నిబంధనల ఉల్లంఘన... విధుల్లో అలక్ష్యం...

ABN , First Publish Date - 2021-05-25T05:18:10+05:30 IST

కాగ్‌ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల తీరుతెన్నులు ఎలా వున్నాయన్నది వెల్లడైంది.

నిబంధనల ఉల్లంఘన... విధుల్లో అలక్ష్యం...

ప్రభుత్వాదాయానికి గండి... ప్రజాధనం దుర్వినియోగం

నిధులున్నా సద్వినియోగం చేసుకోని వైనం

జిల్లాలో ప్రభుత్వ శాఖల తీరుతెన్నులు

కాగ్‌ తాజా నివేదికలో వెల్లడి


(ఆంధ్రజ్యోతి,తిరుపతి)

 సకాలంలో లెక్కలు చూపకపోవడం... ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడం.. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడం... అందుబాటులో వున్న నిధులను సద్వినియోగం చేసుకోక మురగబెట్టడం... విధుల నిర్వహణలో అలక్ష్యం... ఇలా ఒకటా రెండా? జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అడుగడుగునా వెలుగు చూసిన నిబంధనల ఉల్లంఘనలెన్నో!.. సంక్షిప్తంగా కాగ్‌ అని పిలువబడే కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ 2014-15 నుంచీ 2018-19 నడుమ ఐదేళ్ళ పాటు జరిపిన ఆడిట్‌ నివేదికను ఇటీవలే పార్లమెంటుకు సమర్పించింది. ఈ నివేదిక ద్వారా ప్రభుత్వ శాఖల తీరుతెన్నులు ఎలా వున్నాయన్నది వెల్లడైంది. 


మద్యం బార్లకు అదనపు ఫీజు విధించక నష్టం

మద్యం బార్ల నిర్వహణకు సంబంధించి వాటి ఆవరణ 300 చదరపు మీటర్లకు మించి వుండరాదు. అలా మించినట్టయితే దుకాణదారుకు అదనపు లైసెన్సు ఫీజు విధించాల్సి వుంది. ఈ నిబంధన అమల్లో వున్న 2016 జనవరి-జూలై నెలల నడుమ కాగ్‌ తిరుపతి ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో బార్‌ లైసెన్సు ఫైళ్ళను పరిశీలించిన సందర్భంలో మచ్చుకు నాలుగు ఈ తరహా కేసులు వెలుగు చూశాయి. ఈ నాలుగు కేసుల్లోనూ బార్ల ఆవరణ 300 చదరపు మీటర్లకు మించి వున్నా కూడా ఎక్సైజ్‌ అధికారులు నిబంధనల మేరకు వాటికి అదనపు లైసెన్సు ఫీజు విధించలేదు. దీనివల్ల రాష్ట్రప్రభుత్వానికి రూ. 90.88 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. కాగ్‌ పరిశీలనలో తిరుపతి ఈఎస్‌ కార్యాలయంలో వీటిని గుర్తించగా చిత్తూరు ఈఎస్‌ కార్యాలయంలో కూడా ఈ తరహా ఘటనలు జరిగివుండే అవకాశాలు లేకపోలేదు. మొత్తంగా ప్రభుత్వాదానికి భారీగా గండిపడగా దీనిపై కాగ్‌ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు ఎక్సైజ్‌ శాఖ అధికారుల నుంచీ ఎలాంటి సమాధానం అందకపోవడం కొసమెరుపు.


ఆఫీసు వదలని చిత్తూరు ఎక్సైజ్‌ డీసీ

ఏ శాఖలోనైనా ఉన్నతాధికారులు జరిపే తనిఖీలపైనే ఆయా శాఖల అంతర్గత నియంత్రణ ఆధారపడివుంటుంది. అందుకే ఉన్నతాధికారులు తమ శాఖల్లో కిందిస్థాయి కార్యాలయాలను, ఇతరత్రా స్థలాలను నిర్ణీత వ్యవధిలో తనిఖీ చేయడం తప్పనిసరి విధుల్లో మొదటిది. ఎక్సైజ్‌ శాఖలో కూడా డిప్యూటీ కమిషనర్లు  తమ పరిధిలో ఏడాదిలో కనీసం ఒకసారైనా ఈఎస్‌ కార్యాలయాలు, సబ్‌ డివిజన్‌ కార్యాలయాలు, ఎక్సైజ్‌ స్టేషన్లు, చెక్‌పోస్టులు, ఐఎంఎల్‌ డిపోలు, ప్రాంతీయ అబ్కారీ పరిశోధనా శాలలు, మద్యం శుద్ధి కేంద్రాలు మొదలైన వాటిని తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపాలి.అయితే జిల్లాకంతటికీ పర్యవేక్షకాధికారైన చిత్తూరు డిప్యూటీ కమిషనర్‌ 2014-15 నుంచీ 2017 డిసెంబరు వరకూ జిల్లాలో తనిఖీలే చేయలేదని కాగ్‌ పరిశీలనలో వెల్లడైంది. అంటే సుమారు మూడున్నరేళ్ళ పాటు డిప్యూటీ కమిషనర్‌ తన కార్యాలయం విడిచి బయట అడుగుపెట్టలేదని కాగ్‌ నివేదిక వెల్లడిస్తోంది. దీన్నిబట్టి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరైన ఎక్సైజ్‌ శాఖలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ, తనిఖీలు వంటివి జిల్లాలో ఏ స్థాయిలో జరుగుతున్నాయో తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.


తొలి ఏడాది పద్దులే సమర్పించని స్మార్ట్‌ సిటీ

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టులను పీఎస్‌యూల కిందే పరిగణిస్తున్నారు. ఆ మేరకు తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కూడా ఓ ప్రభుత్వ రంగ సంస్థే. ఏటా వీటి వార్షిక పద్దులను కాగ్‌కు సమర్పించాల్సి వుంటుంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధుల వినియోగం ఏ తీరుగా వుందో, ఏవైనా లోటుపాట్లు, దుర్వినియోగాలు, నిధులు మురగబెట్టడం వంటివి జరుగుతున్నాయా అనేది ప్రభుత్వాలకు కూడా తెలుస్తుంది. అయితే తిరుపతిని కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ సిటీగా ప్రకటించడంతో 2016-17లో తిరుపతి స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటైంది. అయితే తొలి ఆర్థిక సంవత్సరానికి పద్దులను కూడా సమర్పించలేదని కాగ్‌ తన నివేదకలో అసంతృప్తి వ్యక్తం చేసింది.


నిధులున్నా వినియోగించని డీఎస్‌ఏ

అభివృద్ధి పనులకు పలు ప్రభుత్వ శాఖలు నిధులు లేక సతమమతవుతుంటాయి. ఇక ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి నెల వచ్చేసరికి దానికంటే ఎంతో ముందుగానే వున్న నిధులను ఖర్చు పెట్టేందుకు తాపత్రయపడుతుంటాయి. అయితే జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ (జిల్లా క్రీడా సాధికార సంస్థ) మాత్రం భిన్నమైన పంథా ఎంచుకుంది. అందుబాటులో నిధులున్నా వాటిని క్రీడాభివృద్ధికి వినియోగించకుండా నిధులను మురగబెట్టుకుంటోంది. కాగ్‌ 2019 మార్చిలో పరిశీలన జరిపేటప్పటికి డీఎస్‌ఏ వద్ద రూ. 1.52 కోట్ల శాప్‌ నిధులు వినియోగించకుండా నిరుపయోగంగా వున్నట్టు గుర్తించింది. దీనిపై కాగ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది.


అర్హత లేని క్రీడాకారులకు నిధుల చెల్లింపు

ప్రభుత్వంలో ఏ శాఖ అయినా సరే విలువైన ప్రజాధనాన్ని వినియోగించే క్రమంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సి వుంటుంది. ప్రతి రూపాయినీ అర్హత కలిగిన వారికోసమే ఖర్చు పెట్టాల్సి వుంటుంది. అయితే శాప్‌ (స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌) మాత్రం అర్హత లేని క్రీడాకారులకు రూ. 65 లక్షల వరకూ చెల్లింపులు జరిపింది. ఆ క్రీడాకారులిద్దరూ జిల్లాకు సంబంధించిన వారు కావడం గమనార్హం. కాగ్‌ పరిశీలనలో ఈ అంశం వెలుగు చూసింది. కాగ్‌ నివేదిక మేరకు 2016-17లో హకీ క్రీడాకారిణి ఇ.రజని హాకీ విభాగంలో బ్రెజిల్‌లో జరిగిన రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఆమెకు రూ. 25 లక్షలు చెల్లించారు. అలాగే 2017-18లో జి.రాధిక పర్వతారోహణ విభాగంలో ఉత్తర అమెరికా అలస్కాలోని డెనాలి పర్వతారోహణకు గానూ రూ. 8.50 లక్షలు, రూ. 31.50 లక్షలు చొప్పున రెండు విడతల్లో మొత్తం రూ. 40 లక్షలు ఆర్థిక సాయం కింద చెల్లించారు. 2016-18 నడుమ రెండేళ్ళలో 9 మంది అర్హత లేని వారికి రూ. 1.85 కోట్లు శాప్‌ నిధులు ఇవ్వగా అందులో ఇద్దరు ఈ జిల్లా నుంచే నిధులు పొందారు. ఈ ఇద్దరు పొందిన మొత్తం రూ. 65 లక్షలు. వీరిలో రజని ఎర్రావారిపాలెం మండలానికి చెందిన క్రీడాకారిణి కాగా రాధిక గతంలో చిత్తూరు అదనపు ఎస్పీగా పనిచేశారు.


ఎస్పీడీసీఎల్‌కు భారీగా నష్టాలు

తిరుపతి కేంద్రంగా నడుస్తున్న ఎస్పీడీసీఎల్‌కు భారీగా నష్టాలు సంభవించినట్టు కాగ్‌ పరిశీలనలో వెల్లడైంది. 2018-19లో తిరుపతి డిస్కమ్‌కు ఏకంగా రూ. 7680.87 కోట్ల నష్టం వాటిల్లింది. విద్యుత్‌ కొనుగోలు రేటు పెరగడమే ప్రధాన కారణమని తేలింది. ఆ ఏడాది రాష్ట్రంలోని ఆరు విద్యుత్‌ సంబంధ సంస్థలన్నింటికీ కలిపి రూ. 12911.56 కోట్ల నష్టం రాగా అందులో సగానికంటే ఎక్కువగా నష్టం ఎస్పీడీసీఎల్‌దే.

Updated Date - 2021-05-25T05:18:10+05:30 IST