వినాయకా సెలవిక!

ABN , First Publish Date - 2022-09-10T06:57:03+05:30 IST

గణపతి బొప్పా మోరియా.. జై గణేశ.. మోరియారే.. గణపతి మోరియారే.. బోలో గణేశ్‌ మహరాజ్‌ కీ జై.. అంటూ భక్తులు ఆనందోత్సాహాల మధ్య శుక్రవారం విఘ్నేశ్వర నిమజ్జనోత్సవం జిల్లాలో ఘనంగా సాగింది.

వినాయకా సెలవిక!
టవర్ సర్కిల్ వద్ద ఊరేగింపు

 - జిల్లాలో ఘనంగా నిమజ్జనోత్సవం

- నేత్రపర్వంగా శోభాయాత్రలు

- భక్తి పారవశ్యంలో మునిగితేలిన భక్తులు

- వర్షంతో ఆలస్యంగా ప్రారంభమైన వేడుకలు

- టవర్‌సర్కిల్‌ వద్ద పూజల్లో మంత్రి గంగుల, ఎంపీ బండి, మేయర్‌, కలెక్టర్‌  


కరీంనగర్‌ కల్చరల్‌, సెప్టెంబరు 9: గణపతి బొప్పా మోరియా.. జై గణేశ.. మోరియారే.. గణపతి మోరియారే.. బోలో గణేశ్‌ మహరాజ్‌ కీ జై.. అంటూ భక్తులు ఆనందోత్సాహాల మధ్య శుక్రవారం విఘ్నేశ్వర నిమజ్జనోత్సవం జిల్లాలో ఘనంగా సాగింది. ఉదయం నుంచే మంటపాల వద్ద ఉద్వాసన పూజలు జరగగా మధ్యాహ్నం ఆయా ఉత్సవ కమిటీల సారధ్యంలో వాహనాలను విద్యుద్దీపాలతో, రంగురంగుల పూలతో సుందరంగా అలంకరించి అందులో విఘ్నేశ్వరులను నిలిపారు. లక్కీ డ్రాలు, లడ్డూ వేలాలు నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు, పలు వస్తువులు, లడ్డూలు చేజిక్కిచ్చుకున్నారు. డప్పు చప్పుళ్లు, గజ్జెల మోతలు, మంగళ వాయిద్యాల మధ్య భజన పాటలు, భక్తి పాటల రికార్డులు, కోలాటాలు, దాండియా, కర్ర విన్యాసాలు, శాస్త్రీయ జానపద నృత్యాలు, ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాలతో నిమజ్జనయాత్ర జోరుగా  కొనసాగింది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రతిమలను టవర్‌సర్కిల్‌, రాంనగర్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన నిమజ్జనోత్సవ వేదికల ద్వారా పూజలు జరిపి మానకొండూర్‌, కొత్తపల్లి, చింతకుంట జలాశయాల్లో నిమజ్జనం చేశారు. ఆయా ప్రాంతాలన్నీ విఘ్నేశ్వర నామస్మరణలతో మారుమోగగా భక్తులు భక్తిపారవశ్యంలో మునిగి తేలారు. నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


టవర్‌సర్కిల్‌ వద్ద మంత్రి పూజలు


టవర్‌సర్కిల్‌ వద్ద మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, ఉత్సవ సమితి బాధ్యులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకరి పండుగలను మరొకరు జరుపుకునే గొప్ప సంప్రదాయం, సంస్కృతి, మన తెలంగాణ సొంతమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో పాడి పంటలతో తులతూగాలని, వినాయకుని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఒకటవ నెంబర్‌ వినాయకుని వద్ద మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, సీపీ సత్యనారాయణ పూజలు నిర్వహించారు. రాజీవ్‌ చౌక్‌ వద్ద జంజం వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో తాగునీరు, గులాబ్‌ వాటర్‌, లస్సీ, బటర్‌ మిల్క్‌, బాదం మిల్క్‌ను అందజేయగా స్టాల్‌ను మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, కమిషనర్‌ సత్యనారాయణ ప్రారంభించారు.  

 

కొత్తపల్లి, చింతకుంటలో...


కరీంనగర్‌ రూరల్‌ : కొత్తపల్లి పట్టణంలోని చెరువు వద్దకు కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో  ప్రతిష్టించిన విగ్రహాలను మధ్యాహ్నం నుంచే వాహనాల్లో తీసుకు వచ్చి నిమజ్జనం చేశారు. కొత్తపల్లి చెరువు వద్దకు నగరంలోని కోర్టు చౌరస్తా, వావిలాలపల్లి, ప్రాంతాల వరకు ఉన్న విగ్రహాలను పెద్ద ఎత్తున మేళ తాళాల మధ్య భక్తుల నృత్యాలు, డప్పు చప్పుళ్లలతో తరలించి నిమజ్జనం చేశారు. చింతకుంట ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్‌లో నగరంలోని పద్మనగర్‌ రాంనగర్‌, మంకమ్మతోట ప్రాంతాల్లో ప్రతిష్టించిన విగ్రహాలను నిమజ్జనం చేశారు. విద్యుత్‌ దీపాలు అలంకరణతో నిమజ్జనం పాయింట్లు భోభాయమానంగా రూపుదిద్దుకున్నాయి. నిమజ్జనం పాయింట్ల వద్ద రక్షణ కంచెలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.  


 నిమజ్జనానికి పకడ్బందీ ఏర్టాట్లు

- జిల్లా కలెక్టర్‌ ఆర్‌ వి కర్ణన్‌

గణనాథుల నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ అన్నారు. శుక్రవారం నిమజ్జనం జరిగే కొత్తపల్లి చెరువుతో పాటు, చింతకుంట ఎస్‌ఆర్‌ఎస్‌పి కెనాల్‌ వద్ద పోలీస్‌ కమిషనర్‌ వి సత్యనారాయణ, అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ లెనిన్‌, డిప్యూటి కమిషర్‌ ఆఫ్‌ పోలీస్‌ శ్రీనిఆస్‌, కొత్తపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ రుద్ర రాజు, మున్సిపల్‌ కమిషర్‌ సేవా ఇస్లావత్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-10T06:57:03+05:30 IST