వానరంతో గ్రామస్థుల అనుబంధం.. అనారోగ్యం నుంచి కాపాడేందుకు ఎంతో కృషి.. ఘనంగా తుది వీడ్కోలు..

ABN , First Publish Date - 2021-12-31T14:31:30+05:30 IST

ఆ కోతి సమీప అడవి నుంచి గ్రామానికి వచ్చింది.. దానితో గ్రామస్థులు అనుబంధం పెంచుకున్నారు..

వానరంతో గ్రామస్థుల అనుబంధం.. అనారోగ్యం నుంచి కాపాడేందుకు ఎంతో కృషి.. ఘనంగా తుది వీడ్కోలు..

ఆ కోతి సమీప అడవి నుంచి గ్రామానికి వచ్చింది.. దానితో గ్రామస్థులు అనుబంధం పెంచుకున్నారు.. ఆంజనేయ స్వామికి ప్రతిరూపంగా భావించారు.. అది అనారోగ్యానికి గురైతే తల్లడిల్లిపోయారు.. హాస్పిటల్ చుట్టూ తిప్పారు.. రాత్రంతా పక్కనే ఉండి చూసుకున్నారు.. అయినా ఆ వానరం ప్రాణాలు దక్కలేదు.. దీంతో ఊరు ఊరంతా ఆ కోతికి ఘనంగా తుది వీడ్కోలు పలికింది.. మధ్యప్రదేశ్‌లోని రాజగఢ్‌లో ఈ ఘటన జరిగింది. 


రాజ్‌గఢ్‌కు సమీపంలోని దాలుపుర గ్రామానికి సమీపంలో ఉన్న అడవి నుంచి ఓ వానరం వచ్చింది. దానిని గ్రామస్థులు ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించారు. ఉన్నట్టుండి బుధవారం ఉదయం ఆ కోతి అనారోగ్యానికి గురైంది. దీంతో గ్రామస్థులు కోతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి గ్రామానికి తీసుకెళ్లారు. బుధవారం రాత్రికి దాని ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో రాత్రంతా ఆ కోతి పక్కనే ఉంటూ, మంట వెలిగించి సపర్యలు చేశారు. 


ఉదయానికి ఆ కోతి మరణించింది. దీంతో ఊరు ఊరంతా భావోద్వేగానికి గురైంది. ఆ వానరానికి ఘనంగా తుది వీడ్కోలు పలకాలని గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆ కోతి మృతదేహాన్ని ఊరేగింపుగా స్మశానికి తీసుకెళ్లారు. అందరూ కొబ్బరికాయలు కొట్టి దండాలు పెట్టుకున్నారు. ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2021-12-31T14:31:30+05:30 IST