‘విరసం’పై నిషేధం తగదు

ABN , First Publish Date - 2021-06-11T05:51:08+05:30 IST

విప్లవ రచయితల సంఘం యాభై ఏళ్లకుపైగా తెలుగు సాహిత్య మేధో రంగాల్లో పని చేస్తున్న సంస్థ. సమాజంలో మార్పును కోరి సంస్కరణోద్యమ కాలంలో కందుకూరి , గురజాడ , కుసుమ ధర్మన్న, దేశానికి బ్రిటిష్ వలస పాలన నుండి...

‘విరసం’పై నిషేధం తగదు

తెలంగాణ ప్రభుత్వం విప్లవ రచయితల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించి నిషేధించటం తగదంటూ రచయితలు, కళాకారులు, మేధావులు రాసిన లేఖ


శ్రీ సోమేష్‍కుమార్ గారు,

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వం

విప్లవ రచయితల సంఘం యాభై ఏళ్లకుపైగా తెలుగు సాహిత్య మేధో రంగాల్లో పని చేస్తున్న సంస్థ. సమాజంలో మార్పును కోరి సంస్కరణోద్యమ కాలంలో కందుకూరి , గురజాడ , కుసుమ ధర్మన్న, దేశానికి బ్రిటిష్ వలస పాలన నుండి స్వతంత్రాన్ని కోరి జాతీయోద్యమ కాలంలో ఉన్నవ లక్ష్మీనారాయణ, గరిమెళ్ళ సత్యనారాయణ, దామరాజు పుండరీకాక్షుడు, గుఱ్ఱం జాషువా, కనుపర్తి వరలక్ష్మమ్మ వంటి వాళ్ళు వ్యక్తులుగా చేసిన సాహిత్య సృజన కలాపాన్ని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకువెళుతున్న సంస్థ. ఆర్ధిక అసమానతలు లేని నవ సమాజ నిర్మాణం లక్ష్యంగా అభ్యుదయ కరమైన భావజాలం కలిగిన రచయితలు సంఘాలుగా ఏర్పడి చేసిన కృషిని మరింత నిర్దిష్టంగా, సముజ్వలంగా కొనసాగిస్తున్న సంస్థ విరసం.


తెలుగు సమాజాన్ని, భాషా సాహిత్య రంగాలను ప్రజాస్వామిక విలువల దిశగా వికసింప చేయటంలో గొప్ప చారిత్రక పాత్రను నిర్వహించిన సంస్థ ఇది. సాహిత్య చరిత్రలో ప్రముఖంగా ప్రస్తావించబడే శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావు, సత్యమూర్తి, రావిశాస్త్రి, కాళీ పట్నం రామారావు వంటి కవులు, రచయితలు విరసంతో సంబంధం ఉన్నవాళ్లే. విరసం ఆళ్వార్ స్వామి, కాళోజి తదితర తెలంగాణా రచయితల సాహిత్యానికి పెద్ద పీట వేసింది. ఈ నాడు తెలంగాణ రాష్ట్ర కవిగా గుర్తించి గౌరవించుకొంటున్న కాళోజి కడదాకా విరసంతో ఉన్నాడు. ఇక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో విరసం నిర్వహించిన సాంస్కృతిక పాత్రను ఈ సందర్భంగా తప్పక గుర్తుచేసుకోవాలి. అటువంటి విప్లవ రచయితల సంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించడం ప్రజాస్వామ్య విలువలకు, ఆదర్శాలకు భంగకరం అని మేం అభిప్రాయపడుతున్నాం. భావ వినిమయం లేకుండా మానవజాతి వికాసాన్ని ఊహించుకోలేం. సాహిత్యమంటే భావ వినిమయం. మానవీయ విలువల ఉన్నతీకరణ దిశగా సాహిత్య సృజనలో రచయితల పాత్ర కీలకమైంది. రచయితలు, మేధావులు తమ సృజనాత్మక కృషి ద్వారా , విమర్శన వ్యాసంగం ద్వారా సమాజ సంస్కృతుల ప్రజాస్వామికీకరణకు దోహదం చేస్తారు. విరసం చేసింది అదే. 


విప్లవ రచయితల సంఘం సభ్యులు తమ సాహిత్యం ద్వారా గత యాభై ఏళ్లలో తెలుగు సమాజ సాహిత్య రంగాలలో ప్రజాస్వామికీకరణకు దోహపడుతున్నారని మేం భావిస్తున్నాం. ప్రజా చైతన్యాన్ని అక్షరబద్ధం చేసే క్రమంలో ఆ సంస్థ అన్ని చట్టబద్ధ అవకాశాలను వాడుకొని పని చేస్తున్నది. కాబట్టి విరసంతో సహా 16 సంఘాలను చట్ట వ్యతిరేక సంస్థలుగా ప్రకటించిన మీ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.


(ఉభయ తెలుగురాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాలలో ఉన్న తెలుగు కవులు, రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు, మేధావులు సహా మొత్తం 780మంది ఈ లేఖపై సంతకాలు చేశారు. దేశ విదేశాలలో ఆయా రంగాలకు చెందిన స్థానిక ప్రముఖులు అనేక మంది కూడా వీరిలో ఉన్నారు.)

Updated Date - 2021-06-11T05:51:08+05:30 IST