TSRTC డ్రైవర్‌పై ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం.. సజ్జనార్ ఎలా స్పందిస్తారో!

ABN , First Publish Date - 2021-11-07T22:07:26+05:30 IST

తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే కారుకు సైడ్ ఇవ్వలేదంటూ బూతు పదాలతో విరుచుకుపడ్డారు.

TSRTC డ్రైవర్‌పై ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యం.. సజ్జనార్ ఎలా స్పందిస్తారో!

షాద్ నగర్: తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యే కారుకు సైడ్ ఇవ్వలేదంటూ బూతు  పదాలతో విరుచుకుపడ్డారు. చేతిలో కర్ర పట్టుకుని దిగు అంటూ డ్రైవర్‌పై దాడికి యత్నించారు. బెంగళూరు హైవేపై షాద్ నగర్-బాలానగర్ మధ్య ఈ ఘటన జరిగింది. 


ఎమ్మెల్యే కారుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని ఆ ప్రజాప్రతినిధి అనుచరులు ఆవేశంతో ఊగిపోయారు. ఓవర్ టేక్ చేసి బస్సుకు అడ్డంగా కారు నిలిపారు. కారు దిగి రెచ్చిపోయారు. ఆర్టీసీ డ్రైవర్‌పై బూతులందుకున్నారు. ఎమ్మెల్యే కారుకే సైడ్ ఇవ్వవా? అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌నే ఇంతలా తిట్టారంటే ఇక సామాన్యులెవరైనా ఎమ్మెల్యే కారుకు అడ్డం వస్తే వారి పరిస్థితి ఏంటో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.


ఎమ్మెల్యే కారుపై 14 చలానాలు

ఎమ్మెల్యే వాహనం(TS09FA0809)గా చెబుతున్న సదరు కారు కోచర్ల వినోద్ పేరుపై రిజిస్టర్ అయి ఉంది. ఈ కారుపై ట్రాఫిక్ పోలీసులు 14 చలానాలు విధించారు. అందులో 12 ఓవర్ స్పీడ్ చలానాలు ఉండడం గమనార్హం. ఇన్ని చలానాలు పెండింగ్‌లో ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.




సజ్జనార్ ఏం చేస్తారో..

ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ వచ్చాక సంస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా వినూత్నంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టడానికి సజ్జనార్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఆర్టీసీ డ్రైవర్‌పై ఎమ్మెల్యే అనుచరులు బూతులతో విరుచుకు పడడంపై సంస్థ ఎండీగా సజ్జనార్ ఎలా స్పందిస్తారో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated Date - 2021-11-07T22:07:26+05:30 IST