పోలింగ్‌ రక్తసిక్తం

ABN , First Publish Date - 2021-04-11T06:40:59+05:30 IST

హింసతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్‌ రణాంగణం శనివారం రక్తసిక్తమయ్యింది. నాలుగోదశ పోలింగ్‌ సందర్భంగా కూచ్‌బెహార్‌లోని శీతల్‌కుచి నియోజకవర్గంలో చెలరేగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించారు

పోలింగ్‌ రక్తసిక్తం

బెంగాల్‌ 4వ దశ ఎన్నికలో హింస

ఓటేయడానికి వచ్చిన యువకుడి కాల్చివేత

కేంద్రం వద్దే గుర్తు తెలియని వ్యక్తుల దుశ్చర్య

బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తల ఘర్షణ, దాడులు

కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురి మృతి

150 మంది మాపై దాడి చేశారు: సీఐఎస్‌ఎఫ్‌

మరో దారిలేకే కాల్పులు జరిపాయి: ఈసీ

భయపడ్డదంతా నిజమైంది.. సీఐడీ దర్యాప్తు 

అమిత్‌ షా రాజీనామా చేయాలి: మమత

తప్పు మమతదే.. రెచ్చగొట్టింది ఆమే: మోదీ

నాలుగో దశలో 76 శాతం పోలింగ్‌


హింసతో అట్టుడికినా నాలుగోదశలో 76.16 శాతం ఓటింగ్‌ నమోదైంది. ముఖ్యంగా  కాల్పులతో దద్దరిల్లిన కూచ్‌బెహార్‌ జిల్లాలో సుమారు 80 శాతం పోలింగ్‌ జరగడం విశేషం. హుగ్లీ, దక్షిణ 24 పరగణాల్లో 76% పోలింగ్‌ జరిగింది.


మరో 71 కంపెనీల కేంద్ర బలగాలు

కూచ్‌బెహార్‌ కాల్పుల ఘటనతో బెంగాల్‌కు మరో 71 కంపెనీల పారామిలటరీ బలగాలను బెంగాల్‌కు తరలిస్తున్నారు. మిగిలిన నాలుగుదశల్లోనైనా హింస రేగకుండా హుటాహుటిన వీటిని పంపుతున్నట్లు ఈసీ ప్రకటించింది. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీల నుంచి సాయుధ బలగాలను పంపాలని కోరగా హోంశాఖ అంగీకరించింది. దీంతో ఇప్పటిదాకా 1000 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను బెంగాల్లోని 294 నియోజకవర్గాల్లో బందోబస్తుకు దింపినట్టయింది. నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఎన్నడూ బలగాలను పంపిన దాఖలాల్లేవని హోంశాఖ అధికారి ఒకరు చెప్పారు.


కూచ్‌బెహార్‌, ఏప్రిల్‌ 10: హింసతో అట్టుడుకుతున్న పశ్చిమ బెంగాల్‌ రణాంగణం శనివారం రక్తసిక్తమయ్యింది. నాలుగోదశ పోలింగ్‌ సందర్భంగా కూచ్‌బెహార్‌లోని శీతల్‌కుచి నియోజకవర్గంలో చెలరేగిన ఘర్షణల్లో ఐదుగురు మరణించారు. వీరిలో ఒకరు హత్యకు గురికాగా, కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలొదిలారు. ఉదయం 8 గంటల వేళ మొదటిసారిగా ఓటేయడానికి పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన 18-ఏళ్ల కుర్రాడు ఆనంద్‌ బర్మన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఆ వ్యక్తి తమ మద్దతుదారుడని, టీఎంసీ చంపేసిందని బీజేపీ ప్రకటించగా, బీజేపీ కార్యకర్తలు జరిపిన దాడుల్లోనే అతడు మరణించాడని తృణమూల్‌ ప్రత్యారోపణ చేసింది. ఈ ఘటన జరిగిన ఓ గంటన్నరకు సమీపంలోనే మథభంగా పోలింగ్‌ కేంద్రం వద్ద బీజేపీ- తృణమూల్‌ కార్యకర్తలు తీవ్రంగా ఘర్షణ పడ్డారు. దేశవాళీ బాంబులు విసురుకోవడమేకాక, బరిసెలతో దాడులకు దిగారు. ఈ అల్లరిమూకను చెదరగొట్టేందుకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి (సీఐఎ్‌సఎ్‌ఫ)కు చెందిన బలగాలు కాల్పులు జరిపాయి. అందులో నలుగురు మరణించారు. వారంతా తమ పార్టీ మద్దతుదారులని, కేంద్ర బలగాలు అన్యాయంగా చంపేశాయని తృణమూల్‌ స్థానిక నేతలు ఆరోపించారు. కానీ సీఐఎ్‌సఎఫ్‌ దీనిని ఖండిస్తూ ఓ సుదీర్ఘమైన ప్రకటన చేసింది. ‘‘ఓటర్లను పోలింగ్‌ కేంద్రంలోకి రానివ్వకుండా కొందరు స్థానికులు అడ్డుపడుతున్నారు. ఉదయం 9-35 గంటల వేళ కోయ్‌ కమాండర్‌ ఈ సునీల్‌ కుమార్‌ నేతృత్వంలోని క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ (క్యూఆర్‌టీ) పోలీసులను వెంటబెట్టుకుని ఆ స్థానికులను బూత్‌ నెంబర్‌ 126 నుంచి పంపే యత్నం చేసింది. అయితే సుమారు 60 మంది దాకా ఉన్న వారంతా వినకుండా దురుసుగా ప్రవర్తించారు.


ఓ బాలుడు నేలమీద పడ్డాడు, సీఐఎ్‌సఎఫ్‌ వాహనాలను వారు ధ్వంసం చేయడమే కాక బలగాలపై దాడి మొదలెట్టారు. వెంటనే గాల్లోకి ఆరురౌండ్ల కాల్పులు జరిపాం. ఓ గంట తరువాత ఏకంగా 150 మందితో కూడిన అల్లరిమూక స్థానికులతో చేరి బూత్‌ నెంబర్‌ 186లో పోలింగ్‌ సిబ్బందిని, హోంగార్డును, ఆశా వర్కర్‌ను కొట్టనారంభించింది. క్యూఆర్‌టీ బలగాన్ని, ఇతర సిబ్బందిని కొట్టడం, రైఫిల్స్‌ను, ఆయుధాలను లాక్కోడానికి వారు యత్నించడంతో మొదట రెండు రౌండ్ల కాల్పులు జరిపాం. అయినా ఖాతరు చేయకుండా అల్లరిమూక సీఐఎ్‌సఎఫ్‌ బలగాలవైపు దూసుకురావడంతో వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది’’ అని అందులో పేర్కొంది. తమ సిబ్బందిలోనూ కొందరు చావుబతుకుల్లో ఉన్నారని వివరించింది. 


స్థానికుల అపార్థం: ఈసీ

ఈసీ మరో వివరణ ఇచ్చింది. పోలింగ్‌ కేంద్ర సమీపంలో ఓ బాలుడు అనారోగ్యంగా ఉన్నాడని, ఓ ముగ్గురు మహిళలు ఆ బాలుడికి సపర్యలు చేస్తున్నారని, కేంద్ర బలగాల దాడిలో ఆ బాలుడు చనిపోయాడంటూ స్థానికులు అపార్థం చేసుకుని దాడులకు దిగారని పేర్కొంది. బాలుణ్ని పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు కూడా సీఐఎ్‌సఎఫ్‌ బలగాలు ప్రయత్నించాయని వివరించింది. సీఐఎ్‌సఎఫ్‌ ప్రకటనలో ‘ఓ బాలుడు నేలమీద పడ్డాడు’ అని మాత్రమే ప్రస్తావించింది తప్ప అనారోగ్యం విషయం గానీ పేర్కొనకపోవడం గమనార్హం ‘‘సమీప గ్రామాల నుంచి దాదాపు 350 మంది ప్రజల్ని స్థానికులు పోగేశారు. వీరిలో కొందరు మహిళలూ ఉన్నారు. వీరు ఆయుధాలతో దాడులకు దిగారు. సీఐఎ్‌సఎఫ్‌ బలగాలపైనా స్థానిక మూకలు దాడి చేశాయి’’ అని ఈసీ పేర్కొంది. ‘తమను తాము కాపాడుకునేందుకు, ప్రభుత్వ ఆస్తి అయిన ఈవీఎంలను, ఇతర పోలింగ్‌ సామగ్రిని, వాహనాలను రక్షించేందుకు సీఐఎ్‌సఎఫ్‌ బలగాలు కాల్పులు జరిపాయి. బులెట్‌ దెబ్బలు తగిలిన నలుగురు ఆసుపత్రిలో మరణించారు’’ అని ఈసీ విశదీకరించింది.  ఈ ఘటనతో ఆ కేంద్రం వద్ద పోలింగ్‌ను ఈసీ సస్పెండ్‌ చేసింది. 


సీఐడీ దర్యాప్తునకు ఆదేశం

పోలింగ్‌ రక్తసిక్తం కావడంతో రాజకీయ యుద్ధం మొదలైంది. తాము భయపడ్డదంతా నిజమైందని తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. ‘‘నేను మొదట్నుంచీ అంటున్నదే నిజమయ్యింది. కేంద్రబలగాలు బీజేపీకి పనిచేస్తూ మా కార్యకర్తలను పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఆత్మరక్షణ వాదన ఎక్కణ్ణుంచి వచ్చింది? సాక్ష్యమేంటి? ఫుటేజీ ఉందా? సీఐఎ్‌సఎఫ్‌ గాయపడ్డ జవాన్ల వివరాలేవీ? ఇదంతో కట్టుకథ. నిజానిజాలను తేల్చేందుకు సీఐడీ దర్యాప్తుకు ఆదేశిస్తున్నా’’ అని మమత ప్రకటించారు. ‘‘ శాంతి భద్రతల పరిరక్షణను తన చేతుల్లోకి తీసుకున్న ఈసీ దీనిపై బదులివ్వాలి. క్యూలో ఉన్న ఓటర్లపై కాల్పులా? దీనికి నైతిక బాధ్యత వహించి హోం మంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. కాగా, కూచ్‌బెహార్‌ కాల్పులపై ప్రధాని మోదీ కూడా వెంటనే రంగంలోకి దిగారు. ఈ ఘటనకు మమతా బెనర్జీదే పూర్తి బాధ్యత అని సూటిగా ఆరోపించారు. ‘‘చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఇది జరగడం దురదృష్టకరం. దీనికి మమతే బాధ్యత వహించాలి. ఆమె పార్టీ గూండాలు హింసకు దిగారు. కేంద్ర బలగాలపై దాడులకు మమతే రెచ్చగొట్టారు. పదవి కోల్పోతానన్న ఆందోళనతో ఆమె ఇంతగా దిగజారారు’’ అని ఆయన సిలిగురి సభలో నిప్పులు చెరిగారు. 


ర్యాలీల్ని నిషేధిస్తాం జాగ్రత్త: ఈసీ 

కాగా- కొవిడ్‌ నిబంధనలను పాటించకపోతే ఎన్నికల ప్రచార సభలను నిషేధిస్తామని ఈసీ తాజాగా హెచ్చరించింది. ‘‘దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. మరణాలూ చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల సభల్లో కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించట్లేదు. ముఖ్యంగా స్టార్‌ క్యాంపెయినర్ల సభలో వీటిని గాలికి వదిలేశారు. మాస్కులు పెట్టుకోవడం లేదు. సామాజిక దూరం పాటించడం లేదు. ఇలా అయితే ర్యాలీలను నిషేధించడానికి కూడా వెనకాడం’’ అని ఈసీ వివిధ పార్టీలకు రాసిన లేఖలో వార్నింగిచ్చింది. కాగా, కూచ్‌బెహార్‌ జిల్లాలో వచ్చే మూడు రోజుల పాటు ఏ రాజకీయ నాయకుడూ రాకుండా ఈసీ ఆంక్షలను విధించింది. 


నేను కోడ్‌ దాటలేదు: ఈసీకి మమత వివరణ

కేంద్ర బలగాలపై తాను చేసిన వ్యాఖ్యలను మమత సమర్థించుకున్నారు. తాను ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను ఉల్లంఘించలేదని ఈసీకి పంపిన వివరణలో పేర్కొన్నారు. ‘‘కేంద్ర బలగాలంటే నాకు చాలా గౌరవం. అయితే ఆ దళాల్లో కొన్ని ఓ పార్టీకి ఓటువేయాలని ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు మాకు తెలిసింది. అంతేకాక ఏప్రిల్‌ 6న తారకేశ్వర్‌ ఠాణా పరిధిలోని రామ్‌నగర్‌ ఏరియాలో ఓ అమ్మాయిని సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు రేప్‌ చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. ఆ పోలీస్‌ స్టేషన్లో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదుచేశారు’’ అని ఆమె వివరించారు.

Updated Date - 2021-04-11T06:40:59+05:30 IST