కొవిడ్‌ కోరల్లో గ్రామాలు

ABN , First Publish Date - 2020-09-19T05:30:00+05:30 IST

హద్దులు, సరిహద్దులు దాటి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గ్రామాలపై కోరలు చాస్తోంది. వైరస్‌ పంజాకు

కొవిడ్‌ కోరల్లో గ్రామాలు

పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపిస్తున్న వైరస్‌

కరోనా క్యారియర్లుగా వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు

ప్రతీ మండలంలో 500లకు పైగా పాజిటివ్‌లు 

జిల్లాలో సగం కేసులు పల్లెల్లోనే నమోదు

కట్టడి ప్రాంతాలుగా ప్రకటిస్తున్న సర్పంచ్‌లు


ఖమ్మం సంక్షేమ విభాగం, సెప్టెంబరు 18: హద్దులు, సరిహద్దులు దాటి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గ్రామాలపై కోరలు చాస్తోంది. వైరస్‌ పంజాకు పల్లెవాసులు విలవిల్లాడుతున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిండంతో కొవిడ్‌ వేగంగా వ్యాపిస్తోంది. గత నెలవరకు పట్టణాలకే పరిమితమైన మహమ్మారి సెప్టెంబరులో మాత్రం పల్లెల్లో అలజడి రేపుతోంది. చిరు వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు, ఆసుపత్రులకు వెళ్లే రోగులు, వారి బంధువులు వైరస్‌కు వాహకాలు అవుతున్నారు. చిన్నపాటి గ్రామపంచాయతీల్లో కూడా పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో సర్పంచ్‌లు స్వచ్ఛందంగా కట్టడి ప్రాంతాలుగా ప్రకటిస్తున్నారు.


14,700 పాజిటివ్‌ కేసుల నమోదు

జిల్లాలో పీహెచ్‌సీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ప్రారంభించిన తర్వాత పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏప్రిల్‌ 4న జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. జూన్‌ వరకు కేసుల సంఖ్య పెరుగుతూ 45,00 మందికి వైరస్‌సోకింది. జూలై నుంచి జిల్లాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆగస్టులో నిత్యం 400నుంచి 500 మందికి పాజిటివ్‌ రిపోర్టులు వచ్చాయి. సెప్టెంబరు 17నాటికి జిల్లాలో కరోనా సోకినవారి సంఖ్య 14,700లకు చేరింది.


గ్రామాలపై కరోనా పంజా

ఖమ్మం జిల్లా కేంద్రంలో తొలికేసు నమోదయ్యాక నెల రోజుల వరకు నగరంతోపాటు రఘునాథపాలెం, ఖమ్మంరూరల్‌ మండలం పెద్దతండాకే వైరస్‌ పరిమితం అయింది. లాక్‌డౌన్‌ సడలింపులతో గ్రామాలు, పట్టణాల మధ్య ప్రజల రాకపోకలు పెరిగాయి. దీంతో వారు వాహకాలుగా కరోనా వ్యాపించిందని వైద్య ఆరోగ్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


సగం కేసులు పల్లెల్లోనే..

గ్రామాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో సర్పంచ్‌లు స్వచ్ఛందంగా కట్టడి ప్రాంతాలుగా ప్రకటిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 14,700 వరకు కరోనా పాజిటివ్‌లను గుర్తించగా కాగా వాటిలో ఏడువేల కేసులు పల్లెల్లోనే నమోదయ్యాయి. గత నెలరోజుల్లో నమోదైన మొత్తం కేసుల్లో 75శాతం గ్రామాలలో నిర్వహించిన పరీక్షల్లోనే తేలాయి. 1600 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో కూడా 50కరోనా పాజిటివ్‌లు నమోదయ్యాయి. ఖమ్మానికి సమీపంలో ఉన్న వైరా మండలంలో 560, తల్లాడలో 500, బోనకల్లులో 500వరకు ఇలా జిల్లాలోని ప్రతి మండలంలో 400నుంచి 600వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2020-09-19T05:30:00+05:30 IST