ఏటా ఇదే కష్టం... భారీగా పంట నష్టం!

ABN , First Publish Date - 2020-10-25T10:35:44+05:30 IST

ఇటీవల కురిసి భారీ వర్షాలకు మండలంలోని రజాల గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలు, గండి పడిన శారదా నది గట్లను జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ శనివారం పరిశీలించారు.

ఏటా ఇదే కష్టం... భారీగా పంట నష్టం!

జిల్లా కలెక్టర్‌ వద్ద రజాల రైతులు గోడు

భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన

అందరికీ నష్ట పరిహారం అందుతుందని వినయ్‌చంద్‌ వెల్లడి

గండిపడిన  నది గట్లు, మదుంల వివరాలు పంపాలని అధికారులకు ఆదేశం  


రాంబిల్లి, అక్టోబరు 24 : ఇటీవల కురిసి భారీ వర్షాలకు మండలంలోని రజాల గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలు, గండి పడిన శారదా నది గట్లను జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ శనివారం పరిశీలించారు. తొలుత ఎన్ని గ్రామాల్లో ఎంత నష్టం జరిగిందన్న అంశంపై అధికారుల ద్వారా ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏటా భారీ వర్షాలకు తమ పంటలు ముంపునకు గురవుతుండడంతో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామని వాపోయారు.


కొప్పుగొండుపాలెం సమీపంలో నేవీ అధికారులు వంతెన ఏర్పాటు చేసి, దాని కింద భాగాన ఇనుప మెష్‌లు ఏర్పాటు చేయడం వల్ల నీరు పారక నది గట్టుకు గండి పడుతున్నట్టు రైతులు కలెక్టర్‌కు వివరించారు. ఈ కారణంగా తమ పంట పొలాలు, పశువుల పాకలు, పూర్తిగా నీటమునుగుతున్నట్టు చెప్పారు.  కొత్తూరు వద్ద నదిపై బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన ఏడుముళ్ల ఆనకట్ట  పూర్తిగా దెబ్బతినడం వల్ల కూడా పంటలకు నష్టం జరుగుతుందన్నారు. ముంపునకు గురైన పశువుల పాకలకు కూడా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 


రైతుల సమస్యలు విన్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ   వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.  నష్ట నమోదు చేపడుతున్నామని, రైతుల వివరాలను ఆయా సచివాలయాల్లో ప్రదర్శిస్తామని చెప్పారు.  అభ్యంతరాలు ఉంటే రైతులు సరిచేసుకోవచ్చని వివరించారు.  పశువుల  పాకలకు కూడా నష్టపరిహారం అందజేస్తామన్నారు. దెబ్బతిన్న నదుల గట్లు, మదుంల వివరాలను తమనకు నివేదించాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. అనంతరం కట్టుబోలు సచివాలయాన్ని సందర్శించారు. అనకాపల్లి ఆర్డీవో కె.సీతారామారావు, జేడీఏ లీలావతి, ఏడీఏ మాణిక్యాంబిక, ఇరిగేషన్‌ డీఈ సుజాత, డీపీఆర్‌వో సాయిబాబా, సమాచారశాఖ ఏడీ మణిరామ్‌, తహసీల్దార్‌ పి.భాగ్యవతి, ఇరిగేషన్‌ జేఈ శివరామకృష్ణ, వ్యవసాయాధికారి ఆర్‌.గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-25T10:35:44+05:30 IST