విజృంభిస్తున్న జ్వరాలు

ABN , First Publish Date - 2022-01-18T05:10:21+05:30 IST

మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గ్రామాల్లో జ్వరాలు విజృంభించాయి. ప్రతి పల్లెల్లో ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు.

విజృంభిస్తున్న జ్వరాలు
ఉదయగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు

మంచం పడుతున్న పల్లెలు

ఓ వైపు జ్వరాలు.. మరో వైపు కరోనా కేసులు

నిర్ధారణ పరీక్షలకు మంగళం

ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు

కొత్తపల్లిలో విషజ్వరంతో మహిళ మృతి

 

ఉదయగిరి రూరల్‌, జనవరి 17: మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా గ్రామాల్లో జ్వరాలు విజృంభించాయి. ప్రతి పల్లెల్లో ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం కరోనా కేసులు విజృంభిస్తుండడంతో సోకుతున్నది కరోనా జ్వరమో, లేక మామూలు జ్వరమో.. అర్థంకాక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉదయగిరి పట్టణంతోపాటు మండలంలో ని దుంపవారిపల్లి, దుర్గంపల్లి, గండిపాళెం, వెంగళరావున గర్‌, వెంకట్రావుపల్లి, పప్పులవారిపల్లి, వెంకట్రావుపల్లి, మాసాయిపేట, దాసరిపల్లి, శకునాలపల్లి, బండగానిపల్లి, చెరువుపల్లి, చెర్లోపల్లి గ్రామాల్లో జ్వరాలు అధికంగా ఉన్నాయి. జ్వరాలు సోకినవారు ఉదయగిరిలోని పలు ప్రైవేటు వైద్యశాలలతోపాటు ప్రభుత్వ వైద్యశాలకు క్యూ కడుతున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో పడకలు ఖాళీ లేక జ్వరపీడితులను బెంచీలపైనే పండుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలు అధికంగా ఉన్నాయని పలువురు వైద్యులు తెలుపుతున్నారు. 


కొవిడ్‌ పరీక్షలకు మంగళం

 ఉదయగిరి ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాలల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలకు మంగళం పాడారు. ప్రజలు జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతుండడంతో పలువురు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు స్థానిక సీహెచ్‌సీ, పీహెచ్‌సీలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ సిబ్బంది పరీక్షలు చేయడంలేదని తెలియజేయడంతో ప్రైవేటు ల్యాబ్‌లు, వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం ర్యాపిడ్‌ పరీక్షలు నిలిపివేసి, వీటీఎం పద్ధతి ద్వారా పరీక్షలు చేయాలని సూచించింది. దీంతో సిబ్బంది కొవిడ్‌ లక్షణాలు కలిగిన వారికి వీటీఎం పద్ధతిలో పరీక్షలు నిర్వహించి వాటి నిర్ధారణ కోసం నెల్లూరుకు పంపాల్సి ఉంది. కానీ రవాణా సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది పరీక్షలకు మంగళం పాడారు. 


పేదల దోపిడీ

 ప్రైవేటు ల్యాబ్‌లు, వైద్యశాలల  వారు ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించి ఒక్కొక్కరి వద్ద రూ.1500లు నుంచి రూ.2,500ల వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజులు జ్వరాలు తగ్గని వారు సైతం రక్త, మూత్ర, ఇతరత్రా పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు వెళుతున్నారు. ల్యాబ్‌ నిర్వాహకులు పరీక్షల నిర్వహించి వారి వద్ద సైతం రూ.1000ల నుంచి రూ.1500 లు వసూలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జ్వరాలను నియంత్రించడంతోపాటు స్థానిక సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 


జ్వరంతో మహిళ మృతి

కావలి రూరల్‌, జనవరి17: కావలి మండలం కొత్తపల్లి లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయని గ్రామస్థులు తెలి పారు. గ్రామానికి చెందిన మహిళ సొప్పర నిరోష(38) జ్వరంతో బాధ పడుతుండగా, ఆదివారం  నెల్లూరుకు తర లించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు.


చెన్నారెడ్డిపల్లెలోనూ జ్వరాలు 

పొదలకూరు, జనవరి 17 : మండలంలోని చెన్నారెడ్డిప ల్లెలోనూ విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కరోనా విజృంభి స్తున్న సమయంలో, జ్వరాలు వస్తుండడంతో  గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకుంటున్నా ఉపశమనం లభించడం లేదంటున్నారు. దీనికితోడు గ్రామంలో ఇటీవల నీరు కలుషితమైపోయిందని, ఆ నీటిని తాగడం వల్ల కూడా జ్వరాలు ప్రబలినట్లు పలువురు చెబుతున్నారు. తక్షణం వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-18T05:10:21+05:30 IST