ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని

ABN , First Publish Date - 2022-01-19T06:06:35+05:30 IST

‘మీ అందరి సమక్షంలో చెబుతున్నా నాకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ప్రాణహాని ఉంది. మీరే రక్షించాలి.’ అంటూ వినుకొండ సబ్‌ జైలు నుంచి మంగళవారం బెయిల్‌పై విడుదలైన ఈపూరు మండలం కొండాయపాలెం గ్రామానికి చెందిన రైతు గడిపూడి నరేంద్ర రెండు చేతులు ఎత్తి దండం పెట్టారు.

ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని
సబ్‌ జైలు వద్ద మాట్లాడుతున్న రైతు గడిపూడి నరేంద్ర

చెప్పుతో దాడికి రాలేదని బొల్లా ప్రమాణం చేయాలి

వినుకొండ సబ్‌ జైలు నుంచి విడుదలైన రైతు నరేంద్ర 

వినుకొండ, జనవరి 18: ‘మీ అందరి సమక్షంలో చెబుతున్నా నాకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ప్రాణహాని ఉంది. మీరే రక్షించాలి.’ అంటూ వినుకొండ సబ్‌ జైలు నుంచి మంగళవారం బెయిల్‌పై విడుదలైన ఈపూరు మండలం కొండాయపాలెం గ్రామానికి చెందిన రైతు గడిపూడి నరేంద్ర రెండు చేతులు ఎత్తి దండం పెట్టారు. ఈ నెల 7న శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి వచ్చిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును గిట్టుబాటు ధరపై నరేంద్ర ప్రశ్నించగా స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహంతో చెప్పుతీయడం.. ఆ తర్వాత పీఏతో కేసు పెట్టించి రైతును హత్యానేరం కింద జైల్లో పెట్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో జైల్లో ఉన్న నరేంద్ర మంగళవారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులతో కలిసి జైలు వద్ద నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ చెప్పు తీసుకుని కొట్టేందుకు ఎమ్మెల్యే తనపైకి రాలేదంటే ఆయన పిల్లలతో కలిసి వినుకొండ కొండపైకి వచ్చి దేవుడి వద్ద ప్రమాణం చేయాలన్నారు. చెప్పుతో కొట్టేందుకు రాలేదని ఆయన ప్రమాణం చేస్తే పిల్లలతో కలిసి పురుగుమందు తాగి చచ్చిపోతానని లేదంటే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అని నరేంద్ర సవాల్‌ చేశారు.  వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్నా, ఆయన కుటుంబమన్నా, జగన్‌మోహన్‌రెడ్డి అన్నా తనకు అమితమైన ప్రేమ అని తెలిపారు. సోదరులు అందరూ టీడీపీలో ఉన్నా తాను ఇడుపులపాయలో ఉన్న రాజశేఖరరెడ్డి సమాధి వద్ద దణ్ణం పెట్టుకుని జగన్‌మోహన్‌రెడ్డి చేత పార్టీ కండువా వేయించుకుని  వైసీపీలో చేరి పనిచేశానన్నారు. జగన్‌ కోసం, బొల్లా కోసం పని చేశానని నరేంద్ర తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి రైతు చైతన్యం కోసం కృషి చేస్తుంటే ఈ ఎమ్మెల్యే  సీఎంను తిట్టానని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై సుబ్రహ్మణ్యస్వామి దగ్గరకు వెళ్లి ప్రమాణం చేయడానికైనా తాను సిద్ధమన్నారు. ఎమ్మెల్యే కేసు పెట్టించిన పీఏ ఆంజనేయులకు నా మొహమే తెలియదన్నారు. పీఏ మొహం కూడా తనకు తెలియదని  దీనికి ప్రత్యక్ష సాక్షం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. ఏనాడైనా టీడీపీ వారికి సాయం చేశానని నిరూపిస్తే ప్రాణాన్ని ఫణంగా పెడతానన్నారు. ఎంతో చరిత్ర కలిగిన పల్నాటి వీరుడు బ్రహ్మనాయుడు పేరు పెట్టుకుని పల్నాటి ప్రజల విలువలను ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీసివేస్తున్నారని విమర్శించారు.  జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఎమ్మెల్యేపై నరేంద్ర చేసిన వ్యాఖ్యలు పట్టణంలో కలకలం రేపాయి. ఈ సందర్భంగా నరేంద్రకు రైతులు, రైతు సంఘం నాయకులు, బంధువులు కలిసి సంఘీభావం తెలిపారు.


Updated Date - 2022-01-19T06:06:35+05:30 IST