Abn logo
Nov 17 2020 @ 00:13AM

హింసా న్యాయం

నూరు అనుమానాలుండవచ్చు, కానీ అవేవీ ఒక్క రుజువుతో సమానం కావు– అంటాడు డాస్టోయెస్కీ. నిరూపణ జరిగేవరకు నిందితుడు నిర్దోషే అంటుంది న్యాయశాస్త్రం. కానీ, ఆధారంతో సహా నిరూపించే సమర్థత కానీ, సహనం కానీ లేకపోతే, అధికారం ఏమి చేస్తుంది? అనుమానాన్నే పెనుభూతంగా మార్చి సాక్ష్యం చెప్పిస్తుంది. ఆలోచనలను కట్టిపెట్టి లాఠీలకు మాత్రమే పనిచెప్పడం అలవాటైనప్పుడు, నిరుపేద, చిరుద్యోగి, కష్టజీవి, అభాగ్యుడు– నేరస్థులుగా కనిపించడం సహజం. విస్తృత ప్రజానీకానికి అంతటికీ శాంతీ, భద్రతా ఇవ్వవలసిన రక్షకభటులు కలిగినవారి కాసులను కాపాడడమే తమ పరమధర్మమని భావిస్తే ఇక దక్కే న్యాయం ఏమిటి? 


ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో రెండు వారాల కిందట భార్యా భర్తా ఇద్దరు పిల్లలు కట్టగట్టుకుని రైలుపట్టాల మీద తలలు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. పోలీసుల వేధింపులే తమను ఈ స్థితికి ప్రేరేపించాయని విడియో రూపంలో చెప్పి మరీ వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరణవాంగ్మూలం ఎంతో బలమైనది అంటారు. అందులో చేసిన ఆరోపణలు తిరుగులేనివంటారు. కానీ, నిందితులుగా భావిస్తున్నవారు అవలీలగా బెయిలు పొందారు. న్యాయం చేయాలని ప్రతిపక్షం అడుగుతోంది, న్యాయం చేస్తామని అధికారపక్షం చెబుతోంది. కానీ, న్యాయం జరుగుతోంది అన్న నమ్మకం కలిగించే చర్యలేవీ కనిపించడం లేదు. 


నలభై రెండేళ్ల అబ్దుల్‌ సలాం, అతని భార్య నూర్జహాన్‌, పద్నాలుగు, పదేళ్ల వయస్సున్న వారి ఇద్దరు పిల్లలు నవంబర్‌ 3వ తేదీ రాత్రి గుడ్స్‌ రైలు కింద పడి మరణించారు. ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు రోజుల తరువాత 7వ తేదీ శనివారం నాడు, సలాం రికార్డు చేసిన విడియో వాంగ్మూలం బయటపడింది. అంతకు ముందు కేవలం అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు, ఆ తరువాత సలాం దగ్గరి బంధువులను విచారించి, నంద్యాల వన్‌టౌన్‌ సి.ఐ. సోమశేఖరరెడ్డిని ముద్దాయిగా చేర్చారు. నంద్యాల పోలీసు స్టేషన్‌లో 8వ తేదీన నమోదుచేసిన కేసులో కానిస్టేబుల్‌ గంగాధర్‌ను కూడా ముద్దాయిగా చేర్చారు. పోలీసు ఉద్యోగులు ఇద్దరిని అరెస్టుచేశారు. మరుసటి రోజే నిందితులైన పోలీసులకు బెయిల్‌ లభించింది. అబ్దుల్‌ సలాం సెల్ఫీ విడియో మాత్రం కేసు రికాడ్స్‌లో ఎక్కడా పేర్కొనలేదని బంధువులు ఆరోపిస్తున్నారు. 


కొంతకాలంగా సలాం ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నవంబర్‌ 2వ తేదీన అతను నడుపుతున్న ఆటోలో 70 వేల రూపాయలు పోయాయని ఒక ప్రయాణీకుడు ఫిర్యాదు చేశాడు. అంతకు ముందు సలాం ఒక బంగారం దుకాణంలో ఉద్యోగిగా పనిచేసేవాడు. కొంతకాలం కిందట ఆ దుకాణంలో జరిగిన చోరీలో కూడా సలాం నిందితుడుగా ఉన్నాడు. తాను దొంగతనం చేయలేదని చెబుతున్నా, పోలీసులు చిత్రహింసలు పెట్టి,అతని మీద కేసు పెట్టారని సలాం బంధువులు చెబుతున్నారు. ఇప్పుడు ఆటోలో చోరీ విషయంలో పోలీసులు పిలిపించినప్పుడు, తిరిగి హింసలు పెడతారేమోనని సలాం భార్య, అత్తగారితో కలిసి స్టేషన్‌కు వెళ్లాడట. అక్కడ పోలీసులు సలాంపై దౌర్జన్యం చేయడమే కాకుండా, కుటుంబసభ్యుల ఎదుట అవమానకరంగా దుర్భాషలాడారట. సలాం భార్యతో అభ్యంతరకరంగా వ్యవహరించారట. ఇదంతా అవమానంగా భావించి సలాం, తన కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్టు కనిపిస్తున్నది. రెండు కేసులలోను దొంగతనంతో తనకు సంబంధం లేదని సలాం విడియోలో చెప్పాడు. బంగారం రికవరీ విషయంలో పోలీసులు అనుసరించే పద్ధతులు తెలిసినవే. ఒకసారి వారి జాబితాలోకి నిందితుడిగా చేరినవారు ఆ తరువాత కూడా అలుసైపోతారు కాబట్టి, ఆటో డబ్బు విషయంలో కూడా దర్యాప్తునకు కాక, దండానికే పనిచెప్పారు. పేదప్రజలకు మానాభిమానాలు ఉండవని అనుకుంటారేమో తెలియదు, కానీ, తరచు వారి నోరు, చేయి కూడా హద్దుమీరుతాయి. 


సలాం మీద అభియోగం ఉన్నది. అట్లాగే, సిఐ, కానిస్టేబుళ్ల మీద అభియోగాలున్నాయి. ఏ కేసు విషయంలో ప్రభుత్వ స్పందన ఎట్లా ఉన్నదో చూడండి. బెయిల్‌ రద్దుకోసం పైకోర్టుకు వెళ్లామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, నాలుగు నిండు ప్రాణాల విషయంలో ఉండవలసిన స్పందన ఇదేనా? ఎప్పుడూ పోలీసుల నైతిక స్థైర్యాన్ని కాపాడడం గురించే చెబుతారు కానీ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం గురించి ఎవరూ మాట్లాడరు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో కూడా మోటు పద్ధతులు తప్ప మరో దర్యాప్తు తెలియకపోవడం ఆశ్చర్యకరం. 


ఈ దురుసుతనం, దౌర్జన్యం ఊరికే రావు. పాలకులు ఎట్లా ఉంటే పోలీసుల ధోరణీ అట్లాగే ఉంటుంది. ప్రజల సహకారంతో అధికారంలోకి వచ్చిన ఏలికలు, ఆ తరువాత పోలీసుల సహకారంతో అధికారం నిలుపుకోవాలని చూస్తారు. వారి సాయం అవసరం కాబట్టి, పోలీసులు ఏమి చేసినా చూసీచూడనట్టు ఉంటారు. అది విశృంఖలతకు, అధికార దుర్వినియోగానికి, అవినీతికి దారితీస్తుంది. డాక్టర్‌ సుధాకర్‌ను నడివీధిలో ఈడ్చుకుంటూ వెళ్లడం, పోలీసుస్టేషన్‌లో శిరోముండనం చేయించడం, లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించాడని కస్టడీలో కొట్టి చంపడం ఇవన్నీ ఏపీ పోలీసుల ఘనతలే. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భూతగాదా విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన ఒక దళితుడిని పోలీసు ఇన్‌స్పెక్టర్‌ బూటుకాలితో తన్ని తరిమాడు. విజయవాడ సమీపంలో పరిటాల గ్రామంలో సోషల్‌ మీడియాలో ఒక పోస్టు పెట్టినందుకుగాను మున్నంగి రాజశేఖరరెడ్డి అనే యువకుడిని పోలీసులు హింసిస్తే, అతను కృష్ణానదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. 


ఘరానా ఘరానా పద్ధతుల్లో వేల కోట్ల సొమ్ము సొంతదారికి మళ్లించుకుని, అవినీతిలో సరికొత్త ఆవిష్కరణలు చేసినవారు అధికారంలో ఓలలాడుతుంటే, మరోవైపు చిన్న చిన్న దొంగతనాల పేరుతో పేదలు మాత్రం ప్రాణాలు కోల్పోవడం ఈ వ్యవస్థలోని విషాదకర వైచిత్రి!