కరోనా ఎఫెక్ట్: వీఐపీలకు వింత కష్టాలు!

ABN , First Publish Date - 2020-03-23T23:23:36+05:30 IST

కోవిడ్-19 కారణంగా పలువురు వీఐపీలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు..

కరోనా ఎఫెక్ట్: వీఐపీలకు వింత కష్టాలు!

హర్యానా: కోవిడ్-19 కారణంగా హర్యానాలోని పలువురు వీఐపీలకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ‘‘సారూ’’ అంటూ వెంట తిరిగిన వాళ్లే... ఇప్పుడు వింతగా చూడడం మొదలు పెట్టారు. స్థానికుల ప్రవర్తనతో స్వచ్ఛందంగా క్వారంటైన్లో ఉన్న వీఐపీలంతా ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. పిల్లలు, కుటుంబ సభ్యులు విదేశాల నుంచి రావడం వల్ల హోం క్వారంటైన్‌లో ఉండాలంటూ అధికారులు ఇటీవల కొందరు వీఐపీల ఇళ్లముందు నోటీసులు అంటించారు. అయితే క్వారంటైన్ నోటీసులను స్థానికులు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుండడంతో వీరికి  కష్టాలు మొదలయ్యాయి. ఓ న్యాయమూర్తి కుటుంబం మొదలు సీఎం పేషీలో పనిచేసే ఐఏఎస్ అధికారి కుటుంబం దాకా ఇదే పరిస్థితి. చండీగఢ్‌లో ప్రముఖ లాయర్ పునీత్ బాలి కుటుంబానిది కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి. బాలీ సతీమణి పవీలా బాలి మాట్లాడుతూ...


‘‘మా ఇంట్లో వైరస్ ఉందంటూ పాలవాడు పాలుపోసేందుకు తిరస్కరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించగలరా? ముందస్తు జాగ్రత్త కోసం మా అంతట మేమే స్వచ్ఛందంగా క్వారంటైన్ విధించుకున్నట్టు నేను అతడికి నచ్చజెప్పాల్సి వచ్చింది. కానీ స్థానికులు మాత్రం మా ఇంటి బయట ఫోటోలు తీసి వాట్సాప్‌లో షేర్ చేస్తున్నారు. మా ఇంట్లో పనిచేస్తే తమ ఇంట్లోకి రావద్దంటూ పని మనిషిని కూడా ఓ పొరుగింటావిడ  అడ్డుకున్నారు..’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక స్వచ్ఛంద క్వారంటైన్లో ఉన్న మరికొందరు వీఐపీల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇళ్ల ముందు క్వారంటైన్ నోటీసులు కనిపిస్తే అదేదో నిషిద్ధమన్నట్టు స్థానికులు భావిస్తున్నారంటూ వీళ్లంతా లబోదిబోమంటున్నారు.


‘‘ప్రస్తుత పరిస్థితుల్లో కలిసికట్టుగా నిలబడాల్సింది పోయి అందరూ మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. మా ఇళ్లకు వస్తువులు తీసుకొచ్చేందుకు తిరస్కరిస్తుండడంతో షాక్‌కు గురవుతున్నాం. మా పరిస్థితే ఇలా ఉంటే ఎలాంటి సదుపాయాలు లేని సామాన్యుల సంగతేంటి?’’ అని క్వారంటైన్లో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ‘‘ప్లీజ్ స్టాప్ కరోనా షేమింగ్’’ పేరుతో పవీలా బాలి ఓ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లంతా క్వారంటైన్లో ఉన్నంత మాత్రాన వాళ్లందరికీ కరోనా ఉన్నట్టు కాదనీ.. వాళ్లందరూ బాధ్యత కలిగిన పౌరులైందున అనవసర భయాలు సృష్టించడం మానుకోవాలని ఆమె ప్రచారం చేస్తున్నారు. కాగా వైరస్ వ్యాప్తి చెందకుండా విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు రెండు వారాలు దూరంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ పోస్టర్లు అతికిస్తున్నామని అధికార యంత్రాంగం చెబుతోంది. 

Updated Date - 2020-03-23T23:23:36+05:30 IST