను మొదటి విడతలో ఎంపిక చేసి 16,324 మందికి 1.25లక్షల యూనిట్ల గొర్రెలను 75శాతం రాయితీపై రూ.1.44కోట్లతో అందించామన్నారు. ఇప్పటి వరకు గ్రామాల్లో నిర్వహించిన పశువైద్య శిబిరాల ద్వారా 882మంది రైతులకు చెందిన 55వేల820 పశువులకు వివిధ వ్యాధి చికిత్సలు అందించామన్నారు. పశుసంపద సంరక్షణ చర్యలతో పాటు జిల్లాలో పలు ప్రాంతాల్లో పశువైద్యశాల భవనాల మరమ్మతుల మౌళిక సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్టు వివరించారు. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అంశంపై తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల విజేతలకు ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ సమీక్ష సమావేశంలో జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వేణుమనోహార్‌రావు, అసిస్టెంట్‌ డైరెక్టర్లు భాను, సత్యప్రసాద్‌, అరుణ, పశువైద్యాధికారులు పాల్గొన్నారు.   

Updated Date - 2021-02-24T05:09:15+05:30 IST