పల్లెలు వందశాతం వ్యాక్సినేషన్‌ దిశగా..

ABN , First Publish Date - 2021-10-28T05:44:41+05:30 IST

ప్రపంచాన్ని గడగడలాడించి, అయినవారిని దూరం చేసి, చివరి చూపున కూ నోచుకోకుండా చేసిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ ముందుంది.

పల్లెలు వందశాతం వ్యాక్సినేషన్‌ దిశగా..
నడిగూడెం మండలం చెన్నకేశవపురంలో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిన సందర్భంగా కేక్‌ కట్‌చేస్తున్న వైద్యసిబ్బంది

ఫలితమిస్తున్న స్పెషల్‌ డ్రైవ్‌8 ప్రజల్లో పెరిగిన అవగాహన

280 గ్రామలు, మునిసిపాలిటీల్లోని 75వార్డుల్లో వందశాతం


సూర్యాపేటటౌన్‌, నడిగూడెం: ప్రపంచాన్ని గడగడలాడించి, అయినవారిని దూరం చేసి, చివరి చూపున కూ నోచుకోకుండా చేసిన కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వైద్య ఆరోగ్యశాఖ ముందుంది. కరోనా మరణాల నుంచి వ్యాక్సినేషన్‌ కాపాడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో, ఆ మేరకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి టీకాల కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ప్రజల అపోహలు, అనుమానాల నడుమ వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగింది. ఈ నేపథ్యంలో ప్రజలను చైతన్యపరిచేందుకు గత నెలలో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టగా జిల్లాలో సత్ఫలితాలిస్తోంది. ఫలితంగా పల్లెలు వంద శాతం వ్యాక్సినేషన్‌ బాటలో నడుస్తున్నాయి.


మునిసిపల్‌, మండల, గ్రామ కమిటీలు, మెప్మా సహకారంతో వైద్య ఆరోగ్యశా ఖ నిత్యం 500 నుంచి 1000 టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి జిల్లాలోని 280 గ్రామాలు, ఐదు మునిసిపాలిటీల్లోని 75 వార్డుల్లో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారు. వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిన గ్రామాల్లో ఇటీవల అధికారులు కేక్‌ కట్‌ చేసి, మిగతా గ్రామాలను ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించారు. వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్న ప్రజలను కేంద్రాలకు రప్పించేలా అధికారులు, పంచాయతీ పాలకవర్గాలు ఇంటింటి ప్రచారా న్ని నిర్వహిస్తున్నాయి. నిరంతర ప్రక్రియలో వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని సాధించేలా వైద్యశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.


6.96లక్షల మందికి టీకా

జిల్లా జనాభా 11,72,758 కాగా, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుం చి ఇప్పటి వరకు 6.96లక్షల మందికి టీకా ఇచ్చారు. 5.70లక్షల మందికి మొదటి డోసు, 1,63,689 మందికి రెండో డోస్‌ పూర్తయింది. జిల్లాలోని సూర్యాపేట, కోదాడ వైద్యశాఖ డివిజన్ల పరిధిలో 721 ఆవాస గ్రామాలు ఉండగా, 280 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ సాధించారు. మరికొన్ని గ్రామాలు వందశాతం లక్ష్యానికి చేరువలో ఉన్నాయి. స్పెషల్‌ డ్రైవ్‌లో గ్రామ పంచాయతీ, మండల అధికారులు, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు పాల్గొంటున్నారు. జిల్లాలో మొత్తం 294 మంది వైద్యసిబ్బంది బృందాలుగా ఏర్పడి ఈ డ్రైవ్‌లో పాల్గొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించి ప్రత్యేక శిబిరానికి తరలించడంతోపాటు టీకాలు పూర్తయిన ఇంటికి స్టిక్కర్‌ వేస్తున్నారు. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తుంగతుర్తి మునిసిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 141 వార్డులు ఉండగా, 75 వార్డుల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది. సూర్యాపేటలో 48 వార్డులకు 28, హుజూర్‌నగర్‌లో 28 వార్డులకు 16, కోదాడలో 35 వార్డులకు 23, తిరుమలగిరిలో 15 వార్డులకు ఒక వార్డు, నేరేడుచర్లలో 15 వార్డులకు ఏడు వార్డుల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయింది.


నేను వేసుకోనుపో..

కొవిడ్‌ టీకా తీసుకునేందుకు నిరాకరించిన పెంచికల్‌దిన్నవాసి

నేరేడుచర్ల: అప్పుడొస్తే టీకా ఇయ్యలే.. ఇప్పుడొచ్చి మీరిస్తే తీసుకుంటానా.. నేను తీసుకోనుపో.. అంటూ మండలపరిధిలోని పెంచికల్‌దిన్నకు చెందిన గజకంటి సైదులు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు నిరాకరించాడు. స్పెషల్‌డ్రైవ్‌లో భాగంగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు పీహెచ్‌సీ ఫార్మసిస్టు రమేష్‌, అంగన్‌వాడీ టీచర్‌, ఏఎన్‌ఎం తదితరులు గ్రామానికి బుధవారం వచ్చారు. ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరుతూ సైదులు ఇంటికి వెళ్లారు. అయితే అతడు మాత్రం వ్యాక్సిన్‌ తీసుకునేందుకు నిరాకరించాడు. గతంలో సైదులు స్థానిక పీహెచ్‌సీకి వెళ్లి వ్యాక్సిన్‌ కోసం క్యూలో నిల్చున్నాడు. అప్పట్లో కోటా తక్కువగా ఉండటంతో సైదులు వంతు వచ్చేసరికి వ్యాక్సిన్‌ నిల్వ పూర్తయింది. దీంతో ఉసూరుమంటూ అతడు తిరిగి ఇంటికి చేరాడు. కాగా, గ్రామంలో స్పెషల్‌ డ్రైవ్‌ కోసం వచ్చిన వైద్య సిబ్బందిని చూడగానే అతడికి ఆగ్రహం ముంచుకొచ్చింది. అప్పుడొస్తే వ్యాక్సిన్‌ ఇవ్వలేదు.. ఇప్పుడొచ్చి మీరిస్తానంటే వేసుకుంటానా.. అంటూ సిబ్బందికి దొరకకుండా ఇంటి నుంచి వీధిలోకి వెళ్లాడు. అతడి అనుసరిస్తూ ఫార్మసిస్టు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, పక్కనే ఉన్న కర్ర తీసుకొని సైదులు అతడిని బెదిరించాడు. చివరికి ఫార్మసిస్టు వెనుతిరగాల్సి వచ్చింది. స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న సిబ్బందికి గ్రామాల్లో నిత్యం ఇలాంటి విచిత్ర సంఘటనలు ఎదురవుతున్నాయి.


వందశాతం వ్యాక్సినేషన్‌కు కృషి

డీఎంహెచ్‌వో కోటాచలం

తుంగతుర్తి, అక్టోబరు 27: జిల్లాలో వచ్చేనెల 3వ తేదీ నాటికి తొలి డోస్‌ వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నామని డీఎంహెచ్‌వో కోటాచలం తెలిపారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన బుధవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో 7.90లక్షల మంది  వ్యాక్సినేషన్‌కు అర్హులని గుర్తించగా, ఇప్పటి వరకు 5.70లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామన్నారు. జిల్లా వ్యాప్తంగా పల్లె దవాఖానాలు ఏర్పాటుచేస్తున్నామని, తొలి విడతగా 18 ప్రారంభించినట్లు తెలిపారు. రెండో విడతలో 64 పల్లె దవాఖానాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు. జిల్లాలో వైద్యుల కొరత లేదని, సరిపడా సిబ్బంది ఉన్నారన్నారు. తుంగతుర్తి ఆస్పత్రిలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. ఆయన వెంట డాక్టర్‌ నాగునాయక్‌ తదితరులు ఉన్నారు.


280 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌: డీపీవో యాదయ్య

నడిగూడెం: జిల్లాలో ఇప్పటి వరకు 280 గ్రామాల్లో వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. మండలంలోని నడిగూడెం, నారాయణపురంలో వ్యాక్సినేషన్‌ను ఆయన బుధవారం పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కరోనా ముప్పు ఇంకా తప్పిపోలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే పర్యావసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. జిల్లా, మండల, గ్రామ కమిటీలు బాధ్యతగా పనిచేయకుంటే వివిధ దశలో రూపాంతరం చెందుతున్న కరోనా ముప్పు నుంచి బయటపడలేమన్నారు. ప్రజలంతా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకుంటేనే ఎలాంటి ప్రాణహాని ఉండదన్నారు. జిల్లా వ్యాప్తంగా 280 ఆవాసాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తయిందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎర్రయ్య, ఎంపీవో లింగారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T05:44:41+05:30 IST