Abn logo
Mar 3 2021 @ 04:51AM

విరాజిత కన్నా... స్వేచ్ఛగానే తెలుసు!

‘ఫిమేల్‌ ఫ్లాట్‌మేట్‌’లో ఈతరం అమ్మాయి...

ప్రేమను లోపల దాచుకొని పైకి కోపం నటించింది!

‘మిస్టర్‌ పెళ్లాం’లో గృహిణి...

మేల్‌ ఇగో ఉన్న భర్తకు ప్రేమతో పరిస్థితి వివరిస్తుంది!

‘కొవిడ్‌లో హాస్పటల్స్‌’లో ప్రెగ్నెంట్‌...

బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు మాతృమూర్తి వేదన చూపించింది!

‘నువ్వే కావాలి’లో విలన్‌...

మరో అమ్మాయితో ప్రేమలో ఉన్న అబ్బాయిని ప్రేమిస్తుంది!

అతడి ప్రేమలో చిచ్చు పెడుతుంది! వేరే ఉద్యోగం రాకుండా అడ్డుపడుతుంది!

ఇలా విలక్షణ పాత్రలతో యూట్యూబ్‌లో మంచి పేరు తెచ్చుకున్న అమ్మాయి విరాజిత. తన కెరీర్‌ గురించి ఆమె మాటల్లోనే...


మాది విశాఖపట్టణం. పుట్టి పెరిగిందీ, చదువంతా సాగిందీ అక్కడే. నేను ఎంబీఏ చేశా. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. ఏడాది పాటు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ కంపెనీలో హెచ్‌ఆర్‌గా పని చేశా. అయితే, ఓ రోజు ‘నేను నటించగలను. ఫిల్మ్స్‌ చేయగలను. నాకు ఆసక్తి ఉంది’ అని అర్థమైంది. నా ప్రయత్నాలు ప్రారంభించాలని ఉద్యోగం వదిలేసి మరీ వెంటనే హైదరాబాద్‌ వచ్చేశా. బేసిగ్గా... నాకు స్టేజి ఫియర్‌ తక్కువ. విశాఖలో కామెడీ క్లబ్స్‌, థియేటర్స్‌ ఉండేవి. చిన్నతనం నుంచి స్కిట్లు, డ్రామాల్లో నటించిన అనుభవం ఉంది. అందువల్ల... నటించగలనా? లేదా? అనే సందేహాలు రాలేదు.


సైడ్‌ క్యారెక్టర్‌.. మెయిన్‌కి డబ్బింగ్‌..

హైదరాబాద్‌ వచ్చిన తర్వాత ఆడిషన్స్‌ ఇవ్వడం ప్రారంభించా. క్యాప్‌డీటీలోనూ ఆడిషన్‌ ఇచ్చా. ‘ఏమైనా అవకాశాలు ఉంటే చెబుతాను’ అన్నారు. ఓ ఫిల్మ్‌లో సైడ్‌ క్యారెక్టర్‌ ఇచ్చారు. చేశాను. అయితే, ఎవరైతే మెయిన్‌ క్యారెక్టర్‌ చేశారో... ఆ అమ్మాయి వాయిస్‌ బాలేదని నాతో డబ్బింగ్‌ చెప్పించారు. యూట్యూబ్‌లో నా ప్రయాణం అలా మొదలైంది. ఆ తర్వాత క్యాప్‌డీటీ నుంచి ఫోన్‌ వచ్చింది... ‘ఫిమేల్‌ ఫ్లాట్‌మేట్‌ అని ఓ సిరీస్‌ ప్రారంభించాలనుకుంటున్నాం. కొత్తవాళ్లతో వెళ్దామనుకుంటున్నాం. మీకు ఆసక్తి ఉంటే ప్రయత్నిద్దాం’ అన్నారు. నేను మరోసారి వాళ్లను కలిశా. స్వేచ్ఛ పాత్రలో నటించే అవకాశం ఇచ్చారు. ఆ సిరీస్‌ చాలా సక్సెస్‌ అయ్యింది. మంచి పేరు రావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.


ప్రెగ్నెంట్‌గా ఈజీ కాదు!

‘ఫిమేల్‌ ఫ్లాట్‌మేట్‌’ సిరీస్‌లో నటిస్తూ, ఆ తర్వాత మరికొన్ని యూట్యూబ్‌ ఫిల్మ్స్‌, సిరీస్‌లు చేశా. అయితే, జనాలకు నేను విరాజిత కన్నా స్వేచ్ఛ (ఫిమేల్‌ ఫ్లాట్‌మేట్‌లో ఆమె పాత్ర పేరు) గానే ఎక్కువ తెలుసు. నాకు ‘పెళ్లి చూపులు లవ్‌ స్టోరి’ చాలా ఇష్టం. ‘నువ్వే కావాలి’ అని ఇంకో సిరీస్‌ చేశా. అందులో నాది నెగెటివ్‌ రోల్‌. అదీ నాకిష్టమే! ‘కొవిడ్‌లో హాస్పిటల్స్‌’ అని ఓ వీడియో చేశాం. అందులో ప్రెగ్నెంట్‌గా చేశా. అదంత ఈజీ కాదు. డెలివరీ పెయిన్స్‌ చూపించేటప్పుడు ఓవర్‌గా చేశానని అనుకుంటారా? లేదా ఇంత ఈజీగా చూపిస్తుందని అనుకుంటారా?! ఎలా రిసీవ్‌ చేసుకుంటారో? అని మథనపడ్డా. కానీ, మంచి స్పందన వచ్చింది. ‘పెళ్లై, పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత ప్రెగ్నెంట్‌గా చేయడం వేరు... యంగ్‌ ఏజ్‌లో నువ్వు ఆ రోల్‌ చేయడం వేరు. చాలా బాగా చేశావ్‌’ అని చాలామంది మెచ్చుకున్నారు.

మంచి నటి అనిపించుకోవాలి!

హీరోయిన్‌ కంటే మంచి నటి అవ్వాలని, అనిపించుకోవాలని నేను ప్రయత్నిస్తా. నా లక్ష్యమదే! అందుకని... నెగెటివ్‌ రోల్స్‌, మంచి పాత్రలు వస్తే ‘నో’ చెప్పను. ఎందుకంటే? హీరోయిన్‌ అంటే సెటిల్డ్‌గా చేయాలేమో!  ‘మంచి అమ్మాయి. ముద్దు ముద్దుగా, అందంగా నటిస్తుంది’ వంటి ప్రశంసల కన్నా... ‘ఏ పాత్రలోనైనా ఈ అమ్మాయి నటించగలదు’ అనిపించుకోవాలి. విలనిజం, కోపం, అమాయకత్వం, అణిగిమణిగి ఉండే అమ్మాయితత్వం... విభిన్న పాత్రలు చేయాలని కోరుకుంటున్నా.


సినిమాలు... డిస్కషన్లు!

కొంతమంది దర్శకులు యూట్యూబ్‌లో సిరీస్‌లు, ఫిల్మ్స్‌ చూస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు, అనుకోకుండాఎదురుపడినప్పుడు ఇంకొందరు ‘మీరు నటించినవి చూశాం. బావున్నాయి’ అని చెబుతారు. ‘మా సినిమాలో ఓ పాత్ర ఉంది. మీకు చేసే ఇంట్రెస్ట్‌ ఉందా?’ అని దర్శకులు అడుగుతుంటారు. ఎక్కువమంది యూట్యూబ్‌లో చూసి ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా ఆడిషన్‌ చేయరు. కొన్ని సినిమాలు డిస్కషన్‌ స్టేజిలో ఉన్నాయి. సినిమాల్లోనూ హీరోయిన్‌గానే చేయాలని అనుకోవడం లేదు. స్కిన్‌ షో, ఇంటిమసీ సీన్స్‌ లేకుండా మంచి పాత్ర వస్తే తప్పకుండా చేస్తా. అభినయానికి ఆస్కారం ఉండాలి. ఫ


చదువు మానేసి రావొద్దు!

అమ్మానాన్నలకు ఏకైక సంతానం కావడంతో ఎప్పుడూ నా ఇష్టానికి అడ్డు చెప్పింది లేదు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకవేళ నేను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిలో ఉండి ఉంటే.. ఇటువైపు వచ్చేదాన్ని కాదేమో! స్వేచ్ఛ ఉండటం వల్ల నటినయ్యా. చాలామంది ఉద్యోగాలు, చదువులు వదిలేసి ఇటు వస్తున్నారు. కలల్ని సాకారం చేసుకోవడానికి అందరూ కష్టపడతారు. మంచి పేరు తెచ్చుకుని సక్సెస్‌ అవుతారు. ఒకవేళ పైకి వెళ్లిన తర్వాత అక్కణ్ణుంచి పడిపోతే పట్టుకోవడానికి ఓ బేస్‌ ఉండాలి. ఆ బేస్‌ చదువు. రైటింగ్‌, యాక్టింగ్‌ ఇంట్రెస్ట్‌ ఉన్నోళ్లు... చదువు మానేసి ఫిల్మ్స్‌ వైపు రావొద్దు. చదువు మనకు చాలా నేర్పిస్తుంది. 

Advertisement
Advertisement
Advertisement