అట్టుడుకుతున్న అమెరికా.. ప్లీజ్ అని వేడుకున్నా ఓ నల్లజాతీయుడిని పోలీస్ చంపడంతో..

ABN , First Publish Date - 2020-05-29T14:46:38+05:30 IST

‘ప్లీజ్.. నాకు ఊపిరి ఆడటం లేదు..’.. అంటూ ఆ నల్లజాతీయుడు విలవిలలాడిపోవడాన్ని చూసి అమెరికా ప్రజానీకం తట్టుకోలేకపోయింది.. ప్రాణాలు పోతున్నాయన్నా కనికరించని శ్వేతజాతీయుడైన పోలీసులపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈ ఘటనకు కారణమైన నలుగురు పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించినా.. వారిని అరెస్ట్ చేసి ఉరి శిక్ష విధించాల్సిందేనంటూ

అట్టుడుకుతున్న అమెరికా.. ప్లీజ్ అని వేడుకున్నా ఓ నల్లజాతీయుడిని పోలీస్ చంపడంతో..

వాషింగ్టన్: ‘ప్లీజ్.. నాకు ఊపిరి ఆడటం లేదు..’.. అంటూ ఆ నల్లజాతీయుడు విలవిలలాడిపోవడాన్ని చూసి అమెరికా ప్రజానీకం తట్టుకోలేకపోయింది.. ప్రాణాలు పోతున్నాయన్నా కనికరించని శ్వేతజాతీయుడైన పోలీసులపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈ ఘటనకు కారణమైన నలుగురు పోలీసు అధికారులను విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించినా.. వారిని అరెస్ట్ చేసి ఉరి శిక్ష విధించాల్సిందేనంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగిన మిన్నియాపోలిస్ నగరం నిరసనలతో అట్టుడుకిపోయింది.. వాహనాలు, భవనాలను ధ్వంసం చేశారు.. మంటలంటించారు.. ఆ నలుగురిని అరెస్ట్ చేసే వరకు తమ నిరసనలు ఆగబోవంటూ ఆందోళనకారులు తేల్చిచెబుతున్నారు.. 


మిన్నియాపోలిస్ నగరానికి చెందిన జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని ఫోర్జరీ కేసులో నలుగురు పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని రోడ్డుపై ప‌డుకోబెట్టి అత‌ని మెడ‌పై డెరెక్ చావిన్ అనే పోలీస్ అధికారి మోకాలు పెట్టి ఉంచారు. ‘నాకు ఊపిరి ఆడటం లేదు.. ప్లీజ్..’ అని నిందితుడు మొత్తుకున్నప్పటికి పోలీసు అధికారి మాత్రం వినలేదు. ఐదు నిమిషాల పాటు మెడపై మోకాలు అలాగే పెట్టి ఉంచడంతో జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు ఈ వీడియోను రికార్డ్ చేయడం.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది.. ఈ వీడియో చూసిన మిన్నెపొలిస్ మేయర్ జాకొబ్ ఫ్రే... నల్ల జాతీయుడి మృతికి కారణమైన నలుగురు పోలీసు అధికారులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. డెరెక్ ఛౌవిన్, థామస్ లేన్, టౌ థౌ, జే అలెగ్జాండర్ క్యూంగ్ అనే పోలీస్ అధికారులు ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా తేల్చారు. 


అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు.. వారిని అరెస్ట్ చేసి.. ఉరి శిక్ష విధించాల్సిందేనంటూ పట్టుబట్టారు.. కొంత మంది ఆందోళనకారులు హెన్నెపిన్ కౌంటీ అటార్నీ మైక్ ఫ్రీమాన్ ఇంటిని ముట్టడించారు.. న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. ‘మాకు న్యాయం లభించేంత వరకు మేం ఇక్కడి నుంచి కదిలేది లేదు.. మైక్ ప్రీమాన్ వెంటనే చర్యలు తీసుకోవాలి..’ అంటూ ఓ ఆందోళనకారుడు అక్కడి నుంచే ఫేస్‌బుక్ లైవ్‌లో వ్యాఖ్యలు చేశాడు. భారీగా చేరుకుంటున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను పోలీసులు పలుమార్లు వాడాల్సి వచ్చింది.. ‘నాకు ఊపిరి ఆడటం లేదు... న్యాయం జరగకుంటే శాంతించం..’ అనే నినాదాలతో నగరం అంతా రెండ్రోజులుగా అట్టుడుకుతోంది.. 2014లో నల్లజాతీయుడైన ఎరిక్ గార్నెర్‌ను చంపినట్లుగానే.. ఇప్పుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను చంపారని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు ఘటనలను పోల్చిచూస్తున్నారు.. 


కాగా మైక్ ఫ్రీమాన్ ఈ ఘటన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.. ‘ఆ వీడియోను చూసి షాకయ్యాం.. జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తున్నాను. ప్రస్తుతం మిన్నెసోటా బ్యూరో ఆఫ్ క్రిమినల్ అప్రెహెన్సివ్, ఎఫ్‌బీఐ సంయుక్తంగా ఈ ఘటనపై విచారణ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందిన తర్వాత సరైన నిర్ణయాన్ని తీసుకుంటాం.. ఆందోళన కారులు కాస్త ఓపిక పట్టాలి.. విచారణ చేసి న్యాయం చేసేందుకు మాకు కాస్త టైమ్ ఇవ్వండి..’ అని మైక్ ఫ్రీమాన్ ఆందోళనకారులను ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. 

Updated Date - 2020-05-29T14:46:38+05:30 IST