కోట్లు దొంగతనం చేశాడు.. భార్యను ఎన్నికల అభ్యర్థిగా నిలబెట్టాడు.. పేద వారికి సహాయం చేసి రాబిన్‌హుడ్‌‌గా నిలిచాడు

ABN , First Publish Date - 2021-10-26T15:12:36+05:30 IST

బీహార్‌లోని సీతామడి నగరంలో పేద కుటుంబంలో జన్మించాడు ఇర్ఫాన్. అతని తల్లిదండ్రలు కూలీ పని చేసి జీవనం సాగించేవారు. కానీ ఇర్ఫాన్‌కి మాత్రం చిన్నప్పటి నుంచి డబ్బు బాగా సంపాదించాలనే కోరిక ఉండేది. దీంతో అతను ఇల్లు వదిలి ముంబై వెళ్లిపోయాడు. రకరకాల పనులు చేశాడు. కానీ ఆశించినంత డబ్బు మాత్రం అందలేదు. డబ్బు ఎలాగైనా సంపాదించాలని ఆలోచించి చివరికి దొంగతనాలు...

కోట్లు దొంగతనం చేశాడు.. భార్యను ఎన్నికల అభ్యర్థిగా నిలబెట్టాడు.. పేద వారికి సహాయం చేసి రాబిన్‌హుడ్‌‌గా నిలిచాడు

బీహార్‌లోని  సీతామడి నగరంలో పేద కుటుంబంలో జన్మించాడు ఇర్ఫాన్. అతని తల్లిదండ్రలు కూలీ పని చేసి జీవనం సాగించేవారు. కానీ ఇర్ఫాన్‌కి మాత్రం చిన్నప్పటి నుంచి డబ్బు బాగా సంపాదించాలనే కోరిక ఉండేది. దీంతో అతను ఇల్లు వదిలి ముంబై వెళ్లిపోయాడు. రకరకాల పనులు చేశాడు. కానీ ఆశించినంత డబ్బు మాత్రం అందలేదు. డబ్బు ఎలాగైనా సంపాదించాలని ఆలోచించి చివరికి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.


కోటీశ్వరుల ఇళ్లలో పగలు ఏదో ఒక వంకతో ప్రవేశించి అక్కడ పరిస్థితులను బాగా గమనించేవాడు. రాత్రి వేళ అదే ఇంట్లో దొంగతనం చేసేవాడు. బంగారు, వజ్రాలు, డబ్బు, ఖరీదైన వస్తువులు ఇలా అన్నీ దొంగలించేవాడు. దాదాపు 30కు పైగా బడా బాబుల ఇళ్లో చోరీ చేశాడు. ఇలా కొన్ని సంవత్సరాలు చేశాక..  ఆ చోరీ చేసిన సొమ్మంతా కూడగట్టుకొని తన తల్లిదండ్రల వద్దకు బయలుదేరాడు.


ఇర్ఫాన్ తల్లిదండ్రులు ఇంకా పేదరికంలోనే ఉన్నారు. ఇక వారి వద్దనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తన ఊరిలో ఉండే పాత మిత్రులను కలిశాడు. వారికి విందులు, పార్టీలు అంటూ బాగా ఖర్చు చేశాడు. అందరూ ఇర్ఫాన్ ఇంత డబ్బు ఎలా సంపాదించారని అడిగితే.. 'ముంబైలో బిజినెస్ చేసేవాడిని' అని చెప్పేవాడు. కాలం గడిచే కొద్దీ ఇర్ఫాన్‌కి సమాజంలో గుర్తింపు కావాలని, విలాసంగా జీవితం గడపాలని కోరిక కలిగింది. అందుకోసం ముందు పెళ్లి చేసుకున్నాడు.


తన భార్యను మున్సిపల్ ఎన్నికలలో నిలబెట్టాడు. భార్య ఎన్నికలలో గెలిస్తే రాజకీయాలలో ప్రవేశించవచ్చని భావించాడు. ఎన్నికలకు ముందు ఊరిలోని ప్రజల వద్దకు వెళ్లాడు. ప్రచారం కోసం బాగా తిరిగేవాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా అక్కడికి చేరుకునేవాడు. పేదల ఇళ్లలో అమ్మాయిల పెళ్లిళ్లు చేశాడు. కొందరికి వైద్యం చేయించాడు. మరికొందరికి ఉపాధి కోసం అప్పు ఇచ్చాడు. ఇలా డబ్బు బాగా ఖర్చు చేశాడు.


కానీ ఇంతవరకూ ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగిన ఇర్ఫాన్ జీవితానికి ఒక్కసారిగా ఎదురుదెబ్బ తగిలింది. అతడు చేసిన దొంగతనాల కేసులు పోలీసులు ఛేదించారు. ఇర్ఫాన్‌ని వెతుకుతూ సీతామడి చేరుకున్నారు. చివరికి ఇర్ఫాన్‌ని పట్టుకున్నారు. 


పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తీసుకెళుతుంటే కొందరు అడ్డుకున్నారు. అతను చాలా మంచివాడని.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు ఇర్ఫాన్ ఒక దొంగ అని చెప్పగానే వారంతా షాక్‌కు గురయ్యారు. కానీ పోలీసుల విచారణలో అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడానికి ఆ ఊరిలో ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం ఇర్ఫాన్ జైలులో ఉన్నాడు. అతడిపై కోర్టులో కేసులు విచారణలో ఉన్నాయి.

Updated Date - 2021-10-26T15:12:36+05:30 IST